Corona: నేటి ‘పాజిటివ్‌’ న్యూస్‌

తాజా వార్తలు

Published : 30/05/2021 21:11 IST

Corona: నేటి ‘పాజిటివ్‌’ న్యూస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి క్రమేణా తగ్గుతోంది. మరోవైపు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను నెమ్మదిగా సడలిస్తున్నాయి. రానున్న రోజుల్లో టీకాల సంఖ్యను పెంచుతామని కేంద్రం ప్రకటించింది. ఇలాంటి ఉపశమనం కలిగించే మరిన్ని పాజిటివ్‌ వార్తలు మీకోసం...

👍 TS Lockdown: సడలింపు సమయం పొడిగింపు

తెలంగాణలో లాక్‌డౌన్ స‌డ‌లింపు సమయాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 10 గంటలకు ముగియాల్సిన సడలింపును మధ్యాహ్నం ఒంటి గంట వరకు పొడిగించింది. స‌డలింపు స‌మ‌యం త‌ర్వాత బ‌య‌టికి వెళ్లిన ప్ర‌జ‌లు ఇళ్ల‌కు చేరుకోవ‌డానికి మ‌రో గంట పాటు అద‌న‌పు స‌మ‌యం ఇచ్చారు. దీంతో మ‌ధ్యాహ్నం 2 గంటల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంటల వ‌ర‌కు క‌ఠిన లాక్‌డౌన్ అమ‌లు చేయనున్నారు.

👍 India Vaccination: జూన్‌లో 12కోట్ల డోసులు!

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే విషయాన్ని వెల్లడించింది. జూన్‌లోనే 12 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. మే నెలలో 7.9 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉండగా.. జూన్‌లో ఈ సంఖ్య 12 కోట్లకు పెరగనుంది. జూన్‌లో 6.09 కోట్ల డోసులను అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగానే సరఫరా చేస్తారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

👍 KTR: విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకా

జర్నలిస్టులు, వ్యాపారులకు ఇప్పటికే టీకాలు ఇస్తున్న తెలంగాణ‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేర‌కు కేబినేట్‌లో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉన్న‌త విద్య కోసం విదేశాల‌కు వెళ్లే వారికి వ్యాక్సినేష‌న్‌లో ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న ట్వీట్ చేశారు. 

👍 PM Modi: 10 రెట్లు పెరిగిన ఆక్సిజన్‌ ఉత్పత్తి

దేశంలో ఆక్సిజన్‌ కొరతను అధిగమించడానికి దేశవ్యాప్తంగా అనేక చర్యలు చేపట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విదేశాల నుంచి క్రయోజనిక్‌ ట్యాంకర్లు, కాన్సన్‌ట్రేటర్లు దిగుమతి చేసుకోవడంతో పాటు దేశీయంగా కొత్త ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణం జరిగిందన్నారు. ఈ క్రమంలో రోజుకు 900 మెట్రిక్‌ టన్నులుగా ఉన్న ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం... నేడు 9,500 మెట్రిక్‌ టన్నులకు పెరిగిందని తెలిపారు. దాదాపు 10 రెట్లు ఆక్సిజన్‌ ఉత్పత్తి పెరిగిందని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. 

👍 TS Govt: కొత్త‌గా ఏడు మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటు

కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో కొత్తగా ఏడు మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మ‌హ‌బూబాబాద్‌, జ‌గిత్యాల‌, సంగారెడ్డి, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, కొత్త‌గూడెం, మంచిర్యాల జిల్లాల్లో  కొత్త మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. 

👍 UP Lockdown: ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ సడలింపులు

రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి లాక్‌డౌన్‌ను క్రమంగా సడలించనున్నట్లు ప్రకటించింది. తొలుత 600 కంటే తక్కువ క్రియాశీలక కేసులు ఉన్న జిల్లాలు, నగరాల్లో కఠిన ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఆయా జిల్లాల్లో వారంలో ఐదు రోజులు అన్ని దుకాణాలు, మార్కెట్లు ఉదయం 7 నుంచి సాయంత్రం 7  వరకు తెరిచేందుకు అనుమతించనుంది. వారాంతంలో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

👍 TS Govt: రిజిస్ట్రేషన్లకు అనుమతి

తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ నిబంధనల సడలింపు నిబంధనలను అనుసరించి... రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ పనిదినాల్లో, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే భూములు, ఆస్తుల రిజిష్ట్రేషన్లతో పాటు, రవాణాశాఖ ఆధ్వర్యంలో జరిగే వాహనాల రిజిస్ట్రేషన్‌ను అనుమతించాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయించింది.

👍 India Corona: కరుగుతున్న కరోనా కేసుల కొండ!

దేశంలో కరోనా కేసులు, మరణాలు వరుసగా మూడో రోజూ తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1,65,553 కేసులు, 3,460 మరణాలు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు వరుసగా 6వ రోజు 10%లోపు నమోదైంది. ఒక్క రోజులో 2,76,309 మంది కోలుకోగా రివకరీ రేటు 91.25%కి పెరిగింది. క్రియాశీల కేసుల సంఖ్య మరింత తగ్గి 21,14,508 (7.58%)కి చేరింది. మొత్తంగా కేసుల సంఖ్య 2.79 కోట్లకు చేరువ కాగా, కొవిడ్‌ బారినపడి 3,25,972 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల రేటు 1.17 శాతంగా ఉంది. రోజువారీ మరణాలు గత ఐదు రోజుల కంటే తక్కువ నమోదయ్యాయి. 

👍 CoronaVaccine: టీకాతో ఏడాది పాటు రక్షణ

ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్ వ్యాక్సిన్ల ప్రభావం కనీసం ఒక సంవత్సరం పాటు ఉంటుందని కర్ణాటకకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్‌ వి.రవి పేర్కొన్నారు. కొత్త వేరియంట్లు రాకపోతే టీకాల ప్రభావం రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు కూడా ఉంటుందని వెల్లడించారు. ‘ప్రస్తుతమున్న టీకాలు కొత్త వేరియంట్ల ప్రభావం లేకపోతే రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు రక్షణగా ఉంటాయి’ అని తెలిపారు. 

👍 Gurantee Scheme: ఈసీఎల్‌జీఎస్‌ గడువు పెంపు

కరోనా సెకండ్‌ వేవ్‌లో వ్యాపారాలు దెబ్బతినడంతో రుణాలను చెల్లించలేని సంస్థలకు ఊరటనిచ్చే విషయాన్ని ప్రభుత్వం చెప్పింది. ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారెంటీ స్కీం (ఈసీఎల్‌జీఎస్‌)ను విస్తరించింది. పథకాన్ని విస్తరించడం ఇది నాలుగోసారి. ఈ పథకంలో ఉన్న రూ.500 కోట్ల రుణ పరిమితిని కూడా ఈ సారి తొలగించింది. రుణంలో 40 శాతం గానీ, లేదా ₹200 కోట్లు కానీ అదనంగా తీసుకోవచ్చు. ఈ స్కీం తుది గడువును సెప్టెంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 31కు పొడిగించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని