Insects - Olympics: మన పరుగు కన్నా వాటి స్పీడే సూపర్‌

తాజా వార్తలు

Updated : 27/10/2021 14:13 IST

Insects - Olympics: మన పరుగు కన్నా వాటి స్పీడే సూపర్‌

అన్నింట్లోనూ కీటకాలదే పై చేయి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ సృష్టిలో మనిషే అద్వితీయమైనవాడు. అందులో సందేహం లేదు. కానీ చాలావరకు అల్పజీవులైన కీటకాలు వాటి శరీరాకృతితో పోల్చితే మనిషి కంటే మిన్నగా కొన్ని వేలు, వందల రెట్ల బరువులెత్తగలవు, పరుగెత్తగలవు, ఈదగలవు, ఎగరగలవు. అదెలాగో చూద్దాం..

బరువులెత్తడమే బలానికి సంకేతం! 
ఒలింపిక్‌ క్రీడాకారులు చాలా ఏళ్లపాటు తీవ్రంగా శ్రమించి శిక్షణ పొందుతారు. అత్యున్నతంగా రాణించాలని ఎంతో కష్టపడి అభ్యాసం చేస్తారు. సైంటిస్టులు, క్రీడారంగ నిపుణులు అనేక పరిశోధనలు చేస్తూ, మనిషి మరింత మెరుగ్గా క్రీడాపోటీల్లో ప్రదర్శనలు ఇచ్చేందుకు కొత్తవిధానాలు  కనిపెడుతుంటారు. అయితే మనకున్న క్రీడానైపుణ్యాలను కొన్ని కీటకాలతో పోల్చి చూస్తే చాలా దిగదుడుపు అనిపించేలా విస్తుపోయే వాస్తవాలు దర్శనమిస్తాయి. ‘బరువులెత్తడం’ మనిషి బలానికి ఓ కొలమానం. ఒలింపిక్స్‌లో వెయిట్‌ లిఫ్టర్లు రెండు అంశాల్లో పాల్గొంటారు. ఒకటి స్నాచ్‌, రెండోది క్లీన్, జెర్క్‌. ఇంతవరకూ స్నాచ్‌ (ఏకబిగిన ఒకేసారి బరువును
పైకెత్తడం)లో ఆల్‌టైమ్‌ ప్రపంచ రికార్డు జార్జియాకు చెందిన వెయిట్‌ లిఫ్టర్‌ లాషా తలఖేజ్‌ పేరిట ఉంది. అతను 175 కేజీల బరువు ఉన్నాడు. 222 కేజీల బరువును ఏకబిగిన పైకెత్తాడు. తన బరువులో తనకంటే ఓ పావు వంతు అధికంగా పైకెత్తగలిగాడంతే. ప్రతిరోజూ బరువులను మోసే కీటకాలతో అతని సామర్థ్యాన్ని పోల్చి చూస్తే మనిషి చాలా అల్పజీవి అనిపిస్తాడు. పెండ పురుగు(డంగ్‌ బీటిల్‌) పేడను మట్టితో కలిపి గుండ్రటి బంతుల్లా చేసి దొర్లించుకుని పోతుంటుంది. అది తనకంటే 1,141 రెట్ల అధిక బరువును అలా సునాయాసంగా తరలించుకునిపోతుంది.  చెట్ల ఆకులతో గూడు అల్లే ఎర్రచీమలు తమకంటే 100 రెట్ల అధికబరువును అవలీలగా పైకెత్తుతాయి. పెద్ద మట్టిదిబ్బలను నిర్మించే మరో రకం చీమ తన బరువుకంటే 5000 రెట్లను అధికంగా మోస్తుంది. చిన్న కీటకాలకు పెద్ద జంతువులకంటే ఎక్కువ నిష్పత్తిలో కండరం ఉండటమే దీనికి కారణం. 

ఈతలోనూ కీటకాలే ఘనం! 
టోక్యో ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా నుంచి ఫ్లాగ్‌ బేరర్‌గా ఉన్న కేట్‌ క్యాంప్‌బెల్‌ మహిళల 100 మీటర్ల ఫ్రీ స్టైల్‌ ఈతలో 2017లో ప్రపంచ రికార్డు స్థాపించింది. ఆమె ఈతకొట్టే వేగం ఒక సెకండుకు తన శరీరం పొడవుకు సమానమైన దూరం మాత్రమే. అదే ఒక విర్ల్‌గిగ్‌ బీటిల్‌(నీటి పురుగు) సెకండుకు తన శరీరం పొడవుకంటే 45 రెట్లు వేగంగా ఈదుతుంది.  

పరుగుపందెంలోనూ వాటికవే సాటి!
ఒలింపిక్స్‌లో  ఎప్పటి నుంచో ఉండే క్రీడ పరుగుపందెం. ఇందులో 100 మీటర్లనుంచి 42 కిలోమీటర్ల మారథాన్‌ వరకు పోటీలు ఉన్నాయి. జమైకాకు చెందిన ఉసేన్‌ బోల్ట్‌ 9.58 సెకన్లలో 100 మీటర్లు పరుగెత్తాడు. గంటకు 44.72 కిలోమీటర్ల దూరం పరుగెత్తాడు. అతను 1.95 మీటర్ల పొడవు ఉంటాడు. ఒక సెకనుకు అతని పొడవు కన్నా 6.4 రెట్లు ఎక్కువ దూరం పరుగెత్తుతాడు.  దక్షిణ కాలిఫోర్నియాలో ఉండే ఒకరకమైన పరటార్సోటోమస్‌ మాక్రోపాల్పిస్‌ అనే 1.5 మిల్లీ మీటర్లుండే కీటకం, ఒక సెకనుకు తన శరీరం పొడువుకంటే 322 రెట్లు వేగంగా పరుగెత్తుతుంది. ఆస్ట్రేలియన్‌ టైగర్‌ బీటిల్‌ తన శరీరం పొడువు కన్నా 171 రెట్లు వేగంగా పరుగెత్తుతుంది.  గంటకు నూరు కిలోమీటర్లు పరుగెత్తే చిరుత సెకనుకు తన శరీరం పొడవుకన్నా 16 రెట్లు వేగంగా పరుగెత్తుతుంది. ఆ కీటకాలకు ఆరుకాళ్లు ఉండటం, శరీరం బరువు తక్కువ ఉండటం, మూడుకాళ్లను ఒకేసారి నేలకు ఆన్చి, మరో మూడుకాళ్లతో ముందుకు పరుగెత్తుతాయి. ఎక్కువకాళ్లు ఉండటం వల్ల కూడా స్థిరంగా వేగంగా అడుగులు ముందుకు పడతాయి. 

హైజంప్‌లోనూ ఛాంపియన్లే! 
కొన్ని కీటకాలు తమ శరీరం పొడవుకంటే కొన్ని వందలరెట్లు పైకి ఎగురుతాయి. మిడతలు తమ పొడవుకంటే 150 రెట్లు పైకి ఉన్నపళంగా జంప్‌ చేస్తాయి.  మనిషి గనక వాటితో సమానంగా ఎగరగలిగితే ఈఫిల్‌ టవర్‌ మీదుగా జంప్‌ చేయవచ్చు. ప్రపంచ రికార్డు స్థాపించిన ఇటలీకి చెందిన స్టెఫ్కాకొస్డడినోవా 1987లో మహిళల విభాగంలో 2.09 మీటర్ల ఎత్తుకు ఎగిరారు. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న మరియా లాసిత్స్‌కేన్‌ 2.06 మీటర్ల ఎత్తుకు ఎగిరింది. కాళ్లు పొడవుగా ఉంటే ఎక్కువ ఎత్తుకు ఎగురుతారు. కానీ కీటకాలు తమ కాళ్ల పొడువుతో పోల్చితే రెండున్నర మీటర్లకంటే ఎక్కువ ఎగుర కూడదు.  కానీ అవి తమ శరీరంతో పోల్చితే
చాలా ఎత్తుకు ఎగరగలవు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని