Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 16/10/2021 20:58 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. ‘ఏక్‌ శ్యామ్‌ చార్మినార్‌ కే నామ్‌’ కోసం ట్రాఫిక్‌ ఆంక్షలు: సీపీ అంజనీకుమార్‌

‘ఏక్‌ శ్యామ్‌ చార్మినార్‌ కే నామ్‌’ కోసం చార్మినార్‌ పరిసరాల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నట్లు సీపీ అంజనీకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు చార్మినార్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఈ ఆదివారం నుంచి ‘ఏక్‌ శ్యామ్‌ చార్మినార్‌ కే నామ్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీనికోసం అఫ్జల్‌ గంజ్‌, మదీనా నుంచి వచ్చే వాహనాలను గుల్జార్‌ హౌస్‌ నుంచి మెట్టీ కా షేర్‌, కాళీకమాన్‌, ఎతెబార్ చౌక్‌ వైపు మళ్లించనున్నారు. ఫలక్‌నుమా, హిమ్మత్‌ పురా నుంచి వచ్చే వాహనాలు పంచమొహల్లా నుంచి షా ఫంక్షన్ హాల్‌, మొఘల్‌ పురా ఫైర్‌ స్టేషన్‌ రోడ్‌, బీబీ బజార్‌ వైపు మళ్లించనున్నారు. 

2. గుంటూరు జిల్లాలో దారుణం.. ప్రేమించాడని గొంతుకోసి చంపేశారు

గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం పల్లపాడులో ఐదు రోజుల క్రితం జరిగిన బండారు గోపి (19) హత్య కేసును చేబ్రోలు పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు కులాంతర ప్రేమే కారణమని పోలీసులు గుర్తించారు. గోపి హత్య కేసులో మొత్తం 11 మంది నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హత్యకు సంబంధించిన వివరాలను గుంటూరు దక్షిణ మండల డీఎస్పీ జెస్సీ ప్రశాంతి మీడియాకు వెల్లడించారు. పల్లపాడు గ్రామానికి చెందిన గోపి అదే గ్రామంలోని ఓ యువతిని ప్రేమించాడు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు గోపిని మందలించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా గోపి ఖాతరు చేయకపోవడంతో హత్యకు పథకం పన్నారు. ముందుగా స్నేహితుల సాయంతో గోపిని నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. తర్వాత కర్రలతో అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ఆటోలో అప్పాపురం కాలువ వద్దకు తీసుకువచ్చి అక్కడ కత్తితో గొంతుకోసి హత్య చేశారు.

కాపలాదారే కాజేశాడు.. చింతల్‌బస్తీలో భారీ చోరీ

3. ఈ నెల 17, 18 తేదీల్లో 12 ప్రత్యేక రైళ్లు: దక్షిణమధ్య రైల్వే

దసరా పండుగకు ఊరెళ్లిన వారికోసం ఈనెల 17, 18 తేదీల్లో వివిధ ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌- కాజీపేట, కాజీపేట-భద్రాచలం, భద్రాచలం-కాజీపేట, కాజీపేట-హైదరాబాద్‌, సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌- సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌ -విజయవాడ విజయవాడ - సికింద్రాబాద్, సికింద్రాబాద్-నిజామాబాద్, నిజామాబాద్-సికింద్రాబాద్, కాచిగూడ-కర్నూలు సిటీ, కర్నూలు సిటీ -కాచిగూడ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

4. మా బొగ్గు మాకే కావాలి: ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌

దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్‌ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో విద్యుత్‌ సంక్షోభం నెలకొనే ప్రమాద ముందని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో బొగ్గు గనులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మా బొగ్గు మాకే కావాలంటున్నాయి. భూపాలపల్లి నుంచి బొగ్గును తరలించొద్దని తెలంగాణ ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ అధికారులను కోరారు. భూపాలపల్లిలో విద్యుత్‌ ఉత్పత్తి  కోసమే తాడిచర్ల బొగ్గును వాడాలని సూచించారు. తాడిచర్ల నుంచి ఇతర రాష్ట్రాలకు బొగ్గు తరలింపుపై కేంద్రంలోని కొద్దరు పెద్దలు సింగరేణి అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు వినోద్‌ కుమార్‌ తెలిపారు.

5. ఆర్యన్‌ఖాన్‌: మొదటిసారి పెదవి విప్పిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి

డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మొదటిసారి పెదవి విప్పారు. డ్రగ్స్ ఒక్క మహారాష్ట్రలోనే దొరికాయా..? ముంద్రా పోర్టులో దొరికిన వాటి సంగతేంటి..? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే తమ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు మానుకోవద్దంటూ సవాలు విసిరారు. దసరా సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పలు వ్యాఖ్యలు చేశారు. ‘డగ్స్‌ను మహారాష్ట్రలో మాత్రమే స్వాధీనం చేసుకున్నారా? ముంద్రా పోర్టులో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ దొరికాయి. మీ ఏజెన్సీలు చిటికెడు గంజాయిని పట్టుకుంటుంటే.. మా పోలీసులు రూ.150 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

6. రష్యాలో ఆగని కొవిడ్‌ ఉద్ధృతి.. ఒక్కరోజులో వెయ్యి దాటిన మరణాలు

రష్యాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి చెందడం మొదలైన తర్వాత మొదటిసారిగా ఇక్కడ గడిచిన 24 గంటల వ్యవధిలో వెయ్యికి పైగా మరణాలు నమోదు కావడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రికార్డు స్థాయిలో 33,208 కొత్త కేసులు రాగా, 1002 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. కేసులు, మృతుల సంఖ్య పెరుగుతుండటం ఇది వరుసగా మూడో రోజు. మొత్తంగా ఇప్పటివరకూ దాదాపు 80 లక్షల కేసులు నమోదు కాగా..  2,22,315 మరణాలు సంభవించాయి.

7. కేరళలో వర్ష బీభత్సం..నీట చిక్కుకున్న ప్రయాణికుల బస్సు

కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రహదారులు వరద నీటితో నిండిపోయాయి. వాహనాలు నీటిలో చిక్కుకోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్‌ ప్రకటించింది. మరో ఏడు జిల్లాలను ఆరెంజ్ అలర్ట్ జాబితాలో ఉంచింది. రహదారులన్నీ పూర్తిగా నీటిమునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు ఒకటి వరద నీటిలో చిక్కుకుపోయింది. దాంతో బస్సులో నుంచి ప్రయాణికులు బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తోన్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

8. చిరిగిన కరెన్సీ నోట్లు మార్చుకోవాలా? ఇలా చేయండి!

మనం ఏదైనా ఏటీఎంకు వెళ్లి నగదు విత్‌ డ్రా చేసినప్పుడో, లేదా దుకాణంలో వస్తువులు కొనుగోలు చేసినప్పుడో మనకు చిరిగిన నోట్లు, మురికిగా ఉన్న కరెన్సీ నోట్లు రావడం అనేక సందర్భాల్లో జరుగుతుంటుంది. బయట ఎవరికి ఇచ్చినా వాటిని తీసుకోరు. ఈ క్రమంలో మనం చాలా అవస్థలు ఎదుర్కొంటుంటాం. అయితే, ఇలాంటి కరెన్సీ నోట్లు వస్తే ఏం చేయాలి? ఎలా మార్చుకోవాలనే అంశంపై ఆర్‌బీఐ పలు నిబంధనలు సూచించింది. వాటి ప్రకారం మీ వద్ద ఉన్న ఖరాబైన నోట్లను మార్చుకొని కొత్త నోట్లు పొందొచ్చు. 

9. మాజీ ప్రధాని మన్మోహన్‌కు డెంగీ నిర్ధారణ

మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌కు డెంగీ సోకినట్టు నిర్ధారణ అయిందని ఎయిమ్స్‌ వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ప్లేట్‌లెట్స్‌ సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని వివరించారు. 89ఏళ్ల మన్మోహన్‌ సింగ్‌కు సోమవారం జ్వరం రావడం.. దాన్నుంచి కోలుకున్నాక కూడా నీరసం తగ్గకపోవడంతో బుధవారం సాయంత్రం దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఆయన ఎయిమ్స్‌లోని కార్డియో-న్యూరో సెంటర్‌ ప్రైవేటు వార్డులో చికిత్స పొందుతున్నారు. డాక్టర్‌ నితీశ్‌ నాయక్‌ నేతృత్వంలోని కార్డియాలజిస్టుల బృందం చికిత్స అందిస్తోంది. 

10. రుతురాజ్‌ ఏదో ఒకరోజు టీమిండియాకు ఆడతాడు: మొయిన్ అలీ

ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)-2021 విజేత చెన్నై సూపర్ కింగ్స్‌ ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్ ఏదో ఒకరోజు కచ్చితంగా టీమిండియాకు ఆడతాడని ఆ జట్టు ఆల్-రౌండర్‌ మొయిన్ అలీ అన్నాడు. ఈ సీజన్‌లో అతడి ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. 16 మ్యాచుల్లో 635 పరుగులు చేసిన రుతురాజ్‌ గైక్వాడ్‌ ఆరెంజ్‌ క్యాప్ అందుకున్న విషయం తెలిసిందే. ‘ప్రస్తుతం రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతడు ప్రతి షాట్‌ని ఎంతో శ్రద్ధతో ఆడతాడు. భవిష్యత్తులో అతడు తప్పకుండా టీమిండియాకు ఆడతాడు’ అని మొయిన్ అలీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

టీమిండియా కోచ్‌గా ద్రవిడ్‌ ఎంపిక సరైనదే: ఎమ్మెస్కే ప్రసాద్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని