వ్యసనాలు మానటానికి ఐదు సూత్రాలు

తాజా వార్తలు

Updated : 17/02/2021 05:19 IST

వ్యసనాలు మానటానికి ఐదు సూత్రాలు

సిగరెట్లు కాల్చటం కావొచ్చు. మద్యం తాగటం కావొచ్చు. మాదకద్రవ్యాలు కావొచ్చు. ముందు సరదాగానే మొదలవుతాయి. ఆ తర్వాతే వ్యసనంగా మారతాయి. ఇవి మంచివి కావని ఒకపక్క తెలుస్తూనే ఉంటుంది. అయినా వదల్లేని స్థితి. ‘ఇప్పట్నుంచి సిగరెట్లు కాల్చను, మద్యం తాగను’ అని కొందరు గట్టిగానే తీర్మానించుకుంటారు. ఏదో ఒకట్రెండు రోజులు నిబ్బరంగానే ఉంటారు. అనంతరం మళ్లీ ఎప్పటి కథే. వ్యసనాలను వదులుకోవటానికి నిర్ణయం తీసుకున్న మాత్రాన సరిపోదు. వాటి మీదికి మనసు మళ్లకుండా చూసుకోవటమూ ముఖ్యమే. ఇందుకు కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచిది. వీటి సాయంతో అనుకున్న లక్ష్యాలను చేరుకోవటం తేలికవుతుంది.

1. తేదీని నిర్ణయించుకోవటం

వ్యసనాలను మానటానికి పుట్టినరోజు, పెళ్లిరోజు లేదా ఆత్మీయులకు సంబంధించిన ముఖ్యమైన రోజు.. ఏదో ఒక తేదీని నిర్ణయించుకొని ప్రయత్నించటం మంచిది. ఒక ప్రత్యేకమైన రోజును ఎంచుకొని, ఆరంభిస్తే గట్టిగా కట్టుబడి ఉండటానికి అవకాశముంటుంది. ఆయా రోజుల ప్రత్యేకత గుర్తుకొచ్చినప్పుడు చేస్తున్న పని చెడ్డదనే సంగతీ అవగతమవుతుంది.

2. పరిసరాల మార్పు

ఇంట్లో గానీ ఆఫీసులో గానీ ఆయా వ్యసనాలను గుర్తుకు తెచ్చే వాటన్నింటినీ తొలగించటం ముఖ్యం. ఉదాహరణకు- తాగుడు మానెయ్యాలనుకుంటే మద్యం సీసాలు, బాటిల్‌ ఓపెనర్లు, గ్లాసుల వంటివి ఇంట్లో లేకుండా చూసుకోవచ్చు. జూదం మానుకోవాలనుకుంటే పేక ముక్కలు పారెయ్యొచ్చు. సిగరెట్‌ కాల్చుదామనో, మద్యం తాగుదామనో ప్రోత్సహించే వారికి దూరంగా ఉండొచ్చు. అలాగే వ్యసనాలను, వాటితో ముడిపడిన వస్తువులను గుర్తుకు తెచ్చేవారు గానీ ఆయా దురలవాట్లు గలవారు గానీ ఇంట్లోకి రాకుండా చూసుకోవటం కూడా ముఖ్యమే.

3. ధ్యాస మళ్లించాలి

ఆయా అలవాట్ల కోసం తహతహలాడుతున్నప్పుడు మనసును వేరే పనుల మీదికి మళ్లించాలి. కావాలంటే అలా కాసేపు బయట నడవటానికి వెళ్లొచ్చు. మిత్రులకో, కుటుంబ సభ్యులకో ఫోన్‌ చేసి మాట్లాడొచ్చు. బొమ్మలు గీయటం, పుస్తకాలు చదవటం వంటి అభిరుచులేవైనా ఉంటే ముందేసుకోవచ్చు. ఇలా పనుల్లో మనసు మునిగిపోవటం వల్ల ఆయా కోరికలను మరచిపోవటానికి వీలుంటుంది. వ్యసనాలను ప్రేరేపించేవి కనిపించినప్పుడు (ఉదా: మద్యం, పొగ వంటివి తాగేవారున్న చోటుకు వెళ్లినప్పుడు) మనసును అదుపులో ఉంచుకోవటాన్ని, తిరస్కరించటాన్ని అలవరచుకోవాలి. అలాంటి వాతావరణం నుంచి దూరంగా వెళ్లిపోవాలి.

4. గత ప్రయత్నాలను సమీక్షించుకోవాలి

వ్యసనాలను వదులుకోవటానికి ఇంతకుముందు ఏమేం ప్రయత్నాలు చేశారు? అవి ఎంతవరకు సఫలమయ్యాయి? ఎందుకు విఫలమయ్యాయి? అనేవి ఒకసారి సమీక్షించుకోవటమూ బాగా ఉపయోగపడుతుంది. దీంతో కొన్ని రోజులు వ్యసనాలకు దూరంగా ఉన్నా మళ్లీ ఎందుకు అంటుకున్నాయనేది గ్రహించటానికి వీలవుతుంది. వాటికి అనుగుణంగా మార్పులు చేసుకోవటానికి తోడ్పడుతుంది.

5. ధైర్యాన్నిచ్చేవారితో మెలగాలి

వ్యసనాల నుంచి బయటపడాలని అనుకుంటున్నానని కుటుంబసభ్యులు, స్నేహితులకు చెప్పాలి. వారితో మనసు విప్పి మాట్లాడాలి. తన ప్రయత్నం సఫలమయ్యేలా ప్రోత్సహించాలని, అండగా ఉండాలని కోరాలి. వ్యసనాలను వదిలేస్తున్నాననే విషయం వారికి తెలిసేలా నడచుకోవాలి. ఆయా వ్యసనాలను గుర్తుకుతెచ్చే పనులేవీ తమ ముందు చేయొద్దనీ చెప్పాలి. అలాగే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి దురలవాట్లను మానటానికి మంచి పద్ధతులేంటనే విషయాన్ని తెలుసుకోవాలి. అదృష్టం కొద్దీ కొందరికి కొన్ని మందులు ఉపయోగపడొచ్చు. ఇవి వ్యసనాల నుంచి తేలికగా, త్వరగా బయటపడేలా ఉపకరించొచ్చు. మళ్లీ మళ్లీ వాటి జోలికి వెళ్లకుండా కాపాడొచ్చు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని