బావా అన్నా.. బాబాయ్‌ అన్నా ఈలలే!

తాజా వార్తలు

Published : 16/09/2021 02:16 IST

బావా అన్నా.. బాబాయ్‌ అన్నా ఈలలే!

ఇంటర్నెట్‌డెస్క్‌: మన ఊళ్లలో పరిచయస్థుల్ని ఎలా పలకరించుకుంటాం? ‘బాబాయ్‌’, ‘మావయ్య’, ‘బావా’ అంటూ ఏదో వరస పెట్టి కదా! లేదా ఏమండీ, సర్‌ అని పిలుస్తాం. కానీ, మేఘాలయ రాష్ట్రంలోని కొంగ్‌థాంగ్‌ గ్రామంలో ఒకరినొకరు ఈల వేసి పలకరించుకుంటారు. ఇది కొత్తగా మొదలైన ట్రెండ్‌ ఏమీ కాదండోయ్‌! దశాబ్దాల నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. మరి ఇప్పుడు ఈ గ్రామం ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటారా? ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ పర్యాటక సంస్థ (డబ్ల్యూటీవో) ఏటా ఒక ఊరిని ‘అత్యుత్తమ ప్రపంచ పర్యాటక గ్రామం’గా ఎంపిక చేస్తుంది. ఈసారి భారత పర్యాటక మంత్రిత్వశాఖ రాజధాని షిల్లింగ్‌కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొంగ్‌థాంగ్‌ని మరో రెండు గ్రామాలతో కలిపి ఆ పోటీకి దేశం తరపున అధికారికంగా ఎంపిక చేసింది. అందుకే ఈ ప్రస్తావన.

ఏంటీ ప్రత్యేకత?

కొంగ్‌థాంగ్‌ని ‘విజ్లింగ్‌ విలేజ్‌’గా పిలుస్తారు. తూర్పు ఖాసీహిల్స్‌ జిల్లాలో ఉందీ పల్లె. ఇక్కడి జనం ఒకర్నొకరు ఈలలు వేసి పలకరించుకుంటారు. ఇది ఒకట్రెండు మాటలకు బదులు మాత్రమే కాదు.. సుదీర్ఘ సంభాషణలకీ విజిల్స్‌నే ఉపయోగిస్తారు. అందుకే ఆ పేరొచ్చింది. అన్నట్టు అందరూ ఒకేలా కాకుండా.. ఒక్కో మనిషికి ఒక్కోరకంగా ఈల వేసి పలకరించుకుంటారు. కొన్ని తరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోందట. ఈ చిత్రమైన భాషను అక్కడివాళ్లు ‘జింగ్ర్‌ వాయ్‌ లౌబీ’ అని పిలుస్తుంటారు. అంటే స్థానిక భాషలో కన్నతల్లి ప్రేమ పాట అన్నమాట. ఇందులోనూ మళ్లీ రెండు రకాల ఈల పాటలు ఉంటాయి. పొడవైన ఈలపాట, పొట్టి పాట అని. సాధారణంగా ఇంట్లో పొట్టి సాంగ్‌ వాడుతుంటారు. బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీ కోసం ఎంపికైన సందర్భంగా మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్‌ సంగ్మా ¥ శుభాకాంక్షలు తెలుపుతూ విషయాన్ని ట్వీట్‌ చేయడంతో ఈ పల్లె మరోసారి వార్తల్లోకి వచ్చింది. 2019లో రాజ్యసభ ఎంపీ రాకేశ్‌ సిన్హా ఈ ఊరిని దత్తత తీసుకున్నారు. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించాలని కోరారు. కొంగ్‌థాంగ్‌ మొత్తం జనాభా 700.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని