
తాజా వార్తలు
TS: ఆ గ్రామంలో లాక్డౌన్
సారంగాపూర్: పల్లెల్లోనూ కరోనా బుసలు కొడుతోంది. కొవిడ్ జాగ్రత్తలు పాటించకపోవడంతో కొంతమంది క్రమంగా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం గోపాల్పేట్లో ఇప్పటి వరకు 70 కరోనా కేసులు బయటపడ్డాయి. గురువారం ఒక్కరోజే 75 మందికి పరీక్షలు నిర్వహించగా.. 34 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
గత మూడు, నాలుగు రోజుల్లో పదికి మించి కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ గ్రామస్థులు అప్రమత్తమయ్యారు.
సర్పంచ్ లింగవ్వ అధ్యక్షతన గ్రామాభివృద్ధి సంఘం సభ్యులు, గ్రామస్థులు సమావేశమై స్వచ్ఛంద లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామం నుంచి రోజూ 25 మంది కూరగాయలు, పాల విక్రయానికి నిర్మల్ వెళ్లి వస్తుంటారని.. వైరస్ వ్యాప్తికి ఇదే కారణమై ఉండొచ్చని గ్రామస్థులు భావిస్తున్నారు. గ్రామంలో కొవిడ్ కేసుల దృష్ట్యా రేపు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తెలిపారు.