Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 28/09/2021 08:55 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

1. Heavy Rains: తెలంగాణలో కుంభవృష్టి

గులాబ్‌ తుపాను తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలను వణికించింది. భారీ వర్షాలతో ముంచెత్తింది. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో నిరంతరాయంగా వాన కురుస్తూనే ఉంది. అధిక వర్షాలతో పలు ప్రాంతాల్లో కాలనీలు, రోడ్లు నీటమునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు నిండిపోయాయి.

2. Cyclone Gulab: కుదిపేసింది

గులాబ్‌ తుపాను శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు ఆరు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. తుపాను ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకుంటుండగా ఆదివారం అర్ధరాత్రి నుంచే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ పలుచోట్ల కుంభవృష్టి కురిసింది. మొత్తం 277 మండలాల్లోనూ వానలు పడ్డాయి.

3. నేటి, రేపటి పరీక్షలన్నీ వాయిదా

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న ఇంజినీరింగ్‌, డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.

* ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు నేడు సెలవు

4. ఈ నెల అప్పు రూ. 5వేల కోట్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం బహిరంగ మార్కెట్‌ రుణం కోసం రిజర్వుబ్యాంకుకు ప్రతిపాదనలు పంపింది. ఈ నెల 28న నిర్వహించే బహిరంగ సెక్యూరిటీల వేలంలో రూ.500 కోట్ల చొప్పున  రూ.వెయ్యి కోట్లు సమీకరించేందుకు ఏర్పాట్లు చేసింది. 17 ఏళ్ల కాలపరిమితితో తిరిగి తీర్చే ఒప్పందం ప్రాతిపదికన రూ.500 కోట్లు, 20 ఏళ్ల కాలపరిమితితో మరో రూ.500 కోట్లు రుణం కావాలంటూ ప్రతిపాదించింది.

5. HYD: హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌ రైలు.. మూడు గంటల్లో ముంబయికి!

భాగ్యనగర్‌ వాసులకు మరో అత్యాధునిక రవాణా సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మెట్రోరైలు ప్రాజెక్టుతో నగరంలో ప్రయాణం ఎంతో సౌలభ్యంగా మారింది. ఐటీ రంగంలో పనిచేసే వారు సహా పలువురు నగరంలోని తమ గమ్యస్థానాలకు వేగంగా చేరుకోగలుతున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరానికి కూడా మూడు గంటల వ్యవధిలోనే చేరుకొనే సదుపాయం త్వరలో సాకారం కానుంది. హైదరాబాద్‌-ముంబయి మధ్య బుల్లెట్‌/హైస్పీడ్‌ రైలు మార్గాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

6. చెట్ల కింద చదువులు మేలు

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన శాంతినికేతన్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రకృతి ఒడిలో పిల్లలకు తరగతులు చెప్పడం మంచిదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) పేర్కొంది. కొవిడ్‌ మహమ్మారి కాలంలో పాఠశాలలు దీర్ఘకాలం మూసేయడం పిల్లల సంపూర్ణ వికాసంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాటిని క్రమంగా తెరవడానికి ప్రయత్నించాలని సూచించింది.

7. Justice NV Ramana: నేతలతో పోలీసుల కుమ్మక్కు

అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, పోలీసులు కుమ్మక్కవడం దేశంలో కొత్త విధానంగా మారిందని సోమవారం సుప్రీంకోర్టు మౌఖికంగా వ్యాఖ్యానించింది. అధికారంలో ఉన్న పార్టీతో సన్నిహితంగా మెలిగి డబ్బులు గుంజుకొనే పోలీసు అధికారులు ప్రభుత్వం మారినప్పుడు తప్పనిసరిగా తిరిగి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పింది. అలాంటి పోలీసులను ఎందుకు రక్షించాలని ప్రశ్నించింది.

8. వ్యాపారులకు రూ.25 లక్షల రుణం: అమెజాన్‌

అమెజాన్‌ ఇండియా మార్కెట్‌ప్లేస్‌లో నమోదైన వ్యాపారులు, చిన్న వ్యాపార సంస్థలకు రూ.25 లక్షల వరకు ఓవర్‌డ్రాఫ్ట్‌ (ఓడీ) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో కరెంటు ఖాతా ఉన్న  వ్యాపారులు తమ నిర్వహణ మూలధన అవసరాల కోసం దీన్ని వాడుకోవచ్చని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇతర బ్యాంకుల ఖాతాదారులూ.. తమ వద్ద కరెంటు ఖాతా ప్రారంభించి, ఈ వెసులుబాటును వినియోగించుకోవచ్చని పేర్కొంది.

చిన్న వ్యాపారులను ప్రోత్సహించాం: అమెజాన్‌

9. రామోజీ ఫిలింసిటీతో పర్యాటక రంగమే మారింది

రామోజీ ఫిలింసిటీ రాకతో రాష్ట్రంలో పర్యాటక రంగానికి కొత్త గుర్తింపు వచ్చిందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. నగరంలోని హరిత ప్లాజాలో సోమవారం నిర్వహించిన పర్యాటక దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రంగంలో ఉత్తమ సేవలందించిన సంస్థలకు పురస్కారాలు ప్రదానం చేశారు. 

10. రాజస్థాన్‌పై సన్‌రైజర్స్‌ విజయం

కష్టమే అయినా ఇంకా ప్లేఆఫ్స్‌పై ఆశలతో ఉన్న జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌. కానీ కీలక దశలో ఆ జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. ముందంజ వేయడం మరింత కష్టంగా మారింది. ఎనిమిది పరాజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్‌ అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ రాజస్థాన్‌ను ఓడించింది. పది మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కు ఇది ఆరో పరాజయం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని