రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక 11 మంది మృతి
close

తాజా వార్తలు

Updated : 12/05/2021 02:25 IST

రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక 11 మంది మృతి

ఆక్సిజన్‌ ట్యాంకర్‌ 5 నిమిషాలు ఆలస్యం

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 1000 మంది

తిరుపతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో తీవ్ర విషాదం నెలకొంది. ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం నెలకొని 11 మంది కరోనా బాధితులు చనిపోయినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. చెన్నై నుంచి  ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రాకలో 5 నిమిషాల పాటు ఆలస్యం కావడంతో ఈ సంఘటన జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే వెంటనే తేరుకొని ఆక్సిజన్‌ పునరుద్ధరించడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలిపారు. సోమవారం రాత్రి 8 నుంచి 8.30 గంటల సమయంలో ఆక్సిజన్‌ ప్రెజర్‌ సమస్య ఏర్పడినట్లు తెలిపారు. దీంతో వెంటిలేటర్‌లో ఉన్న బాధితులు చనిపోయినట్లు ఆయన పేర్కొన్నారు. మిగతారోగుల పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరూ కూడా భయందోళనలు చెందాల్సిన పరిస్థితి లేదన్నారు. ఆసుపత్రిలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవన్నారు.  30 మంది డాక్టర్లు మిగతా బాధితులను పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. ఎస్వీఆర్‌ఆర్‌ ఆసుపత్రిలో దాదాపు 1000 మంది చికిత్స పొందుతున్నారు.   ఆక్సిజన్‌ సరఫరాలో ఒక్కసారిగా అంతరాయం నెలకొనడంతో  కొవిడ్‌ బాధితులు ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అత్యవసర శ్వాస ఆడించేందుకు వైద్యులు సీపీఆర్‌ చేశారు. బంధువులు కూడా బాధితులకు గాలి ఆడేందుకు అట్టముక్కలతో విసిరారు.  మరోవైపు ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

సీఎం జగన్‌ ఆరా..

తిరుపతి రుయా ఘటనపై సీఎం జగన్‌ ఆరా తీశారు. రుయా ఆసుపత్రి ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

రుయా ఘటన కలిచివేసింది: హోంమంత్రి సుచరిత

తిరుపతి రుయా ఘటనపై హోంమంత్రి సుచరిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన హృదయాన్ని కలిచివేసినట్లుగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు అధికారులను మంత్రి సుచరిత ఆదేశించారు. ఆసుపత్రిలో సహాయక చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. 

ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం: పవన్‌ కల్యాణ్‌

రుయా ఆసుపత్రి ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఆక్సిజన్‌ అందకపోవడం మూలంగా 11 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదనను కలిగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఊపిరి అందించే వాయువుని సక్రమంగా అందించని దుస్థితి నెలకొనడం వల్లే ఈ విషాదకరమైన ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ‘‘రాయలసీమ ప్రజల వైద్య అవసరాలకు కేంద్రమైన రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరా, వైద్య పరమైన మౌలికవసుతులు సరిగా లేవని రోగులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్కిజన్‌ కొరత తీవ్రంగా ఉందని అందరూ చెబుతున్నారు. కర్నూలు, హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఆక్సిజన్‌ అందక చనిపోయారు. అయినప్పటికీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకోలేదు. ఇలాంటి విపత్కర సమయంలో విమర్శలు చేయకూడదని సంయమనం పాటిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా తక్షణమే పరిస్థితులను చక్కదిద్దుకోవాలని, రాష్ట్రంలో మరెక్కడ ఇలాంటి విషాదకరమైన ఘటనలకు చర్యలు చేపట్టాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 

చాలా బాధాకరం: భానుప్రకాశ్‌రెడ్డి

రుయా ఆసుపత్రి ఘటన చాలా బాధాకరమని భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు. రుయా ఘటనకు సిబ్బంది నిర్లక్ష్యమే కారణంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలన్నారు. ఆక్సిజన్‌ 8 గంటల వరకే నిల్వ ఉన్నట్లు తమకు సమాచారమున్నట్లు ఆయన తెలిపారు. 

మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: అచ్చెన్నాయుడు

రుయా ఆసుపత్రిలో రోగులు మృతి చెందడం బాధాకరమని తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. పాలన చేతకాకపోతే జగన్‌ రాజీనామా చేయాలని అచ్చెన్నాయుడు విమర్శించారు. చేతకాని పాలనతో ప్రాణాలు తీస్తున్న జగన్‌పై కేసు నమోదు చేయాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని