104కు ‘ఫేక్‌ కాల్స్‌’ బెడద
close

తాజా వార్తలు

Published : 08/05/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

104కు ‘ఫేక్‌ కాల్స్‌’ బెడద

సరికాదంటున్న అధికారులు

కడప: 104 కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసిన మూడు గంటల్లోనే కొవిడ్‌ బాధితులకు ఆసుత్రుల్లో పడకలు ఏర్పాటు చేస్తామన్న ఏపీ ప్రభుత్వ ప్రకటనతో కాల్స్‌ తాకిడి ఎక్కువైంది. కడప కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కాల్‌సెంటర్‌కు రోజూ వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఫేల్‌ కాల్స్‌ బెడద వెంటాడుతోంది. 

వారంరోజుల నుంచి కడప జిల్లాలో రోజుకు వెయ్యికి పైగానే పాజిటివ్‌ కేసులు నమోదువుతున్నాయి. రోజూ నాలుగు వేలకు పైగానే ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నాలుగు ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రులు, 20 ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలు పూర్తిగా నిండిపోయాయి. ఈ సమయంలో చాలామంది పాజిటివ్‌ లక్షణాలతో బాధపడుతున్నవారు ఎక్కడికి వెళ్లాలో తెలియక 104 కాల్‌సెంటర్‌ను ఆశ్రయిస్తున్నారు. కరోనా పరీక్షల వివరాల కోసం రోజుకు 300లకు పైగానే కాల్స్‌ అందుతున్నాయి. పడకల కోసం రోజుకు 50 నుంచి 70 మంది ఫోన్లు చేస్తున్నారు. వీరందరికీ 104 కాల్‌సెంటర్‌ అధికారులు సమాధానాలు ఇస్తూ కావాల్సిన సౌకర్యాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 

ఏప్రిల్‌ మొదటి నుంచి ఇప్పటివరకు కడప కాల్‌సెంటర్‌కు 3,367 ఫోన్‌కాల్స్‌ వచ్చాయంటున్న అధికారులు దాదాపు అన్నింటినీ పరిష్కరించినట్లు పేర్కొంటున్నారు. కానీ కొందరు 104 కాల్‌సెంటర్‌కు అనవసరంగా ఫోన్లు చేస్తున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫేక్‌ కాల్స్‌ వల్ల తమ పని కష్టమవుతోందని పేర్కొంటున్నారు. కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసినవారు తిరిగి తాము కాల్ చేస్తే సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని అధికారులు వాపోతున్నారు. కరోనా బాధితుల సమస్యలు తెలుసుకొని అవసరమైతే వారి ఇంటికి అంబులెన్స్‌ పంపిస్తున్నామంటున్న అధికారులు.. ఆపదలో ఉన్నవారికి సాయపడాల్సిన వేళ ఫేక్‌ కాల్స్‌ చేసి ఇబ్బంది పెట్టడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని