నింగికేగిన ప్రాణదాత  
close

తాజా వార్తలు

Updated : 11/05/2021 15:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నింగికేగిన ప్రాణదాత  

డాక్టర్‌ కొడాలి పాపారావు ఇకలేరు

గూడవల్లి(చెరుకుపల్లి గ్రామీణం-గుంటూరు): ఎందరో ప్రాణాలను నిలిపిన వైద్యనారాయణుడు, ఎందరికో స్ఫూర్తినిచ్చిన వైద్యశిఖామణి డాక్టర్‌ కొడాలి పాపారావు(96) కన్నుమూయడం తీరప్రాంత వాసులను కలిచి వేసింది. 65 ఏళ్ల సుదీర్ఘ వైద్యవృత్తిలో ఎందరికో ప్రాణం పోసి ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన మహనీయుడు. పూరిపాకలో, లాంతరు వెలుతురులో శస్త్రచికిత్సలు చేసి ప్రజలను వెలుగువైపు నడిపించిన ధీశాలి.  గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో స్థిరపడిన ఆయన రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడు. దేశంమీద ప్రేమతో వైద్యవృత్తిని పూర్తిచేయగానే ఆర్మీలో విశేష సేవలందించి కెప్టెన్‌ హోదాలో బయటకు వచ్చారు. అంతుపట్టని వ్యాధితో తండ్రి మరణం ఆయన్ను కలిచివేసినా సోదర సమానుడు దివంగత కాకర్ల సుబ్బారావు స్నేహం ఆయనలో స్ఫూర్తి నింపింది. చెరుకుపల్లిలో తండ్రిపేరిట హరి మెమోరియల్‌ నర్సింగ్‌ హోంను 1970 దశకంలో ప్రారంభించారు. పూరిపాకలో లాంతరు వెలుతురులో ఆయనే స్వయంగా సెలైన్లు తయారు చేసి శస్త్రచికిత్సలు నిర్వహించే వారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి రోగులు వచ్చి వైద్యం చేయించుకునేవారు. 

పావలా డాక్టర్‌గా ప్రసిద్ధి.. 
పావలా వైద్యునిగా పేరుగాంచిన కొడాలి పాపారావు 1960 వరకు పావలాకు వైద్యం చేశారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు రూ.1కే వైద్యం చేసిన ఆయన.. 1990 తర్వాత ఐదు రూపాయల ఫీజుతో బడుగు, బలహీనవర్గాల వారికి ఉచితంగా సేవలందించారు. పాపారావును వైద్యశిరోమణి అని డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు ఎంతో ప్రేమగా పిలిచే వారని ఆయన శిష్యులు అంటున్నారు. పాపారావుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య రాజారత్నం రెండేళ్ల క్రితం కన్నుమూశారు. కుమారుడు కొడాలి కృష్ణ కుమార్‌ హైదరాబాద్‌లో కిమ్స్‌ ఆస్పత్రిలో హృదోగ వైద్యనిపుణునిగా పనిచేస్తుండగా, ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడగా.. మరో కుమార్తె గుంటూరు జిల్లా బాపట్లలో ఉంటున్నారు. పాపారావు మనుమలు, మనుమరాండ్రలలో ఆరుగురు వైద్యవృత్తిలో, మిగిలిన వారు వైద్యరంగానికి సంబంధించిన వివిధ విభాగాల్లో కొనసాగుతున్నారు. ఆయన లేనిలోటు పూడ్చలేనిదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. 

గ్రామీణ వైద్యానికి పెద్దపీట వేసిన మహామనీషి!
ప్రకాశం జిల్లాలో కొడవలివారి పాలెం (ప్రస్తుతం గుంటూరు జిల్లా)లో ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన డాక్టర్‌ పాపారావు.. మూడు నాలుగేళ్ల వయస్సులోనే తల్లిని కోల్పోయారు. ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగానే సాగినా.. హైస్కూల్‌ విద్య మాత్రం తురుమెళ్లలో పూర్తిచేశారు. ఆతర్వాత గుంటూరులోని ఏసీ కళాశాశాలలో ఇంటర్‌ విద్యనభ్యసించారు. గుంటూరులోని ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో మెడికల్‌ సీటు వచ్చింది.అలాగే, మద్రాస్‌లోని గిండీ ఇంజినీరింగ్‌ కళాశాలలోనూ ఆయనకు సీటు వచ్చినా ఆయన  మెడిసిన్‌లో చేరారు. ఆ బ్యాచ్‌లో 50 మందిలో ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు కూడా ఒకరు. 1950లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ఆయన.. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు గుంటూరులో ప్రముఖ సర్జన్‌ డాక్టర్‌ పరుచూరి వీరయ్య చౌదరి వద్ద కొన్నాళ్ల పాటు పనిచేశారు. ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం పరీక్షల సమయంలో తన తండ్రిని కోల్పోయారు. 

ఆ తర్వాత పాపారావు సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నారు. 1950లో ఆర్మీలో చేరారు. కెప్టెన్‌గా రిలీవైన తర్వాత జనరల్‌ మెడిసిన్‌లో పీజీ డిగ్రీని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. వివాహం చేసుకున్న ఆయన చీరాల లేదా గుంటూరులో ప్రాక్టీస్‌ పెట్టాలని భావించారు. సైన్యం నుంచి తిరిగి వచ్చాక సమీపంలోని తన అత్తవారి ఇంట్లో ఉంటూ గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో రోగులను చూడటం మొదలు పెట్టారు. గ్రామీణ ప్రజల వైద్య అవసరాలను గమనించిన ఆయన అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఆయనకు ఆర్మీలో పనిచేసిన అనుభవానికి తోడు గుంటూరులోని డాక్టర్‌ సదాశివరావు, డాక్టర్‌ కొడాలి వీరయ్య, డాక్టర్‌ కుర్రా వీరరాఘవయ్య తదితరులు మద్దతు కూడా ఉంది. మెడిసిన్‌, సర్జరీ రెండింట్లోనూ ప్రాక్టీసు ఉన్నందున  క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసి మంచి పేరు సంపాదించారు. ఆయన దాదాపు 60 మందికి పైగా వైద్యులకు ఎంబీబీఎస్‌ తర్వాత శిక్షణ ఇచ్చారు. వారిలో చాలా మంది సెమీ రూరల్‌ ప్రాంతాల్లోనే ప్రాక్టీసు పెట్టారు.

గొప్ప సామాజిక సంస్కర్త కూడా.. 

రోగాలను నయం చేసే వైద్యుడిగానే కాకుండా ఆయన ఓ గొప్ప సామాజిక సంస్కర్తగా కూడా సేవలందించారు. పరిశుభ్రతపైనా ప్రజలను చైతన్యపరిచేవారు. పొగత్రాగడం, మద్యం సేవించడం తదితర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించేవారు. పౌష్టికాహారం తీసుకోవడం, మరీ ముఖ్యంగా కుటుంబ నియంత్రణ అంశంపై అవగాహన కల్పించేవారు. విద్యారంగంపై ఉన్న ఆసక్తి ఆయన్ను తెనాలిలోని వీఎస్‌ఆర్‌ కళాశాల ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా చేసింది. అలాగే, నన్నపనేని వెంకటేశ్వరరావుకు బలమైన అనుచరుడిగా మార్చింది. గూడవల్లి గ్రామంలోని పాఠశాల అభివృద్ధిలో డాక్టర్‌ పాపారావు కీలకంగా వ్యవహరించారు. ఆ పాఠశాల కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. చెరుకుపల్లిలోని గుల్లపల్లిలో పాఠశాల ప్రారంభించడంలోనూ ఆయనదే కీలక పాత్ర. రోటరీ క్లబ్‌లో దాదాపు ఐదేళ్లకు పైగా క్రియాశీలంగా వ్యవహరించిన ఆయన అనేక కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. గూడవల్లిలో మైత్రేయి వృద్ధాశ్రమం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు. అలాగే, అక్కడే మ్యారేజ్‌ హల్‌, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణంలోనూ సహకారమందించారు. సోషలిస్టు సిద్ధాంతం వైపు మొగ్గుచూపిన ఆయన.. అప్పట్లో జనతాపార్టీకి బలమైన మద్దతుదారుడిగా ఉండేవారు. ఆ తర్వాత తెదేపా మద్దతుదారుగా ఉన్నారు. 1990ల తర్వాత రాజకీయాల్లో క్రియాశీలంగా లేరు. 

స్ఫూర్తిదాత: పాపారావు వైద్యరంగంలో ఎవరెస్టులాంటి వారు. ఆయన స్ఫూర్తితోనే నేను ఈ రంగంలో స్థిరపడ్డా. రోగి మానసిక, శారీరక పరిస్థితులను అవగాహన చేసుకుని ఆయన వైద్యం చేసేవారు. మిలటరీలో పనిచేయడం ఆయన ఆత్మవిశ్వాసాన్ని, క్రమశిక్షణను పెంచింది. - డాక్టర్‌ కొడాలి మోహన్, పిల్లల వైద్యనిపుణుడు, చెరుకుపల్లి

ఆయనే గురువు: తాతగారితో నా అనుబంధం ఎన్నో జన్మల పుణ్యం. ఆయన్ను చూస్తూనే పెరిగాం. ఆయన మార్గదర్శనంలో వైద్యవృత్తి పూర్తి చేశా. తాతగారితోనే నిత్యం ఉంటూ ఆయనతో రోగులకు సేవలందించా. - డాక్టర్‌ శ్రీనాథ్, పాపారావు మనుమడు, గూడవల్లి 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని