ఖండ కావ్య పద్య రచనలకు ‘మండలి ఫౌండేషన్‌’ ఆహ్వానం
close

తాజా వార్తలు

Published : 22/06/2021 01:44 IST

ఖండ కావ్య పద్య రచనలకు ‘మండలి ఫౌండేషన్‌’ ఆహ్వానం

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరభాషా సంస్కృతుల వ్యామోహం పెచ్చుమీరుతున్న వేళ తెలుగు భాషా సంస్కృతుల అస్తిత్వం, ఆంధ్రత్వం కనుమరుగైపోతున్నాయని మండలి ఫౌండేషన్‌ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్‌ అన్నారు. భాషాభిమానం మాయమైపోతున్న నేపథ్యంలో జాతిని మేల్కొలిపే ప్రబోధాత్మక రచనలు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే నూతన ఖండ కావ్య పద్య రచనలను ‘మండలి ఫౌండేషన్‌’ ఆహ్వానిస్తోందని వెల్లడించారు. ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించి విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన దివంగత మండలి వెంకట కృష్ణారావు ఆశయాలకు అనుగుణంగా తెలుగు భాషా సంస్కృతుల పరివ్యాప్తికి చేస్తున్న కృషిలో భాగంగా ఖండ కావ్య పద్య రచనలకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసేలా చిన్నచిన్న ఖండికలతో.. ఖండ కావ్య పద్య రచనలు చేసిన వారికి నగదు బహుమతులు ప్రదానం చేయనున్నట్టు మండలి పేర్కొన్నారు. ఎంపికైన వారికి ప్రథమ బహుమతి కింద రూ.25వేలు, ద్వితీయ బహుమతి రూ.20వేలు, తృతీయ బహుమతి రూ.15వేలు, ప్రోత్సాహక బహుమతి రూ.10వేలు చొప్పున అందించనున్నట్టు తెలిపారు. ప్రచురణ బాధ్యత కూడా తమదేనని స్పష్టంచేశారు. 

నియమ నిబంధనలివీ..

1. ఖండ కావ్యాలు తెలుగు జాతి, చరిత్ర, భాషా సంస్కృతులు, సవాళ్లు, సమస్యలను వివరించి ఉత్తేజపరిచే విధంగా ఉండటంతో పాటు ఈ పోటీ కోసమే రాసినవై ఉండాలి. ఇంతకుముందు ప్రచురించినవి పంపొద్దు.
2. పది శీర్షికలు వంద పద్యాలకు తగ్గకుండా నూట యాభైకి మించకుండా ఉండాలి.
3. పద్యాలు సరళ సుందరంగా, కుల, మత, రాజకీయ వివాదాలకు అతీతంగా ఉత్తేజకరంగా ఉండాలి.
4. రచనలు.. కవుల పేర్లు తెలియకుండా నిర్ణేతల మండలికి పరిశీలన కోసం పంపిస్తారు. 
5. కవులు తమ రచనలను జులై 21, 2021లోగా మండలి ఫౌండేషన్‌, గాంధీ క్షేత్రం, అవనిగడ్డ చిరునామాకు పంపాలి.
6. ఆగస్టు 4న మండలి వెంకట కృష్ణారావు జయంతి సభలో బహుమతులు ప్రకటిస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని