Long Covid: దీర్ఘకాలిక కొవిడ్‌లో 200 లక్షణాల గుర్తింపు!

తాజా వార్తలు

Published : 16/07/2021 01:38 IST

Long Covid: దీర్ఘకాలిక కొవిడ్‌లో 200 లక్షణాల గుర్తింపు!

ఇంటర్నెట్‌ డెస్క్‌:  కరోనా సోకిన ప్రతి ఆరుగురిలో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్‌తో బాధపడుతున్నారని గతంలో బ్రిటన్‌లో జరిగిన అధ్యయనంలో వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా  అంతర్జాతీయ స్థాయిలో జరిగిన మరో అధ్యయనంలో దీర్ఘకాలిక కొవిడ్‌ బారిన పడ్డవారిలో దాదాపు 200  లక్షణాలు ఉంటాయని గుర్తించారు. వారిలో బ్రెయిన్‌ ఫాగ్‌ నుంచి మొదలుకుని టిన్నిటస్‌(చెవిలో మోత) వరకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయనీ, కొందరిలో చిత్తభ్రమలు, వణుకు కూడా కనిపించాయని కనుగొన్నారు. అంతేకాదు, దీనివల్ల శరీరంలోని పది ముఖ్య వ్యవస్థలు ప్రభావితమయ్యాయి. కనీసం ఆరు నెలల వరకు తీవ్రమైన ఇబ్బందులు రోగులను వెంటాడాయి. జ్ఞాపక శక్తి సమస్యలు, మానసిక అశాంతి,నీరసం, దురద, నెలసరిలో హెచ్చుతగ్గులు, లైంగిక బలహీనత, గుండెదడ, ఆయాసం తదితర సమస్యలు వేధించాయి. 

ఆయాసమే కాదు.. చాలా సమస్యలు ఉన్నాయి!

ఈ అధ్యయనంలో పాల్గొన్న యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌లోని న్యూరో సైంటిస్ట్‌ అథెనా అక్రమి మాట్లాడుతూ, ‘‘బ్రిటన్‌లోని చాలా పోస్ట్‌ కొవిడ్‌ క్లినిక్కులు శ్వాసపరమైన సమస్యలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాయి. నిజమే, ఎక్కువమందిలో ఆయాసం కనిపిస్తుంది. అయితే దీంతోపాటు ఇంకా చాలా సమస్యలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ క్లినిక్కులు హోలిస్టిక్‌(సంపూర్ణ) దృష్టితో రోగులను పరిశీలించాలి’’ అన్నారు. కరోనా బారిన పడి 16 నెలలైనా రోగ లక్షణాలతో బాధపడుతున్నవారు కూడా ఉన్నారని ఆమె చెప్పారు. వారికి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, థైరాయిడ్‌ పరీక్షలు చేయించాల్సి ఉంటుందని చెప్పారు. 

‘‘వేలాదిమంది కొవిడ్‌ బారిన పడ్డ రోగులు పలు రోగాలతో బాధపడుతున్నారు. ఇంకా కొందరికి అసలు ఈ సమస్యలన్నీ కొవిడ్‌తో ముడిపడినవనే సంగతి కూడా తెలీదు’’ అని అన్నారు.  ‘‘లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నవారికోసం దేశవ్యాప్తంగా ఓ కార్యక్రమాన్ని చేపట్టాలనీ, క్లినిక్కుల నెట్‌వర్క్‌ను స్థాపించి, ఎక్కడికక్కడ జనావాసాల్లో డయాగ్నసిస్‌ చేస్తూ, చికిత్స అందించడం చాలా అవసరం’’ అని ఆమె చెప్పారు.

అధ్యయనం జరిగిందిలా..

ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రిక ‘లాన్సెట్‌’లో తాజా అధ్యయనం ప్రచురితమైంది. ఇందులో 56 దేశాల నుంచి లాంగ్‌ కొవిడ్‌తో బాధపడుతున్న 3,672 మందిని పరిశీలించారు. ఆ తర్వాత 203 రోగ లక్షణాలను గుర్తించారు. అందులో 66 లక్షణాలు ఏడు నెలల వరకూ కొనసాగాయని తేలింది. సాధారణంగా చాలామందిలో కనిపించిన సమస్యలు.. నీరసం, నిస్సత్తువ, జ్ఞాపకశక్తి క్షీణించడం, గుండెదడ, మసక దృష్టి, డయేరియా, దద్దుర్లు, మూత్రాశయంపై నియంత్రణ కోల్పోవడం లాంటివి.  2,454 మంది రోగులు ఏడునెలల వరకు 14 శాతం లక్షణాలను తాము చవిచూశామని తెలిపారు. కొంతమందిలో ఈ అనారోగ్య సమస్యలు మరింత పెరిగాయి. 

‘‘చాలా మందిలో 9 శారీరక వ్యవస్థల్లో మార్పులు కనిపించాయి. వారికి చికిత్స అందించేందుకు ఈ అధ్యయనం వైద్యులకు  తోడ్పడుతుంది. అలాగే కొవిడ్‌ అనుబంధం సమస్యలపై దృష్టి సారించే పరిశోధకులకు కూడా ఇదెంతో అవసరం’’ అని అథెనా అక్రమి అన్నారు.  అలాగే ఈ సర్వేలో పాల్గొన్న 22 శాతం మంది రోగులు కొవిడ్‌ సోకిన తర్వాత తమకు పని చేసేందుకు చేతకాకపోవడంతో ఉద్యోగాలను కోల్పోవడమో, దీర్ఘకాలిక సెలవులు తీసుకోవడమో జరిగిందని చెప్పారు. మరో 45 శాతం మంది తమకు అంతకు ముందులా పని చేసేందుకు సాధ్యం కాకపోవడంతో తక్కువ పనిని తీసుకున్నామన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని