Top Ten News @ 9 PM
close

తాజా వార్తలు

Published : 14/06/2021 20:55 IST

Top Ten News @ 9 PM

1. Politics: భాజపాలో చేరడం సంతోషంగా ఉంది: ఈటల

భాజపాలో చేరడం సంతోషంగా ఉందని తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ పోరాటంలో మొక్కవోని దీక్షతో పోరాడానని అన్నారు. భాజపాలో చేరిన అనంతరం దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో నా పాత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌ పాలన ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని భావించామని, మేధావుల సూచనలు తీసుకుంటామని మొదట్లో చెప్పిన కేసీఆర్‌.. అనేక మంది మేధావులకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్‌ నేతృత్వంలో ఎంత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నారో మంత్రులు గుండెలపై చేయివేసుకొని చెప్పాలన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారందరినీ భాజపాలోకి ఆహ్వానిస్తామన్నారు.

2. YS Jagan: ప్రజలకు చేరువగా హెల్త్‌హబ్స్‌

రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసే హెల్త్‌ హబ్స్‌ జనావాసాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, థర్డ్‌వేవ్‌, హెల్త్‌హబ్స్‌ తదితర అంశాలపై అధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో శిశువులు, చిన్నారుల వైద్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. థర్డ్‌వేవ్‌ వార్తల నేపథ్యంలో చిన్నారులు, శిశువులకు అత్యుత్తమ వైద్యం అందించాలని సీఎం ఆదేశించగా, మొత్తంగా 1600 ఐసీయూ బెడ్లు ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అదనంగా చిన్నపిల్లల వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, సహాయక సిబ్బందిని తీసుకునేలా ప్రణాళిక సిద్ధం చేశామని సీఎం దృష్టికి తీసుకెళ్లగా, నెలరోజుల్లోగా ఈ పనులు పూర్తిచేయాలని జగన్‌ ఆదేశించారు.

AP news: 100 రోజుల పాటు క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌
ఎమ్మెల్సీ పదవులకు ఏపీ గవర్నర్‌ ఆమోదం

3. 5జీ ట్రయల్స్‌ ప్రారంభించిన ఎయిర్‌టెల్‌

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించిన ట్రయల్స్‌ను ప్రారంభించింది. టెలికాం విభాగం (డాట్‌) అనుమతిచ్చిన నెల రోజులకే గురుగ్రామ్‌లోని సైబర్‌ హబ్‌ ప్రాంతంలో ఈ పరీక్షలను జరిపింది. డాట్‌ నుంచి అనుమతి పొందిన సంస్థల్లో ట్రయల్స్‌ ప్రారంభించిన తొలి సంస్థగా ఎయిర్‌టెల్‌ నిలిచింది. ట్రయల్స్‌ సందర్భంగా 1జీబీ వేగంతో డేటా బదిలీ అయినట్లు తెలిసింది. త్వరలో ఇదే తరహాలో ముంబయిలో సైతం ఎయిర్‌టెల్‌ పరీక్షలు నిర్వహించనుంది. ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, దిల్లీ టెలికాం సర్కిళ్లలో 5జీ ట్రయల్స్‌ నిర్వహణకు డాట్‌ ఎయిర్‌టెల్‌కు అనుమతిచ్చింది.

4. HYD: ఎంఎంటీఎస్‌ తిరిగేదెప్పుడు..?

భాగ్యనగరవాసులను కరోనా కష్టాలు ఇంకా వీడటం లేదు. లాక్‌డౌన్‌తో ఆగిపోయిన ఎంఎంటీఎస్‌ రైళ్లు ఏడాదిన్నర గడిచినా పట్టాలెక్కలేదు. దీంతో చిరువ్యాపారులు, ఉద్యోగులు, కూలీలకు అవస్థలు తప్పడం లేదు. 5, 10 రూపాయలకే దర్జాగా ప్రయాణించేవారు.. ఇప్పుడు రోజుకు దాదాపు రూ.100 రవాణాకు ఖర్చు చేయాల్సి వస్తోంది. మెట్రో, ఆర్టీసీ నడుస్తున్నప్పుడు ఎంఎంటీఎస్‌ ఎందుకు  నడపడం లేదంటూ నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌ మహానగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులతో మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టం (ఎంఎంటీఎస్‌) అందుబాటులోకి వచ్చింది. ఈ రైళ్ల రాకతో.. ఎక్కువ దూరాన్ని తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు కలిగింది.

5. రాష్ట్రంలో ఫీవర్‌ సర్వే కొనసాగిస్తాం: డీహెచ్‌

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మే 25 నుంచి జూన్‌ 13 వరకూ హై రిస్క్‌ ఉన్న వ్యక్తులకు వ్యాక్సిన్‌ ఇస్తున్నాం. ఇప్పటివరకూ 16.75లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చాం. మరోవైపు  సర్వే ద్వారా 4 లక్షలకు పైగా కిట్లు అందించాం. ఇంటింటి సర్వే మూడు రౌండ్లు పూర్తయింది. ఈ సర్వేను కొనసాగించాలని నిర్ణయించాం’ అని శ్రీనివాసరావు తెలిపారు.

6. ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’తో  వలస కార్మికులకు మేలు

‘ఒకే దేశం.. ఒకే రేషన్‌ కార్డు’పథకంతో  కొవిడ్‌ కష్ట కాలంలో వలస కార్మికులకు చాలా మేలు కలుగుతుందని అని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఈ విధానం ద్వారా వారికి దేశంలో ఏ ప్రాంతంలోని చౌక ధరల దుకాణాల ద్వారానైనా ఆహార ధాన్యాలను పొందే వీలు కలుగుతుందని తెలిపింది. లాక్‌డౌన్‌లో వలస కార్మికుల కష్టాలపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు వివరాలు అడిగింది. ఈ నేపథ్యంలో సోమవారం కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో సర్కారు ఈ పథకం గురించి పలు అంశాలను  వివరించింది.   అత్యంత చౌకగా అందించేందుకు తగినన్ని ఆహార ధాన్యాలను అందుబాటులో ఉంచాలని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చినట్లు కేంద్రం పేర్కొంది. 

7. Paytm: ఇకపై వ్యాక్సిన్‌ స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు!

దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కోసం అందుబాటులో ఉన్న కొవిన్‌ యాప్‌తో పాటు థర్డ్‌ పార్టీ డెవలపర్ల నుంచి వ్యాక్సిన్‌ స్లాట్‌ల బుకింగ్‌కు కేంద్ర ప్రభుత్వం గత నెలలో అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం తమ యాప్‌లో వ్యాక్సినేషన్‌ స్లాట్‌ బుకింగ్‌ను ప్రవేశపెట్టినట్లు సోమవారం ప్రకటించింది. పేటీఎం వినియోగదారులు తమ సమీపంలోని వ్యాక్సిన్‌ కేంద్రాలు తెలుసుకొనేందుకు, కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాల స్లాట్‌లను బుక్‌ చేసుకోవడానికి సహాయపడుతుందని వారు వెల్లడించారు. వినియోగదారులు వ్యాక్సిన్‌ స్లాట్లను బుక్‌ చేసుకొని టీకా తీసుకునేందుకు ఈ కొత్త సేవలు సహకరిస్తాయని పేటీఎం ప్రతినిధులు వెల్లడించారు.

8. ఆనంద్‌తో ఆట.. నేను చేసిన పనికి క్షమాపణలు!

అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా రిలీఫ్‌ ఫండ్‌ పేరిట చెస్‌ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఆదివారం పలువురు ప్రముఖులతో చెస్‌ పోటీల్లో తలపడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జిరోధా సంస్థ సహ యజమాని నిఖిల్‌ కామత్‌ సైతం పోటీపడి ఆనంద్‌ను ఓడించారు. అయితే, అతడు మోసం చేసి గెలిచినట్లు వార్తలు రావడంతో ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌(ఏఐసీఎఫ్‌) కార్యదర్శి భరత్‌ చౌహన్‌ స్పందించారు. ఛారిటీ పోటీల్లో ఇలా మోసం చేసి గెలవడం దురదృష్టకరమని వాపోయారు. ఈ క్రమంలోనే నిఖిల్‌ కామత్‌ సైతం ట్విటర్‌లో ఓ పోస్టు చేసి తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పారు.

9. టీకా తీసుకున్నవారిలో మ్యాగ్నటిక్‌ పవర్స్‌.. నిజమెంత?

కొవిడ్‌ టీకా తీసుకున్నాక తమలో అయిస్కాంత శక్తులు ఉద్భవిస్తున్నాయంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటీవల దిల్లీ, నాసిక్‌కు చెందిన వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయగా..  తాజాగా ఝార్ఖండ్‌లోని హజారిబాగ్‌కు చెందిన తాహిర్‌ అన్సారీ అనే మరో వ్యక్తి కూడా టీకా తీసుకున్నాక తన శరీరంలో అయిస్కాంత శక్తులు కనిపించినట్టు చెప్పాడు. ‘‘శనివారం నేను వ్యాక్సిన్‌ వేయించుకున్నా. నాసిక్‌లో ఓ వ్యక్తి అయిస్కాంత శక్తులు వచ్చినట్టు చెప్పిన వీడియో చూసి ఓసారి టెస్ట్‌ చేద్దామని నిర్ణయించుకున్నా. అయితే, నా శరీరంపై స్పూన్‌లు‌, ఫోర్క్‌లు‌, నాణేలు అతుక్కోవడం చూసి ఆశ్చర్యపోయా’’ అని అతడు చెప్పినట్టు ‘ఇండియా టుడే’ పేర్కొంది.

10. Gold Rate: తగ్గిన బంగారం, వెండి ధరలు

గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత శుక్రవారం రూ.441 మేర పెరిగిన బంగారం ధర సోమవారం అదేస్థాయిలో తగ్గింది. దేశ రాజధాని నగరం దిల్లీలో రూ.464లు తగ్గడంతో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.47,705కి చేరింది. క్రితం ట్రేడింగ్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.48,169గా ఉంది. మరోవైపు, వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. కిలో వెండి ధరపై రూ.723లు తగ్గడంతో ప్రస్తుతం రూ.71,143 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ విలువ బలపడటం, అంతర్జాతీయ పసిడి మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలే ఈ హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు భావిస్తున్నారు. 

Karnataka: కాటేసిన తాచుపాముతో ఆసుపత్రికి..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని