Corona: ప్రాణం పోతోంది.. కాపాడండి సార్‌
close

తాజా వార్తలు

Updated : 10/05/2021 09:52 IST

Corona: ప్రాణం పోతోంది.. కాపాడండి సార్‌

వైవీ సుబ్బారెడ్డికి గ్రామ వాలంటీర్‌ వీడియో సందేశం
వైవీ స్పందించినా దక్కని ఫలితం

కాకినాడ గ్రామీణం(ఇంద్రపాలెం), న్యూస్‌టుడే: ప్రాణం పోతోంది.. ఊపిరాడటం లేదు.. కాపాడండి సార్‌ అంటూ ఓ గర్భిణి వాట్సాప్‌ వేదికగా వేడుకున్నారు. కరోనాతో పోరాడుతూనే చివరకు తుదిశ్వాస విడిచారు. ఆమె కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణం రమణయ్యపేట బాపన్నదొర కాలనీ 3వ గ్రామసచివాలయంలో ఎరుసు లక్ష్మి (32) వాలంటీరుగా సేవలందిస్తున్నారు. కరోనా చికిత్స కోసం ఈ నెల 1న కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. ఆమె భర్త రామ్మోహన్‌రెడ్డి ఆటోడ్రైవర్‌. ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. జీజీహెచ్‌లో తనను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి వాట్సాప్‌లో ఆమె వీడియో పంపించారు. వెంటనే స్పందించిన ఆయన జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డిని ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సరైన వైద్యం అందించాలని కోరారు.

కలెక్టర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం గైనకాలజీ వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించారు. అయినప్పటికీ శనివారం ఆమె చనిపోయారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని భర్త ఆరోపిస్తున్నారు. గర్భంలోని బిడ్డ దక్కకపోయినా తన భార్యను రక్షించాలని తాము వైద్యులను ప్రాధేయపడ్డామని కన్నీరుమున్నీరయ్యారు. వాలంటీరుగా విధులు నిర్వహిస్తుండగానే ఆమెకు కరోనా సోకిందని, ప్రభుత్వమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తోటి వాలంటీర్లు, కుటుంబీకులు, బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని