Top Ten News @ 9 AM
close

తాజా వార్తలు

Published : 16/05/2021 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM

1. Black Fungusపై సర్కారు అప్రమత్తం

తెలంగాణలో బ్లాక్‌ఫంగస్‌ తీవ్రత పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు దీనిని నియంత్రించేందుకు అత్యవసర చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో వ్యాధి బారిన పడిన వారికి చికిత్స కోసం హైదరాబాద్‌ కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో నోడల్‌ కేంద్రం ఏర్పాటు చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో కొందరు ఈ ఫంగస్‌ బారిన పడుతున్నారని, ఎక్కువ మందిలో ఈఎన్‌టీ సమస్యలు తలెత్తుతున్నాయని, దీని గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* Remdesivir, Oxygen కోటా పెంపు 

2. ఎంపీని కొట్టడమేంటి?: AP High Court

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో రోజంతా హైడ్రామా నడిచింది. శుక్రవారం ఎంపీ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో శనివారం మధ్యాహ్నం విచారణ జరిగింది. సెషన్స్‌ కోర్టును ఆశ్రయించకుండా నేరుగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంపై అభ్యంతరం తెలుపుతూ కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. మెజిస్ట్రేట్‌ ముందు ఎంపీని హాజరు పరిచేందుకు అనుమతించింది. దీంతో అనుచిత వ్యాఖ్యలతో ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్నారనే అభియోగాలపై ఎంపీని గుంటూరులోని ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో సీఐడీ అధికారులు హాజరుపరిచారు. అక్కడ విచారణ జరుగుతుండగా పోలీసులు తనను కొట్టారని జడ్జికి రాతపూర్వకంగా ఎంపీ ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో పాజిటివిటీ రేటు పెరగడం ఆందోళనకరం

ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివిటీ రేటు ఏప్రిల్‌ తొలినాళ్ల నుంచి పెరిగిపోతుండటం పట్ల కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వారం వృద్ధిరేటు అత్యధికంగా 30% వరకు ఉందని, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో పరిస్థితులు గంభీరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలోని కొవిడ్‌ స్థితిగతులపై శనివారం ఆయన వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఎవరో చెబితే కుదిరిన ఒప్పందాలు కావివి

ఎవరో చెప్పడంవల్లే కొవాగ్జిన్‌ తయారీకి ఇప్పుడు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందాలు జరిగినట్లు ప్రచారం చేయడంలో నిజం లేదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ స్పష్టంచేశారు. శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో దీనిపై మాట్లాడారు. ‘‘...ఒప్పందాలు అలా జరగవు. సంక్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానం అలా బదిలీకాదు. ఒక వ్యాక్సిన్‌కు బీజం పడిననాటి నుంచి బయటకు రావడానికి 70-75 రోజులు పడుతుంది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి, దాని మార్గదర్శకత్వంలో, దాని మద్దతుతో 3 ప్రభుత్వరంగ సంస్థలతో భారత్‌ బయోటెక్‌ భాగస్వామ్య ఒప్పందం చేసుకొంది. ఎన్నో నెలల నుంచి ఆ పని జరుగుతోంది’’అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. Corona: కోలుకున్నా వదలట్లేదా?

కొవిడ్‌ను జయించినా.. దాని తాలూకు బాధలు వెన్నాడుతూనే ఉన్నాయి. అత్యధికుల్లో తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం, దగ్గు వంటివి దీర్ఘకాలం పీడిస్తున్నాయి. ఈ లక్షణాలు తగ్గుముఖం పట్టడానికి కొందరికి వారాలు, మరికొందరికి నెలలు పడుతోంది. కరోనాకు ఆలస్యంగా చికిత్స పొందినవారు ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తోంది. ఐసీయూలో ప్రాణవాయువు సేవలూ అవసరమవుతున్నాయి. వీరికి స్టెరాయిడ్స్‌ ఇవ్వాల్సి వస్తోంది. కోలుకున్న తర్వాత ఇలాంటి వారిలో సుమారు 5-10 శాతం మందిలో ఏదో రకమైన సమస్య తలెత్తుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ప్లాస్మాథెరపీ వల్ల ప్రయోజనం లేదు

ప్లాస్మాథెరపీ వల్ల ప్రయోజనం ఏమీ కనిపించలేదని మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ యూకేలో తాజాగా నిర్వహించిన ఓ అధ్యయన నివేదికను ప్రచురించింది. ఈ చికిత్సతో ఆసుపత్రిలో చేరిన రోగి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడిన దాఖలా ఏమీ కనిపించలేదని పేర్కొంది. ఇదివరకు భారత్‌కు చెందిన ఐసీఎంఆర్‌-ప్లాసిడ్‌, అర్జెంటీనాకు చెందిన ప్లాస్మాఆర్‌ ట్రయల్స్‌లోనూ  ప్లాస్మాథెరపీ వల్ల ఆసుపత్రుల్లో చేరిన రోగులకు ఏ ప్రయోజనమూ కనిపించలేదని తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. అరుణగ్రహంపై చైనా ముద్ర

అంగారకుడి ఉపరితలంపై చైనా తొలిసారిగా తన ముద్ర వేసింది. ఆ గ్రహంపై విజయవంతంగా ఒక రోవర్‌ను దించింది. తద్వారా.. అమెరికా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో దేశంగా గుర్తింపు పొందింది. ఈ సంక్లిష్ట ప్రక్రియను దిగ్విజయంగా నిర్వహించిన శాస్త్రవేత్తలకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అభినందనలు తెలిపారు. తమ ఖగోళ పరిశోధనల్లో ఇదో ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌

ఇజ్రాయెల్‌, పాలస్తీనియన్ల ఘర్షణ పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటివరకు హమాస్‌ ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ శనివారం గాజా నగరంలో అసోసియేటెడ్‌ ప్రెస్‌(ఏపీ), అల్‌ జజీరా లాంటి ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థలు పనిచేస్తున్న 11 అంతస్తుల అల్‌-జలాల్‌ భవనాన్ని నేలమట్టం చేసింది. దాడి సమాచారాన్ని గంట ముందే భవన యజమానికి ఇజ్రాయెల్‌ అధికారులు అందించారు. ఆ తర్వాత క్షిపణులతో కూల్చివేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. శైలజా టీచర్‌... జనం మెచ్చిన లీడర్‌..!

ఆ సినిమా పేరు ‘వైరస్‌’. 2018 మే నెల కేరళలో ప్రాణాంతక నిపా వైరస్‌ ప్రబలినప్పుడు అక్కడి ఆరోగ్యశాఖ మంత్రి చూపిన తెగువ, కారుణ్యాల్ని ఈ చిత్రం ఉద్విగ్నంగా చూపిస్తుంది. ఆ సినిమాకి స్ఫూర్తి కె.కె.శైలజా టీచర్‌! ‘వైరస్‌’ విడుదలైన ఆరునెలలకి ఆమెకి కరోనా రూపంలో మరో పెద్ద సవాలు ఎదురైంది. ఈసారి ఆమె పనితీరు అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంటోంది. అందుకేనేమో, ఇటీవలి ఎన్నికల్లో కేరళ ప్రజ ఆమెని చరిత్రచూడని మెజారిటీతో గెలిపించింది! సినిమాని తలదన్నే ఆమె జీవిత ప్రస్థానంపై ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి 

10. ఎందరో మహానుభావులు..!

కరోనా కారణంగా ఇంట్లో ఒంటరిగా ఐసొలేషన్‌లో ఉన్నవారికి వంటచేసి పెట్టేవారుండరు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి సమయానికి ఆక్సిజన్‌ అందదు. పిల్లలకు చదువుల్లేవు... పెద్దలకు ఉద్యోగాల్లేవు... వృద్ధులకు మందులు లేవు... మొత్తంగా సామాజిక జీవనమే అల్లకల్లోలమైన నేటి పరిస్థితుల్లో రేపటి మీద ఆశ కల్పిస్తున్నది కొందరు మంచి మనుషులే..! వారి నిస్వార్థ సేవలే..! ఎక్కడికక్కడ తమకి ఉన్నంతలో, చేతనైన రీతిలో తోటివారిని ఆదుకుంటున్న వారు ప్రతి ఊళ్లోనూ కన్పిస్తున్నారు. స్వచ్ఛంద సేవాసంఘాలూ, ట్రస్టులూ తాము సేవలందిస్తున్న రంగాలకే పరిమితం కాక ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా సేవల్ని విస్తరిస్తున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని