TS: మే 31 వరకు  రెండో డోసు వారికే వ్యాక్సిన్‌
close

తాజా వార్తలు

Updated : 13/05/2021 18:09 IST

TS: మే 31 వరకు  రెండో డోసు వారికే వ్యాక్సిన్‌

హైదరాబాద్‌: వ్యాక్సిన్లకు కొరత ఏర్పడిన నేపథ్యంలో మే 31 వరకు రెండోడోసు వారికే వ్యాక్సిన్‌ ఇస్తామని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లోనే లాక్‌డౌన్‌ విధించిందని ఆయన అన్నారు. ప్రభుత్వం అనుమతించిన 4 గంటల్లోనే బయటకు రావాలని సూచించారు. ప్రజలు బయటకు వచ్చిన  సమయంలోనూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. నిత్యావసరాల కోసం ఇంటి నుంచి ఒకరు వస్తే సరిపోతుందని.. అందరూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు సహకరిస్తేనే లాక్‌డౌన్‌ ఫలితాలు అందుతాయని అన్నారు

ఆరోగ్య సేవల విషయంలో లాక్‌డౌన్‌ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ల కోసం బయటకు వచ్చే వారికి లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉందని  శ్రీనివాసరావు తెలిపారు. తగిన పత్రాలు చూపి పోలీసుల అనుమతి పొందవచ్చన్నారు. ఆస్పత్రుల్లో పడకల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆస్పత్రుల్లో పడకల కొరత లేదని, రాష్ట్రంలో ప్రస్తుతం 5,783 ఆక్సిజన్‌ పడకలు, 17,267 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాలకు ఎలాంటి కొరత లేదని, ప్రైవేటు ఆస్పత్రులు ఆక్సిజన్‌ను సక్రమంగా వినియోగించాలని శ్రీనివాసరావు సూచించారు. ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ గురించి స్టేట్‌ టాస్క్‌ ఫోర్సు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, ఆక్జిజన్‌ మానిటరింగ్‌ టీమ్స్‌ను ఇప్పటికే ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అయితే ఆరు నుంచి 8 వారాలలోపు, కొవాగ్జిన్‌ అయితే 4 నుంచి 6 వారాలలోపు రెండో డోసు తీసుకోవచ్చని శ్రీనివాసరావు తెలిపారు. ఇంకా 15 లక్షల మంది రెండోడోసు తీసుకోవాల్సి ఉందని, మే 31 వరకు వీరందరికీ పూర్తి చేసి, మిగతావారికి దశలవారిగా ఇస్తామని అన్నారు.

గాంధీలో 3 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

ఆస్పత్రుల్లో ఎక్కడా ఆక్జిజన్‌ కొరత లేదని,  ట్యాంకులో ఆక్సిజన్‌ తగ్గుతున్నప్పుడే సంస్థలకు మెసేజ్‌ వెళ్తుందని డీఎంఈ రమేశ్‌ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా బ్లాక్‌ ఫంగస్‌ గురించి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో డీఎంఈ వివరణ ఇచ్చారు. కొవిడ్‌ సోకిన ప్రతి ఒక్కరికీ బ్లాక్‌ ఫంగస్‌ రాదని అన్నారు. గాంధీ ఆస్పత్రిలో కేవలం మూడు మాత్రమే బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఉన్నాయనీ, అవి కూడా ప్రైవేటు నుంచి వచ్చాయని రమేశ్‌రెడ్డి వివరించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని