పుస్తక పఠనం అలవాటవ్వాలా?.. ఇలా చేయండి!

తాజా వార్తలు

Published : 06/03/2021 13:35 IST

పుస్తక పఠనం అలవాటవ్వాలా?.. ఇలా చేయండి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పుస్తకాలు చదవడమనేది మంచి అలవాటు. పుస్తక పఠనం ద్వారా జ్ఞానం, పద సంపద పెరుగుతుంది. మనుషుల వ్యక్తిత్వాలు, సమాజం, వివిధ అంశాల పట్ల అవగాహన వస్తుంది. అందుకే పుస్తకాలు చదివేవాళ్లు జీవితాన్ని బాగా అర్థం చేసుకోగలరని పెద్దలంటారు. కానీ, ప్రస్తుత ఇంటర్నెట్‌ యుగంలో పుస్తకాలు చదవాలన్న ఆసక్తి ఎవరూ కనబర్చేట్లనేది చేదు నిజం. కొందరు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని పుస్తకాలు ముందు పెట్టుకొని కూర్చున్నా ఎక్కువ రోజులు చదవలేకపోతున్నారు. అందుకే పుస్తక పఠనంపై ఆసక్తి ఉన్నవాళ్లు దాన్ని అలవాటుగా మార్చుకోవడానికి ఈ చిట్కాలు పాటించి చూడండి.. 

నచ్చిన అంశానికి సంబంధించిన పుస్తకాలే ఎంచుకోండి

పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలనుకుంటే మొదట మీకు నచ్చిన అంశానికి సంబంధించిన పుస్తకాన్ని మాత్రమే ఎంపిక చేసుకోండి. ఉదాహరణకు మీకు చరిత్ర అంటే ఇష్టమనుకోండి.. ఆ పుస్తకాలకే మొదటి ప్రాధాన్యమివ్వండి. క్రీడలు ఇష్టమైతే వాటికి సంబంధించిన పుస్తకాలు, క్రీడాకారుల ఆత్మకథలను ఎంచుకోండి. మీకు నచ్చిన అంశంపై పుస్తకాలను చదవడం వల్ల ఆసక్తి పెరుగుతుంది. మీకు తెలియకుండానే పుస్తక పఠనంలో లీనమవుతారు. అలా నచ్చిన పుస్తకాలు చదవడం మూలంగా పుస్తక పఠనం అలవాటుగా మారిపోతుంది. ఆ తర్వాత మీ అభిరుచులను బట్టి ఇతర పుస్తకాలు చదువుకోవచ్చు. 

సమయం కేటాయించండి

రోజువారీ పనులు ఎలాగూ ఉంటాయి. అయితే, పుస్తక పఠనం కోసం కాస్త సమయం కేటాయించడానికి ప్రయత్నించండి. రోజుకు కనీసం పది నిమిషాలు చదవినా చాలు. ఇందుకోసం ప్రత్యేకించి మీ షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్ర లేచినప్పుడు, పడుకునే ముందు, మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో ఇలా రోజులో ఎప్పుడో ఒకప్పుడు ఒక పది నిమిషాలు చదవండి. అలాగే, ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఎంచక్కా ఒక పుస్తకం వెంట తీసుకెళ్లండి.

తక్కువ పేజీలున్న పుస్తకాలతో మొదలుపెట్టండి..

చదవడం ప్రారంభించిన మొదట్లోనే ఎక్కువ పేజీలు ఉన్న భారీ పుస్తకాన్ని ఎంచుకుంటే.. అది మీ మానసిక స్థితిపై ప్రభావం చూపొచ్చు. ఇన్ని పేజీలు ఎప్పుడు చదవాలి? అసలు చదవగలనా? వంటి సందేహాలు వస్తాయి. దీంతో చదవడంపై శ్రద్ధ పెట్టలేరు. కాబట్టి, తక్కువ పేజీలుండే పుస్తకాలు ఎంచుకోండి. వాటిని చూడగానే తొందరగా చదవేయొచ్చనే ధీమా మీలో కలుగుతుంది. 400 పేజీలుండే పుస్తకాన్ని పూర్తి చేయడం కోసం అయిష్టంగా రోజుల తరబడి కుస్తీ పట్టే బదులు.. ఓ వంద పేజీలుండే పుస్తకాన్ని తక్కువ సమయంలో అవలీలగా పూర్తిచేయొచ్చు. ఒక పుస్తకం చదవడం పూర్తి చేస్తే మరో పుస్తకం చదవాలన్న ఆసక్తి దానంతట అదే వస్తుంది. అలా చిన్న పుస్తకాలనే తీసుకొని చదువుతూ ఉంటే.. పుస్తక పఠనం అలవాటుగా మారిపోతుంది.

నోట్స్‌ రాసే ప్రయత్నం చేయొద్దు

కొంతమంది పుస్తకాలు చదువుతూ చదువుతూ నచ్చిన అంశాన్ని, వ్యాక్యాలను నోట్స్‌ రాసుకుంటుంటారు. నిజానికి ఇది మంచి విషయమే. కానీ, ఇప్పుడిప్పుడే పుస్తక పఠనం అలవాటు చేసుకునే వారు నోట్స్‌ రాసే ప్రయత్నం చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే నోట్స్‌ రాసుకోవడం చదువుకు అంతరాయంగా అనిపిస్తుండొచ్చు. అలాగే, పుస్తకం చదవడం ప్రారంభించిన ప్రతిసారీ నోట్స్‌ కూడా రాసుకోవాలంటే కాస్త భారంగానే అనిపిస్తుండొచ్చు. దీంతో అసలు పుస్తకమే చదవకపోతే సరిపోతుంది కదా అనే భావనకు వచ్చేస్తారు. కాబట్టి.. నోట్స్‌ రాయకండి. చిన్న పుస్తకాలను ముందు సాఫీగా చదివేయండి.

రోజుకు 10 పేజీలు చదవండి..!

మీకు నచ్చిన పుస్తకంలో ఎక్కువ పేజీలు ఉన్నాయనుకుంటే.. రోజుకు 10 పేజీలు చదవండి. సాధారణంగా అరగంటలో సులువుగా 10 పేజీలు చదవొచ్చు. కాబట్టి, రోజుకు 10 పేజీల చొప్పున చదివినా మీరు పుస్తకాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరో మీకంటూ ఓ స్పష్టత వస్తుంది. పుస్తకాల్లో పేజీల సంఖ్య సరాసరి 200 పేజీలు ఉంటాయట. ఈ లెక్కన మీరు ఏడాదిలో 18 పుస్తకాలు చదవగలరు.

చిన్న లక్ష్యాన్ని పెట్టుకోండి

పుస్తకాన్ని ఏకకాలంలో పూర్తి చేయాలి.. కొనుగోలు చేసిన లేదా లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పుస్తకాలన్నీ తొందరగా చదవేయాలి.. అని సంకల్పించకండి. నిదానమే ప్రదానం అన్నట్లు.. పుస్తకం పఠనం అలవాటయ్యే వరకు రోజుకు కొంత సమయం చదువుతూ.. నెలలో కనీసం ఒకటి రెండు పుస్తకాలైనా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. మీకు నచ్చిన పుస్తకాలను మీరు పెట్టుకున్న లక్ష్యం కన్నా ముందే పూర్తి చేయగలరు.

వృథా సమయం.. పుస్తక పఠనానికి

రోజులో జీవితాన్ని నడిపించడానికి చేసే పనులు కొన్ని ఉంటే.. కాలక్షేపానికి చేసే పనులు కొన్ని ఉంటాయి. టీవీ చూడటం, ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడటం, సోషల్‌మీడియా చెక్‌ చేయడం, బ్రౌజింగ్‌ వంటివి. వీటి వల్ల సమయమే తెలియదు. అందుకే వీటికి కేటాయించే సమయంలో కొంత పుస్తకం చదవడానికి కేటాయించడానికి ప్రయత్నించండి. 

కేవలం పుస్తకాలనే కాదు.. ఆన్‌లైన్‌లోనూ ఈ-బుక్స్‌ చాలా అందుబాటులో ఉన్నాయి. అవి చదవినా మంచిదే. పైన పేర్కొన్న చిట్కాలను పాటిస్తూ పుస్తకం చదవడం మొదలు పెట్టండి. కచ్చితంగా పుస్తకపఠనం మీకు అలవాటైపోతుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని