Top Ten News @ 9 AM
close

తాజా వార్తలు

Updated : 03/05/2021 09:06 IST

Top Ten News @ 9 AM

1. బెంగాల్‌ బెబ్బులిదే

ఐదు చోట్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేటతెల్లమయ్యాయి. మూడుచోట్ల ఓటర్లు అధికార పార్టీలకే పట్టం కట్టారు. రెండుచోట్ల ప్రస్తుత సర్కార్లను ఇళ్లకు పంపారు. బెంగాల్‌లో తృణమూల్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి కొలువుదీరబోతోంది. అయితే దీదీ.. తాను పోటీచేసిన నందిగ్రామ్‌లో అనూహ్య రీతిలో ఓడిపోయారు. తమిళనాడులో స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈశాన్యాన అస్సాంలో భాజపా, దాని మిత్రపక్షాలు మరోసారి వికసించాయి. కేరళలో దశాబ్దాల ఆనవాయితీని తోసిరాజంటూ వామపక్షాల నేతృత్వంలోని కూటమి వరసగా రెండోసారి విజయబావుటా ఎగరేసింది. పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఈటలపై వేటు

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిఫార్సు మేరకు ఆయనను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్‌ తమిళిసై ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని అందులో స్పష్టం చేశారు. ఈటల మెదక్‌ జిల్లాలో భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలను సీఎం కేసీఆర్‌ తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించారు. కలెక్టర్‌  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు నివేదిక సమర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* మా భూములు లాక్కున్నారు

3. కొనసాగుతున్న మినీ పురపోరు కౌంటింగ్‌

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన మినీ పురపోరు ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతోంది. వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్‌, కొత్తూరు పురపాలక సంఘాలతో పాటు జీహెచ్‌ఎంసీలోని లింగోజిగూడ, మరో నాలుగు మున్సిపాలిటీల్లోని 4 వార్డులకు శుక్రవారం(గత నెల 30న) ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా నెగెటివ్‌ వచ్చిన వారిని మాత్రమే కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఐసొలేషన్‌ కిట్‌లో స్టెరాయిడ్‌ మందులు

కొవిడ్‌ అని నిర్ధారణ అయిన తర్వాత మందులు వాడుతున్నా 5-7 రోజులుగా జ్వరం తగ్గడం లేదా? పైగా 101 డిగ్రీల కంటే పైగా నమోదవుతుందా? అయితే స్టెరాయిడ్‌ ఔషధాన్ని కూడా అదనంగా వాడాల్సిందేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకొంది. కొవిడ్‌ నిర్ధారణ కాగానే ప్రభుత్వం అందజేస్తోన్న ఐసొలేషన్‌ కిట్‌లో పెట్టి స్టెరాయిడ్‌లను కూడా ఇస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. లాక్‌డౌన్‌ విధింపును పరిశీలించండి

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లాక్‌డౌన్‌ విధించే అంశాన్ని పరిశీలించాలని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రోగులు ప్రాణవాయువు కోసం ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసరాల కోసం ఆక్సిజన్‌ మిగులు నిల్వలు (బఫర్‌స్టాక్‌) ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం నిర్వహించాలి. దేశవ్యాప్తంగా వికేంద్రీకరించాలి. వచ్చే నాలుగు రోజుల్లో అత్యవసర నిల్వలను ఏర్పాటు చేయాలి. రాష్ట్రాల కేటాయింపులకు అదనంగా ఈ నిల్వలను నిర్వహించాలని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. కొట్టుకుపోయిన కొవిడ్‌ నిబంధనలు

ఎన్నికల ఫలితాల అనంతరం సంబరాలు, ర్యాలీలు యథావిధిగా కొనసాగాయి. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో విజయోత్సవాలపై ఎన్నికల సంఘం నిషేధం విధించినప్పటికీ పలు పార్టీల కార్యకర్తలు బేఖాతరు చేశారు. తమిళనాడులో డీఎంకే పార్టీ శ్రేణులు సంబరాలలో మునిగితేలారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం ముందు పెద్దఎత్తున గుమికూడారు. కోల్‌కతాలోని కాళీఘాట్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేశారు. వీరిలో ఎక్కువమంది మాస్కులు ధరించలేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో లెక్కింపు కేంద్రం వద్ద గందరగోళం నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. చెప్పిందెంత..? చిక్కిందెంత..?

ఎన్నికల పోరు ముగిసిందంటే చాలు.. ఫలితం తేలే వరకు పార్టీలకూ, పోటీ చేసిన అభ్యర్థులకూ కంటి మీద కునుకు ఉండదు. మరోవైపు కొన్ని సంస్థలు ప్రకటించే ఎగ్జిట్‌ పోల్స్‌పైనా పార్టీలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అమితాసక్తి కనబరుస్తుంటారు. అట్లాగే, పశ్చిమ్‌బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికలపైనా పలు సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ను విడుదల చేశాయి. ఆ సంస్థలు ఏయే రాష్ట్రాల్లో ఏ పార్టీకి విజయం సాధిస్తుందని చెప్పాయి, వాస్తవంగా ఏ పార్టీ ఆధిక్యతను కనబరిచాయని పరిశీలిస్తే.. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

8. కరోనా ఔషధ పేటెంట్‌ బాటలో టెక్‌ మహీంద్రా

కరోనా వైరస్‌ను నియంత్రించే ఔషధ మాలిక్యూల్‌ కోసం రీజీన్‌ బయోసైన్సెస్‌తో కలిసి ఐటీ కంపెనీ టెక్‌ మహీంద్రా పేటెంట్‌ దాఖలు చేయనుంది. ఔషధ పేటెంట్‌కు భాగస్వామితో దరఖాస్తు చేశామని, తదుపరి ప్రయోగాలను పూర్తి చేస్తామని టెక్‌ మహీంద్రా గ్లోబల్‌ హెడ్‌ (మేకర్స్‌ ల్యాబ్‌) నిఖిల్‌ మల్హోత్రా పేర్కొన్నారు. టెక్‌ మహీంద్రా పరిశోధన, అభివృద్ధి విభాగంగా మేకర్స్‌ ల్యాబ్‌ ఉంది. ‘కరోనా వైరస్‌పై దాడిచేసే సత్తా కలిగిన మాలిక్యూల్‌ను కనుగొన్నాం. పేటెంట్‌ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు మాలిక్యూల్‌ పేరును బయటపెట్టలేమ’ని మల్హోత్రా అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. దిల్లీ చేతిలో పంజాబ్‌ చిత్తు

దిల్లీ అదరహో. సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తోన్న పంత్‌ జట్టు ప్లేఆఫ్స్‌ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యంతో ఆరో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికీ దూసుకెళ్లింది. బంతితో రాణించి, బ్యాటుతో దంచేసిని దిల్లీ ఆదివారం పంజాబ్‌ను చిత్తుగా ఓడించింది. ధావన్‌ బాధ్యతాయుత, ధాటైన బ్యాటింగ్‌తో దిల్లీ పని తేలికైంది. మయాంక్‌ అగర్వాల్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌ వృథా అయింది. పంజాబ్‌కు ఇది అయిదో ఓటమి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. వ్యోమగాములను భూమికి తీసుకొచ్చిన స్పేస్‌ఎక్స్‌ క్యాప్సుల్‌

వారం క్రితం నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్‌) చేర్చిన స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్‌ క్యాప్సుల్‌...తిరుగు ప్రయాణంలో 167రోజులుగా ఐఎస్‌ఎస్‌లో ఉన్న మరో నలుగురిని క్షేమంగా భూమి మీదకు తీసుకొచ్చింది. తిరిగి వచ్చిన వారిలో ముగ్గురు అమెరికా వ్యోమగాములు, ఒక జపాన్‌ వ్యోమగామి ఉన్నారు. డ్రాగన్‌ ఆరున్నర గంటల పాటు ప్రయాణించి ఆదివారం వేకువ జామున(స్థానిక కాలమానం ప్రకారం) మెక్సికో గల్ఫ్‌లో పనామా సిటీకి సమీపంలో సముద్రంలో పడిపోయింది. ఆ సమయంలో నాలుగు ప్యారాచూట్లు చక్కగా పనిచేశాయి. రాత్రి సమయంలో ఓ క్యాప్సుల్‌ సముద్రంలో క్షేమంగా దిగడం 1968 తర్వాత ఇదే ప్రథమమని నాసా పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని