Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 24/09/2021 08:55 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

1. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో ప్రధాని మోదీ భేటీ

భారత్‌- అమెరికా సహజ భాగస్వాములు అని ప్రధాని మోదీ అన్నారు. రెండు దేశాలు అతిపెద్ద ప్రజాస్వామ్యమైన దేశాలు అని, ఒకే రకమైన విలువలు, భౌగోళికమైన రాజకీయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ యూఎస్‌ఏ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో తొలిసారి వైట్‌ హౌస్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

2. IPL 2021: ముంబయిని కోల్‌కతా కుమ్మేసింది

ఇటు వెంకటేశ్‌ అయ్యర్‌.. అటు రాహుల్‌ త్రిపాఠి. కసిగా, నిర్దాక్షిణ్యంగా బాదుడే బాదుడు. బౌండరీలే బౌండరీలు. ఆ దంచుడికి, ఆ విధ్వంసానికి బలమైన ముంబయి బౌలింగ్‌ దళం తేలిపోయింది. 156.. పరుగుల లక్ష్యం మరో 29 బంతులు మిగిలి ఉండగానే ఉఫ్‌! కోల్‌కతాకు కీలక విజయం. ఆ జట్టు నాలుగో విజయంతో నాలుగో స్థానానికి ఎగబాకి ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకోగా.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి అయిదో ఓటమితో తన అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

మిక్స్‌డ్‌లోనూ పసిడి పోరుకు సురేఖ

3. పథకాలతో ప్రభుత్వం.. లోపాలపై విపక్షం

బడ్జెట్‌ సమావేశాల తర్వాత ఆరు నెలలకు అసెంబ్లీ కొలువుదీరుతోంది. శుక్రవారం నుంచి సభ ప్రారంభం కానుంది. దళితబంధు వంటి సరికొత్త పథకాలను సభ ముందుంచడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. గతంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి తదితర హామీల అమలు గురించి నిలదీయడానికి ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. 

నేడు దిల్లీకి సీఎం కేసీఆర్‌

4. దారి తప్పిన అప్పు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాల కోసం వివిధ ఆర్థిక సంస్థల నుంచి సేకరిస్తున్న నిధుల్లో రూ.వందల కోట్లు పక్కదోవ పడుతున్నాయి. రుణసేకరణ సమయంలో చెప్పే కారణం ఒకటైతే.. ఆ నిధులను వెచ్చిస్తున్న లక్ష్యం మరోటి కావడం గమనార్హం. కొన్ని సందర్భాల్లో రుణలక్ష్యం మేరకే పనులు చేసినా బిల్లులు చెల్లించడం లేదు. రుణం తీసుకురావడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అత్యవసరాలకు వాడుకోవడం, ఆనక ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయలేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.

5. పీఎం కేర్స్‌ ప్రభుత్వ నిధి కాదు

‘పీఎం కేర్స్‌ ఫండ్‌’ కేంద్ర ప్రభుత్వ నిధి కాదు. ఇందుకోసం వసూలు చేసే నిధులు భారత సంచిత నిధిలో జమ కావు. ఈ విషయాలను స్పష్టం చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అధికారి ఒకరు గురువారం దిల్లీ హైకోర్టులో ప్రమాణ పత్రం సమర్పించారు. పీఎం కేర్స్‌ ట్రస్టులో గౌరవపూర్వక విధులు నిర్వర్తిస్తున్న పీఎంవో అండర్‌ సెక్రటరీ ప్రదీప్‌ కుమార్‌ శ్రీవాత్సవ ఈ వివరాలను వెల్లడించారు.

6. ఆత్మహత్య చేసుకున్నా కరోనా పరిహారం

కొవిడ్‌-19 పాజిటివ్‌ నివేదిక వచ్చిన 30 రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న రోగుల కుటుంబీకులూ పరిహారం పొందడానికి అర్హులేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకూ పరిహారం అందించే విషయాన్ని పునఃపరిశీలించాలని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం సూచించిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు గురువారం ప్రమాణపత్రం దాఖలుచేసింది.

కొవిడ్‌ పరిహార నిర్ణయం భేష్‌ : సుప్రీం

7. ఓబీసీలను లెక్కించలేం

ఈ దఫా జనగణనలో ఓబీసీ లెక్కలను సేకరించడం సాధ్యం కాదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓబీసీల వివరాల సేకరణ పరిపాలన పరంగా చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని, దానివల్ల కచ్చితమైన డేటాను రూపొందించడం కష్టమని పేర్కొంది. క్లిష్టమైన జనాభా గణన ప్రక్రియలో కులాలవారీగానూ లెక్కలు సేకరించాలంటే మొదటికే మోసమొచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది.

8. రాత్రికి రాత్రే 500 మంది కోటీశ్వరులయ్యారు

సాంకేతిక (టెక్‌) ప్రతిభ ఉన్నవాళ్లను నియమించుకునేందుకు కొన్ని నెలల క్రితం కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న పరిస్థితుల్లో ఒక ఫిన్‌టెక్‌ సంస్థ ఏకంగా బీఎండబ్ల్యూ బైక్‌లను ఆఫర్‌ చేసింది. ఇదే సమయంలో బిజినెస్‌ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ ఫ్రెష్‌వర్క్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ గిరీశ్‌ మాతృబూతాన్ని ఒక విలేకరి ‘మీరు కూడా ఇంజినీర్ల నియామకం కోసం బైక్‌లను ఆఫర్‌ చేస్తారా?’ అని అడిగితే ‘మా ఇంజినీర్లకు సొంతంగా ఆ బైక్‌లను కొనుగోలు చేసే శక్తిని మేము అందిస్తామ’ని తెలిపారు. ఇప్పుడు అదే నిజమైంది! ఆ కంపెనీలో పని చేస్తున్న 500 మంది రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు.

డీమ్యాట్‌ ఖాతా.. ప్రారంభిస్తున్నారా?

9. కౌన్సెలింగ్‌తో ఆత్మహత్యలకు చెక్‌

ప్రేమ విఫలమైందని యువతీ యువకులు.. చదువుల్లో ఒత్తిడి పెరిగిందని విద్యార్థులు.. దీర్ఘకాల జబ్బులతో విసిగిపోయిన పెద్దలు.. అప్పులపాలైన ఉద్యోగులు, రైతులు.. ఇలా రకరకాల కారణాలతో నిత్యం ఎంతోమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అయితే, ఆత్మహత్య కూడా ఒక రోగమేనని.. దీనికి చికిత్స కంటే కుటుంబ చరిత్ర, ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కొనే వర్గాలను గుర్తించి ముందే కౌన్సెలింగ్‌ చేయడం ద్వారా బలవన్మరణాలను తగ్గించవచ్చని సూచిస్తోంది జీనోమ్‌ ఫౌండేషన్‌.

10. ప్రపంచాన్ని వణికిస్తున్న ‘డెల్టా’

ప్రపంచంపై డెల్టా రకం మళ్ళీ కోరలు చాస్తోంది. ప్రస్తుతం 185 దేశాల్లో ఇది పాగా వేసిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ తాజాగా హెచ్చరించింది. జూన్‌ 15 నుంచి సెప్టెంబరు 15 మధ్య సేకరించిన నమూనాల్లో 90శాతం డెల్టా కేసులే ఉన్నట్లు తన వారాంతపు నివేదికలో వెల్లడించింది. కరోనా వైరస్‌ ఆల్ఫా, బీటా, గామా, కప్పా... ఇవన్నీ అంత ఎక్కువగా వ్యాప్తి చెందకపోయినా, డెల్టా రకం అత్యంత వేగంగా విస్తరిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని