రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదు: ఈటల

తాజా వార్తలు

Published : 28/04/2021 01:19 IST

రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదు: ఈటల

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఆర్మీ విమానాల ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్‌ కొరత లేదని.. అన్ని జిల్లాలకు ఆక్సిజన్‌ పంపుతున్నట్లు చెప్పారు. ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణకు ఐఏఎస్‌ అధికారులను నియమించినట్లు ఈటల వెల్లడించారు. రాష్ట్రానికి రోజుకు 270 టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఉంటుందని.. ఈ నేపథ్యంలో నిత్యం 400 టన్నులు రాష్ట్రానికి వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేశామని.. అవసరమైతే మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే.. ఆక్సిజన్‌ కొరతతో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకూడదని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని వెల్లడించారు. రాబోయే కాలంలో కరోనా బాధితుల సంఖ్య పెరిగితే.. అందుకు అనుగుణంగా ఆక్సిజన్‌ సరఫరా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పీఎం కేర్స్‌ నుంచి ఐదు ఆక్సిజన్‌ మిషన్లు వచ్చాయన్నారు. రేపటి నుంచి నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కొవిడ్‌ సేవలు మొదలవుతాయని.. ఆక్సిజన్‌తో కూడిన 350 పడకలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. హైదరాబాద్‌ నిమ్స్‌లో సాధారణ రోగులకు చికిత్స అందించే బ్లాక్‌ను పూర్తిగా కొవిడ్‌ బాధితులకు కేటాయించి.. మొత్తంగా 200 బెడ్లు రేపటి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

వారంలో 3,010 ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులోకి..

‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 10వేల ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో 600 ఐసీయూ పడకలు ఉన్నాయి. దేశంలో ఇన్ని ఐసీయూ పడకలు నిర్వహిస్తున్న ఏకైక ఆస్పత్రి గాంధీ ఒక్కటే. గాంధీలో మరో 400 పడకలకు ఆక్సిజన్‌ లైన్స్‌ వేయాలని నిర్ణయించాం. గచ్చిబౌలి టిమ్స్‌లో 300, వరంగల్‌ ఎంజీఎంలో 300, నిమ్స్‌లో 200, ఎంసీహెచ్‌ సూర్యాపేటలో 200,  నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో 200.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో 3,010 పడకలకు యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్‌ లైన్స్‌ వేసి వారంలో రోజుల్లో అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వైద్యులు, శానిటరీ, స్టాఫ్‌ నర్సులను నియమించుకుంటున్నాం.

అలా చేస్తే చర్యలు తప్పవు..

కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్‌ బాధితుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో బిల్లు కట్టకపోతే మృతదేహాన్ని ఇవ్వడం లేదు. వ్యాపార కోణంలో వ్యవహరించే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనల మేరకే ప్రైవేటు ఆస్పత్రులు ఫీజులు వసూలు చేయాలి. సాధారణ పడకలకు రోజుకు రూ.4వేలు, ఐసీయూ పడకకు రోజుకు రూ.7,500, వెంటిలేటర్‌ బెడ్‌కు రూ.9వేలు, మాత్రమే వసూలు చేయాలి’’ ’’ అని ఈటల వివరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని