ఓరుగల్లులో మిషన్‌ భగీరథ ప్రారంభం
close

తాజా వార్తలు

Updated : 12/04/2021 14:00 IST

ఓరుగల్లులో మిషన్‌ భగీరథ ప్రారంభం

కాజీపేట: వరంగల్‌ ప్రజల దాహార్తిని తీర్చే ఇంటింటికీ మంచినీటి సరఫరా పథకాన్ని ఉగాది కానుకగా మంత్రి కేటీఆర్‌ ఇవాళ ప్రారంభించారు. గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల ముంగిట ఆయన వరంగల్‌లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా కాజీపేట రాంపూర్‌కు చేరుకున్న కేటీఆర్‌ వరంగల్‌ నగర వాసులకు ప్రతి రోజు స్వచ్ఛమైన నీరు అందించే మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకు నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం రూ.939 కోట్లు వ్యయం కాగా.. అమృత్‌ పథకం కింద రూ.413 కోట్లు ఖర్చు చేశారు. ఇవాల్టి పర్యటనలో రూ.2 వేల కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఆయన దేశాయిపేటలో జర్నలిస్టుల ఇళ్లు, దూపకుంటలో 600 ఇళ్లు, వరంగల్‌ ఎల్బీనగర్‌లో షాదీఖానా, మండి జబార్‌లో హజ్‌హౌస్‌, లక్ష్మీపురంలో సమీకృత మార్కెట్‌లకు శంకుస్థాపన చేశారు. గరీబ్‌నగర్‌లో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. 

పేదలకు తెరాస అండగా ఉంటోంది: కేటీఆర్‌

కేసీఆర్‌ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఖిల్లా వరంగల్‌ కోటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. పేద విద్యార్థుల విదేశీ చదువులకు రూ.20 లక్షలు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో వరంగల్‌లో విద్యుత్‌ కష్టాలుండేవని విమర్శించారు. వరంగల్‌లో ఇంటింటికి తాగునీరిచ్చే పథకాన్ని ప్రారంభించామన్నారు. పట్టణాల్లో ఇంటింటికి అమృత్‌ జలం అందిస్తున్నామని వివరించారు. ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి ప్రధాని మోదీ మోసం చేశారని గుర్తు చేశారు.

కేటీఆర్‌ కాన్వాయ్‌ అడ్డుకునేందుకు యత్నం

వరంగల్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. వరంగల్‌ పోచమ్మకుంట వద్ద కార్యకర్తలు కేటీఆర్‌ కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లారు. ఇటీవల కేయూలో ఆత్మహత్య చేసుకున్న సునీల్‌ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని