స్థానికులకే 95శాతం ఉద్యోగాలు: కేటీఆర్‌

తాజా వార్తలు

Published : 02/07/2021 17:08 IST

స్థానికులకే 95శాతం ఉద్యోగాలు: కేటీఆర్‌

హైదరాబాద్‌: కొత్త జోనల్‌ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఉద్యోగ, విద్యావకాశాల్లో సమాన వాటా దక్కుతుందని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సుదీర్ఘ కసరత్తు, గొప్ప విజన్‌తో జోనల్‌ వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించి అమల్లోకి తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఉన్న పాత జోనల్‌ వ్యవస్థను పూర్తిగా రద్దు కేసి, తెలంగాణలోని అన్ని ప్రాంతాల ఆకాంక్షల మేరకు నూతన జోనల్‌ వ్యవస్థ రూపుదిద్దుకుందని కేటీఆర్‌ వివరించారు. రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. దీంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా 95శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని కేటీఆర్‌ పేర్కొన్నారు.  

జిల్లాలను ప్రత్యేక జోన్లుగా వర్గీకరించడం వలన జిల్లాస్థాయి పోస్టులు అయిన జూనియర్‌ అసిస్టెంట్‌ మొదలు జోనల్‌, మల్టీ జోన్‌ వరకు అన్ని స్థాయిల ఉద్యోగాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలు, న్యాయం జరుగుతుందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. కొత్తగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణపేట జిల్లాలను ఆయా జోన్లలో చేర్చి చట్టబద్ధం చేయడంతో పాటు వికారాబాద్‌ జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు ఆ జిల్లాను చార్మినార్‌ జోన్‌ పరిధిలోకి తేవడం పట్ల ఆయా జిల్లాల ప్రజల తరఫున సీఎంకు, ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

1,33,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం 
ఇప్పటికే తమ ప్రభుత్వం ఇచ్చిన హామీని మించి వివిధ శాఖల ద్వారా 1,33,000పై చిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర యువతకు అందించామని చెప్పారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు గత ఏడేళ్లలో టీఎస్‌ఐపాస్‌ ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు, వేల పరిశ్రమలు రాష్ట్రంలోకి ఆకర్షించినట్టు కేటీఆర్‌ తెలిపారు.  తద్వారా సుమారు 15లక్షల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో వచ్చాయన్నారు. ప్రైవేటు కంపెనీల్లో స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగాలు ఇస్తే వారికి ప్రత్యేక పోత్సాహకాలు ఇచ్చేలా మరో విధానపరమైన నిర్ణయం తీసుకున్న విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు రంగాల్లో స్థానిక యువతకు అత్యధిక ఉపాధి అవకాశాలు దొరికేలా చర్యలు తీసుకుటున్నందుకు ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజలు, యువత పక్షాన కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని