కశ్మీర్‌పై ఈ నెల 24న ప్రధాని అఖిలపక్ష సమావేశం
close

తాజా వార్తలు

Updated : 20/06/2021 14:25 IST

కశ్మీర్‌పై ఈ నెల 24న ప్రధాని అఖిలపక్ష సమావేశం

జమ్మూ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జమ్మూకశ్మీర్‌ సమస్యలపై ఈ నెల 24న అఖిలపక్ష సమావేశం జరగనుంది. దిల్లీలో జరగనున్న ఈ సమావేశం గురించి ఇప్పటికే జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రధాన పార్టీల నేతలకు కేంద్రం నుంచి సమాచారం అందినట్లు తెలిసింది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాక ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభనను అంతం చేయడానికి అఖిలపక్ష సమావేశం కీలకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక హోదాను పునరుద్ధరించడం సహా ఈ ప్రాంతానికి సంబంధించిన పలు ప్రధాన సమస్యల పరిష్కారంపై సమావేశంలో కేంద్ర ప్రభుత్వం చర్చించనుందని ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది నవంబరు లేదా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం అక్కడి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశం ఉన్నట్టు అధికారిక వర్గాల సమాచారం.

అఖిలపక్ష సమావేశంపై పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ స్పందించారు. సమావేశానికి హాజరు కావాలంటూ తనకు ఫోన్‌కాల్‌ వచ్చిందని ఆమె తెలిపారు. అయితే అది అధికారిక ఆహ్వానం కాదని ఆమె స్పష్టం చేశారు. మరో 16 పార్టీల స్థానిక నేతలకు కూడా ఇలాగే అనధికారికంగా ఆహ్వానాలు అందాయని సమాచారం. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం గురించి చర్చించేందుకు తమ పార్టీ నేతలతో ఆమె ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. జమ్మూ కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపేందుకు కేంద్రం సుముఖంగా ఉంటే.. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ) పార్టీ అధినేత, పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్‌కార్‌ డిక్లరేషన్‌(పీఏజీడీ) అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తగిన వ్యూహంతో అఖిలపక్ష సమావేశానికి పీఏజీడీ హాజరయ్యే అవకాశం ఉంది.

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం 2019, ఆగస్టులో రద్దు చేసింది. అనంతరం రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ,  ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా కొన్ని నెలల  పాటు జైళ్లలో గడిపారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని