కొన ఊపిరితో ఉన్న తల్లికోసం తనయుడి పాట
close

తాజా వార్తలు

Published : 14/05/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొన ఊపిరితో ఉన్న తల్లికోసం తనయుడి పాట

కన్నీరు పెట్టించిన ఘటనను షేర్ చేసిన వైద్యురాలు

దిల్లీ: కరోనా వైరస్ ఎన్నో బాధాకర దృశ్యాలను కళ్ల ముందుంచుతోంది. చికిత్స అందించే వైద్యులకే కళ్లు చెమర్చేలా చేస్తోంది. అన్నీ తెలిసిన వారినే నిస్సహాయులుగా మార్చేస్తోంది. అలాంటి ఓ హృదయవిదారక ఘటనను ఓ వైద్యురాలు ట్విటర్ వేదికగా షేర్ చేశారు. అంతిమ ఘడియలు సమీపించిన తల్లి కోసం ఓ తనయుడు పడిన ఆరాటాన్ని వివరించారు. 

‘నా పనిగంటలు ముగించుకొని వెళ్లిపోతున్న సమయంలో నేను చికిత్స అందిస్తోన్న రోగి బంధువులకు ఫోన్‌ చేశాను. రోగి బంధువుల కోరిక మేరకు అలా చేస్తుంటాం. ఆ సమయంలో కొద్దిసేపు తనకు సమయం కేటాయించమని చెప్పి, కొన ఊపిరితో ఉన్న తల్లిని ఆమె కుమారుడు వీడియో కాల్‌లో తనివి తీరా చూసుకున్నారు. ఆ వెంటనే హిందీ సినిమాలో ఒక పాటను తన మాతృమూర్తి కోసం పాడుతుంటే.. మా సిబ్బంది అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. అతడు పాట పాడుతూ మధ్యలో ఒక్కసారిగా భోరుమన్నారు. దు:ఖంతో నిండిన గొంతు పెగలకపోయినా.. అలాగే పాటనంతా పూర్తి చేశారు. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి వారందరి కళ్లు చెమర్చాయి. ప్రాణాలతో తిరిగిరాదని తెలిసినా.. చివరగా అమ్మ గురించి తెలుసుకొని హఠాత్తుగా ఫోన్ పెట్టేశారు’ అంటూ దిప్షికా ఘోష్‌ అనే వైద్యురాలు ట్విటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి పాడిన పాట విడిపోయి, చివరకు ఒక దగ్గరకు చేరిన తల్లీ తనయుడికి సంబంధించినదంటూ ఆమె ఉద్వేగానికి గురయ్యారు. ఇలా మరెవరికీ జరగకూడదంటూ వాపోయారు. 

కొన ఊపిరితో ఉన్న తల్లికోసం తనయుడి పడిన ఆరాటం తమను కన్నీరు పెట్టించిందని నెటిజన్లు స్పందించారు. అంతేకాకుండా తమ జీవితంలో జరిగిన ఆ తరహా అనుభవాలను పంచుకుని, తమ బాధను దించుకున్నారు. అలాగే ఈ క్లిష్ట సమయంలో వైద్యులు అందిస్తోన్న సేవలను వారు కొనియాడారు. భారత్‌లో రెండో దశలో కరోనా ఉద్ధృతి ప్రజల మానసిక ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. వైరస్‌ నిత్యం లక్షల మందికి సోకుతూ.. ఆరోగ్య వ్యవస్థకు భారంగా పరిణమించింది. తాజాగా 3.62లక్షల మందికి కరోనా సోకగా..నాలుగువేలకు పైగా మరణాలు సంభవించాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని