Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 31/07/2021 20:58 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. కోర్టుల్లోనూ మాతృభాషకు ప్రాధాన్యం పెరగాలి: వెంకయ్యనాయుడు

మాతృభాష సంరక్షణకు సృజనాత్మక విధానాలపై దృష్టి సారించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు కూటమి సంస్థ నిర్వహించిన భాషాభిమానుల  అంతర్జాల సదస్సులో ఉప రాష్ట్రపతి ప్రసంగించారు. వివిధ దేశాల నుంచి వెయ్యిమందికి పైగా తెలుగు భాషాభిమానులు, భాషావేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. మాతృభాష పరిరక్షణకు ప్రాథమిక విద్య మాతృభాషలోనే సాగాలని, పరిపాలనలోనూ మాతృభాష ప్రస్పుటించాలని ఆకాంక్షించారు. కోర్టుల్లోనూ మాతృభాషకు ప్రాధాన్యం పెరగాలని, సాంకేతిక విద్యలోనూ పెద్దపీట వేయాలని సూచించారు. 

2. ప్రగతిభవన్‌, సచివాలయం భూములు అమ్మైనా దళితబంధు అమలు చేయాలి: రేవంత్

దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో  ఇందుకోసం ఏకగ్రీవ తీర్మానం చేయాలని, నిధులు లేకపోతే.. ప్రగతిభవన్‌, సచివాలయం భూములను అమ్మైనా దళితబంధు అమలు చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ఇందిరా భవన్‌లో టీపీసీసీ ఎస్టీ సెల్‌ ఆధ్వర్యంలో పోడు భూముల పరిరక్షణే ప్రధాన ఎజెండాగా జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.

తెలంగాణలో గిరిజనుల హక్కులు కాలరాస్తున్నారు: సీతక్క
తెలంగాణలో కొత్తగా 621 కొవిడ్‌ కేసులు

3. దేవినేని ఉమాకు జైల్లో ప్రాణహాని: భార్య అనుపమ ఆరోపణ

రాజమహేంద్రవరం కారాగారంలో తన భర్తకు ప్రాణహాని ఉందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు భార్య అనుపమ ఆరోపించారు. ఈ మేరకు ఏపీ గవర్నర్‌, హైకోర్టు సీజే, కేంద్ర, రాష్ట్రాల హోం మంత్రులకు లేఖలు రాశారు. కొండపల్లి అటవీప్రాంతంలో మైనింగ్‌ పరిశీలనకు వెళ్లిన సందర్భంలో దేవినేని ఉమాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

4. సమర్థ నాయకత్వం, సుస్థిర ప్రభుత్వంతోనే పారిశ్రామిక అభివృద్ధి సాధ్యం

సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడే పారిశ్రామికీకరణతో కూడిన అభివృద్ధి సాకారమవుతుందని.. తెలంగాణలో అదే జరుగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకగూడ గ్రామంలో పోకర్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేసిన ఇంజినీర్డ్ స్టోన్ ప్లాంటును మంత్రులు ఎర్రబల్లి దయాకర్, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. వ్యవసాయం, పరిశ్రమలు కలిసికట్టుగా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం పురోగమిస్తుందన్నారు.

5. అంజనాద్రే హనుమ జన్మస్థలం.. త్వరలో ఆధారాలతో పుస్తకం: ధర్మారెడ్డి

హనుమ జన్మస్థలంపై రెండు రోజుల పాటు అంతర్జాతీయ వెబినార్‌ నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ వెబినార్‌లో పలువురు పీఠాధిపతులు, పండితులు పాల్గొన్నట్లు చెప్పారు. ఈ మేరకు వెబినార్‌కు సంబంధించిన వివరాలను ధర్మారెడ్డి మీడియాకు వివరించారు. అంజనాద్రిని హనుమ జన్మస్థానంగా నిర్ధరించేందుకు పండిత పరిషత్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పలు ఆధారాలతో అంజనాద్రిని హనుమ జన్మస్థలంగా గుర్తించినట్లు తెలిపారు. అంజనాద్రే హనుమ జన్మస్థలంగా చెప్పే ఆధారాలతో త్వరలో పుస్తకం తీసుకొస్తున్నట్లు ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

6. ఎవరికి గుణపాఠం చెప్పేందుకు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నారు

తెలంగాణలో బహుజన స్థాపన వస్తే ఎవరూ ఆపలేరని విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బహుజనులు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలనేది పాలకుల అలోచన అని అన్నారు. హుజూరాబాద్‌లో మాత్రమే దళిత బంధు ఎందుకు తెరపైకి వచ్చిందని ప్రశ్నించారు. ఎలాంటి పరిశోధన చేయకుండానే.. ఎవరికో గుణపాఠం చెప్పేందుకు రూ.వెయ్యి కోట్లు పెడుతున్నారని విమర్శించారు. రూ.వెయ్యి కోట్లతో పేద విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు, ఫోన్లు కొనిపెట్టడమే కాకుండా అద్భుతమైన హాస్టళ్లను నిర్మించొచ్చు అని పేర్కొన్నారు. 20 వేల డిజిటల్‌ పాఠశాలలు ఏర్పాటు చేయొచ్చన్నారు.

7. రాజకీయాలకు బాబుల్‌ సుప్రియో గుడ్‌బై

భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు. ఇకపై సామాజిక సేవపై దృష్టిపెట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రివర్గం నుంచి బాబుల్‌ను తొలగించిన కొద్ది రోజులకే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దిల్లీలో కేంద్ర ప్రభుత్వం తనకు కేటాయించిన నివాసాన్ని కూడా నెల రోజుల్లో ఖాళీ చేస్తానని బాబుల్‌ వెల్లడించారు. తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని స్పష్టంచేశారు.

8. 46 జిల్లాల్లో 10శాతం పాజిటివిటీ రేటు..!

గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పది రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రత పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్యశాఖ, పది రాష్ట్రాల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. కొవిడ్‌ పాజిటివిటీ రేటు 10శాతం మించిన జిల్లాల్లో ప్రజలు సమూహాలుగా ఏర్పడకుండా కొవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సూచించింది. వీటితోపాటు కొవిడ్‌ టెస్టులు, వ్యాక్సిన్‌ పంపిణీ పెంచాలని అన్ని రాష్ట్రాలకూ సూచించింది.

9. జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా లలన్‌ సింగ్‌

బిహార్‌లో అధికార  జేడీయూ పార్టీ అధ్యక్షుడిగా లలన్‌ సింగ్‌ నియమితులయ్యారు. ఇదివరకు అధ్యక్షుడిగా ఉన్న రాజీవ్‌ రంజన్‌కు కేంద్రమంత్రి పదవి దక్కడంతో ఆయన స్థానంలో లలన్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌సీపీ సింగ్‌కు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో కేంద్రమంత్రిగా స్థానం దక్కడంతో జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా వైదొలిగారు. లలన్‌ సింగ్‌ ముంగేర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

10. క్వార్టర్‌ ఫైనల్లోకి మహిళల హాకీ జట్టు

భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. బ్రిటన్‌ జట్టు ఐర్లాండ్‌ను 2-0 గోల్స్‌ తేడాతో ఓడించడంతో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఆడే అవకాశం దక్కినట్లైంది. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళల హాకీ జట్టు క్వార్టర్స్‌కు చేరుకుంది. ఒలింపిక్స్‌ క్రీడలు మొదలైనప్పటి నుంచి ఇది మూడోసారి మాత్రమే.

100 మీటర్ల పరుగులో ఎలెన్‌ థామ్సన్‌ రికార్డు
ఒలింపిక్స్‌లో ఆరు గోల్డ్‌ మెడల్స్‌ లెడిక్కీవే


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని