తితిదేలో వృక్ష ప్రసాదానికి విశేష ఆదరణ
close

తాజా వార్తలు

Published : 16/03/2021 23:03 IST

తితిదేలో వృక్ష ప్రసాదానికి విశేష ఆదరణ

వినియోగాన్ని విస్తృతం చేసేలా గ్రీన్‌ మంత్ర చర్యలు

తిరుమల: ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం విశేష కృషి చేస్తోంది. ప్రణాళికా బద్ధమైన పద్ధతులతో తిరుమల కొండను ప్లాస్టిక్‌ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతోంది. ప్లాస్టిక్‌ సీసాల్లో మంచినీరు, శీతల పానీయాల విక్రయాన్ని పూర్తిగా నిషేధించింది. లడ్డూ ప్రసాదాల కోసం వృక్ష ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చింది. పర్యావరణహిత సంచుల్లో తులసి విత్తనాలు పొందుపరిచి భక్తులకు అందజేస్తోంది. ‘గ్రీన్‌ మంత్ర’ సంస్థ సహకారంతో చేపట్టిన ఈ ప్రయత్నానికి మంచి ఆదరణ లభిస్తోంది.

శ్రీవారి లడ్డూ ప్రసాదాలను తీసుకెళ్లే కవర్ల వినియోగాన్ని కట్టడిచేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ సహకారంతో గ్రీన్‌ మంత్ర రూపొందించిన సంచులను తితిదే వినియోగిస్తోంది. ఈ సంచులు ప్లాస్టిక్‌ కవర్లను పోలి ఉంటాయి. కందమూలాలతో తయారుచేసిన ఈ సంచుల్లో రెండు, మూడు వందల తులసి విత్తనాలను ఉంచి భక్తులకు అందజేస్తున్నారు. ఈ కవర్లను పడేసిన కొద్ది రోజులకు అవి పూర్తిగా కుళ్లిపోయి భూమిలో కలిశాక తులసి మొక్కలు మొలకెత్తుతాయి. దీనినే వృక్ష ప్రసాదంగా తితిదే పరిచయం చేసింది.

ఐదు లడ్డూలకు సరిపడే సంచులను రూ.3కు, పది లడ్డూలకు సరిపడే సంచిని రూ.6కు ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నారు. ఈ సీడ్‌ ఎంబడెడ్‌ సంచులతో ప్లాస్టిక్‌ వినియోగం తగ్గడంతోపాటు, మొక్కలు పెరిగి పర్యావరణానికి మేలు చేకూరుతుందని గ్రీన్‌ మంత్ర నిర్వాహకులు పేర్కొంటున్నారు. వృక్ష ప్రసాదం వినియోగం పట్ల భక్తులు ఆసక్తి చూపుతున్నారు. తితిదే ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు. వృక్ష ప్రసాదం విక్రయాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించిన గ్రీన్‌ మంత్ర సంస్థ.. భక్తుల నుంచి వస్తున్న ఆదరణతో వినియోగాన్ని విస్తృతం చేసేలా చర్యలు చేపట్టింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని