Top Ten News: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 23/09/2021 09:02 IST

Top Ten News: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

1. Modi: అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్‌ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. పలువురు ఎన్నారైలు భారత జాతీయ జెండాలతో మోదీకి స్వాగతం పలికారు. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మూడు రోజులపాటు అక్కడ ఆయన పర్యటన కొనసాగనుంది. 

2. ఎదురులేని దిల్లీ

దిల్లీది అదే జోరు. బ్యాటుతో, బంతితో అదే ఆధిపత్యం. తొలి అంచెను అగ్రస్థానంతో ముగించిన ఆ జట్టు రెండో అంచెనూ ఘనంగా ఆరంభించింది. ఆల్‌రౌండ్‌ సత్తా చాటుతూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది. ఏడో విజయంతో దిల్లీ ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. సన్‌రైజర్స్‌ ఎప్పటిలాగే పేలవ బ్యాటింగ్‌తో భంగపడింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడో ఓటమి చవిచూసిన ఆ జట్టు ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించినట్లే!

* ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌ ఫైనల్లో సురేఖ బృందం

3. Road Accident: ట్రావెల్స్‌ బస్సు- టిప్పర్‌ ఢీ: 15 మందికి గాయాలు

విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి లక్కారం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సును టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో ట్రావెల్స్‌ బస్సు, టిప్పర్‌ డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఘటనాస్థలంలోనే మరో ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడే ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది.

4. కార్లు... ట్రాక్టర్లవైపే మొగ్గు

‘సార్‌...! రూ.10 లక్షలతో సొంతంగా కారు కొని అద్దెకు ఇస్తా. లేకుంటే నేనే నడుపుతా’. ‘నియోజకవర్గంలో వ్యవసాయ పనులకు డిమాండ్‌ ఎక్కువ. అందుకే ట్రాక్టర్‌ కొంటా’... దళితబంధు లబ్ధిదారులు అధికారులకు చెబుతున్న స్వయం ఉపాధి పథకాలివి. 70 శాతానికి పైగా లబ్ధిదారులు వీటితోనే ఉపాధి పొందాలని భావిస్తున్నారు. హుజూరాబాద్‌లో దళితబంధును ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.2 వేల కోట్లు విడుదల చేసింది.

5. రూ.10కే స్థలం రిజిస్ట్రేషన్‌

వివిధ పథకాల కింద ప్రభుత్వం నుంచి పట్టా మాత్రమే తీసుకుని రుణాలు తీసుకోకుండా లబ్ధిదారులే అక్కడే ఉంటే ఆ స్థలాన్ని జగనన్న శాశ్వత గృహ హక్కు(ఓటీఎస్‌) పథకం కింద రూ.10లతోనే రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. పట్టా తీసుకున్న వారు ఆ స్థలాన్ని వేరే వారికి అమ్మి...అక్కడ ఇతరులు ఇల్లు కట్టుకుంటే అలాంటి వారికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పురపాలక సంఘాల్లో రూ.15 వేలు, నగరపాలక సంస్థల్లో రూ.20 వేలు చెల్లిస్తే ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.

6. 12.49 లక్షల మందిలో జ్వర లక్షణాలు

తెలంగాణ రాష్ట్రంలో గత 19 వారాల్లో 12,49,064 మందిలో జ్వర లక్షణాలను గుర్తించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో కరోనా అనుమానిత లక్షణాలున్న 12,10,862 మందికి కొవిడ్‌ కిట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఈ ఏడాది మే 6 నుంచి నిర్వహిస్తోన్న ఇంటింటి సర్వే, జ్వర క్లినిక్‌ల ద్వారా సానుకూల ఫలితాలు వస్తుండడంతో.. వాటిని కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.

* తెలంగాణలో రైతు ఆత్మహత్యలు లేవు!

7. Degree Lessons: డిగ్రీ పాఠాల్లో ‘ఈనాడు’ కథనాలు

డిగ్రీ మూడో సంవత్సరం విద్యార్థుల కోసం తెలుగు అకాడమీ రూపొందించిన తెలుగు సాహితీ దుందుభి పుస్తకంలో ‘ఈనాడు’ కథనాలకు చోటుదక్కింది. ‘జర్నలిజం మౌలికాంశాలు’ అనే పాఠంలో వీటిని పొందుపరిచారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తాగునీటి సరఫరాలో లోపాలపై ఏప్రిల్‌ 8న ‘శుద్ధి జలం.. శుద్ధ అబద్ధం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించి ప్రజలకు స్వచ్ఛమైన నీరందేలా చర్యలు చేపట్టారు. పాఠ్యాంశంలో ఈ కథనాన్ని ప్రస్తావించడంతోపాటు రాసిన తీరునూ విశ్లేషించారు.

8. ఫేస్‌బుక్‌లో కొత్త ‘బూచాళ్లు’

ఫేస్‌బుక్‌ ఖాతాదారుల్లో చాలామందికి ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. నకిలీ ఖాతాలు తెరిచి ఫ్రెండ్స్‌ లిస్టులోనివారందరికీ డబ్బుల కోసం అభ్యర్థనలు పంపుతున్నట్లే తాజాగా.. ఖాతాలను హ్యాక్‌ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు ఫ్రెండ్స్‌ లిస్టులోని వారికి అశ్లీల, అభ్యంతరకర వీడియోలను పంపుతూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. ముఖ్యంగా సెక్యూరిటీ సెట్టింగ్స్‌ సరిగాలేని ఖాతాలను ఇందుకు ఎంచుకుంటున్నారు.

ఆదాయపు పన్ను రిఫండ్‌ వస్తుందంటే.. మోసపోకండి

ఉడాయ్‌పై సైబర్‌ దాడి

9. ఇక 10, 12 తరగతులకు కాగిత రహిత ధ్రువపత్రాలు

కాగిత రహితంగా.. ఎవరూ ట్యాంపర్‌ చేయడానికి వీల్లేని విధంగా 10, 12 తరగతుల బోర్డు పరీక్ష ఫలితాల ధ్రువపత్రాల (సర్టిఫికెట్ల) జారీకి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సమాయత్తమైంది. ఇందుకు గాను బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని వినియోగించనుంది. ఈ మేరకు ‘అకడమిక్‌ బ్లాక్‌ చెయిన్‌ డాక్యుమెంట్‌ (ఏబీసీడీ)’ పేరిట ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల జారీకి ఏర్పాట్లు చేసింది. దీని ద్వారా ధ్రువపత్రాలను సురక్షితంగా పదిలపరచడానికి వీలవుతుంది.

10. అఫ్గాన్‌, ఇరాన్‌ల నుంచి నిరంతర సందేశాలు

గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవులో రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టుబడ్డ కేసులో నిందితుడైన మాచవరం సుధాకర్‌కు అఫ్గానిస్థాన్‌, ఇరాన్‌లోని ముఠాల నుంచి ఎప్పటికప్పుడు సందేశాలు అందేవని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) గుర్తించింది. అతని భార్య దుర్గాపూర్ణ వైశాలి పేరిట విజయవాడలో ఉన్న ఆషీ ట్రేడింగ్‌ కంపెనీకి తీసుకున్న ఎగుమతి, దిగుమతుల కోడ్‌ (ఐఈసీ) లైసెన్సును మాదకద్రవ్యాల మాఫియాకు ఇచ్చినందుకు ఒక్కో కన్‌సైన్‌మెంట్‌పై రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు కమీషన్‌ అందేదని నిర్ధారించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని