కృష్ణమ్మ ఉగ్రరూపం

తాజా వార్తలు

Published : 17/10/2020 01:46 IST

కృష్ణమ్మ ఉగ్రరూపం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 5,98,143 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 5,02,953 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం 10 గేట్ల ద్వారా 4,67,280 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 883.40అడుగులకు చేరింది.

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద
విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం 7.50లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింత ప్రాజెక్టు నుంచి ఈరోజు సాయంత్రం 3గంటలకు 8.6లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ప్రవాహం పెరుగుతుండటతో ఈరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో 9 నుంచి 9.50లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ఉద్ధృతిపై అధికారులను అప్రమత్తం చేశామని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌  తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. సహాయక చర్యల్లో పాల్గొనే అధికారులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.  తీర ప్రాంత, లంకగ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామని కలెక్టర్‌ తెలిపారు. 

నీట మునిగిన భవానీ ద్వీపం
కృష్ణానది తీరంలో ఉన్న పర్యాటక కేంద్రాల్లో విజయవాడ ఒకటి. చుట్టూఎత్తైన కొండలు మధ్యలో కనుచూపు మేర కృష్ణమ్మ. వడ్డాణంలా ప్రకాశం బ్యారేజీ. ఓ వైపు కొలువైన దుర్గమ్మ.. మరో వైపు ఉన్న భవానీ ద్వీపం. అయితే ప్రస్తుతం భవానీ ద్వీపాన్ని వరదనీరు ముంచెత్తింది. దీని వల్ల ద్వీపం అందాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం భవానీ ద్వీపానికి వచ్చే పర్యాటకులను అధికారులు వెనక్కిపంపిస్తున్నారు.

జలదిగ్బంధంలో లంక గ్రామాలు
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో వేసిన కంద, పసుపు, అరటి, మినుము, పెసర పంటలు నీటమునిగాయి. వందలాది ఇళ్లు వరద నీటిలో చిక్కుకున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం ఎడ్లంక గ్రామంలో ఉన్న మైనేని హరిప్రసాదరావు ఇల్లు వరద ఉద్ధృతికి ధ్వంసమైంది. ఎడ్లంక గ్రామం కోతకు గురవుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని