Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు
close

తాజా వార్తలు

Published : 22/07/2021 20:57 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. జల దిగ్బంధంలో నిర్మల్‌, భైంసా

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్‌ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుండటంతో స్వర్ణ, కడెం, భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఒక్కసారిగా గేట్లు ఎత్తి నీరు వదిలేయడంతో భైంసా ఆటోనగర్‌లోని ఇళ్లను వరద నీరు చుట్టుముట్టింది. ఆటోనగర్‌, ఎన్‌.ఆర్‌.గార్డెన్ ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వరద నీటిలో చిక్కుకుపోయిన దాదాపు 150 మందిని అగ్నిమాపక సిబ్బంది, గజఈతగాళ్లు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

2. అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు: బొత్స

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక చర్యల్లో వార్డు, సచివాలయ ఉద్యోగులను భాగస్వాములను చేయాలని కమిషనర్లను ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

3. కేసీఆర్‌ను ఓడిస్తేనే పీడిత ప్రజలకు భవిష్యత్తు: మందకృష్ణ

దళితుల్లో ఐక్యత లోపం, రాజ్యాధికారం చేపట్టాలనే చైతన్యం లేకపోవడంతోనే వెనక్కి నెట్టి వేయబడుతున్నామని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్‌ను ఓడిస్తేనే పీడిత ప్రజలకు భవిష్యత్తు ఉంటుందన్నారు. దళితులను మోసం చేసేందుకే మేనిఫెస్టోలో మూడెకరాల భూమి పంపిణీ అంశాన్ని పొందుపరిచారని.. ఏడేళ్ల పాలనలో ఏడు వేల మందికి కూడా భూమి పంపిణీ చేయలేదని ఆక్షేపించారు. దళితుల ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్‌ చంపుతున్నారని విమర్శించారు.

ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్‌ నేతకు గాయాలు
RAIN effect: వణుకుతున్న హైదరాబాద్‌

4. రాయలసీమకు న్యాయం చేయండి: ఏపీ భాజపా

ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలోని రాష్ట్ర భాజపా నేతలు గురువారం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితులు, ముంపు గ్రామాల సమస్యను కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి సంబంధించి ముంపు గ్రామాల ప్రజలకు ఇప్పటి వరకు సాయం అందలేదని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితిని వివరించారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో చొరవచూపి ఆ ప్రాంతానికి న్యాయం చేయాలని భాజపా నేతలు కేంద్ర మంత్రిని కోరారు.

5. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కేటీఆర్‌

గత మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అదేశించారు. ఈమేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాల వల్ల ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అరవింద్‌ కుమార్‌ను కేటీఆర్‌ ఆదేశించారు. ఇప్పటికే నిర్మల్‌ వంటి చోట్ల భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో జరుగుతున్న సహాయక చర్యలపై జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. 

6. మోదీ టైం ఇచ్చారు.. దిల్లీ వెళ్లి కలుస్తా!

వచ్చే వారం దిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నట్టు పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. కోల్‌కతాలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘రెండు, మూడు రోజులు దిల్లీ పర్యటనకు వెళ్తున్నా. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సమయం ఇస్తే ఆయన్ను కలుస్తా. ప్రధాని నరేంద్ర మోదీ నాకు సమయం ఇచ్చారు. ఆయనతో సమావేశమవుతా’ అని చెప్పారు.

7. భారత్‌లో ఇంకా డెల్టా వేరియంట్‌దే ఆధిపత్యం..!

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్ విలయానికి డెల్టా వేరియంట్‌ రకమే కారణమని ఇప్పటికే పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇప్పటికీ డెల్టా రకం ఆధిపత్యమే కొనసాగుతోందని కొవిడ్‌-19పై ఏర్పాటైన కన్సార్టియం (INSACOG) స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో ఈరకం పాజిటివ్‌ కేసులే ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొంది. అయితే, డెల్టా కంటే ఎక్కువ ప్రమాదకరమైన డెల్టా ఉపరకాలు ఉన్నాయనడానికి ప్రస్తుతానికి ఎటువంటి రుజువులు లేవని INSACOG వెల్లడించింది.

8. సారీ.. వైఫల్యానికి బాధ్యత మాదే..!

యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడిని అన్ని దేశాలు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వ్యాప్తిని అరికట్టేలా కఠినమైన ఆంక్షలు, కరోనాను నిరోధించే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే వైరస్ మాత్రం అదుపులోకి రావడం లేదు సరికదా.. రూపాంతరాలు చెందుతూ విరుచుకుపడుతూనే ఉంది. దీంతో ప్రభుత్వాల చర్యలపై విమర్శలు ఎదురవుతున్న వేళ.. కొందరు దేశాధినేతలు వాటికి తలొగ్గక తప్పట్లేదు. టీకా పంపిణీలో లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైనందుకు గానూ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ తాజాగా ప్రజలకు క్షమాపణలు చెప్పారు. 

9. పాస్‌బుక్‌ కావాలా? రూ.5లక్షలు ఇవ్వాలి

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాటారం తహశీల్దార్‌ పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ గురువారం అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు. కాటారం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన అయితా హరికృష్ణ అనే రైతు తన భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తహశీల్దార్‌ సునీతను ఆశ్రయించాడు. రూ.5లక్షలు లంచం ఇస్తేనే భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తానని చెప్పడంతో హరికృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తహశీల్దార్‌తో కుదుర్చుకున్న ముందస్తు ఒప్పందం మేరకు తొలి విడతగా రూ.2లక్షలు లంచం ఇస్తుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు తహశీల్దార్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

10. ఎదురు నిలిచిన పిల్లి.. తోకముడిచిన పాము

యజమాని కుటుంబాన్ని తాచుపాము నుంచి కాపాడిన ఓ పిల్లి సూపర్‌ హీరోగా నిలిచింది. తన యజమాని కుటుంబాన్ని రక్షించేందుకు ప్రమాదకరమైన తాచుపాముతో పోరాడింది. దాదాపు గంటసేపు విషసర్పాన్ని ఎటూ కదలనివ్వకుండా ఎదురు నిలిచి పామును తోకముచిచేలా చేసింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒడిశా భువనేశ్వర్‌లోని భీమసాంగి ప్రాంతంలో నివశిస్తున్న సంపత్‌ కుమార్‌ పెరట్లోకి నాగుపాము ప్రవేశించింది. ఇంటి వెనక నుంచి వస్తున్న పామును గుర్తించిన పెంపుడు పిల్లి చిన్ను దాన్ని పెరట్లోనే అడ్డుకుంది. 

గేదెతో ముఖాముఖీ.. నవ్వులు పూయిస్తున్న వీడియో!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని