Sabbam Hari: కరోనాతో కన్నుమూత

తాజా వార్తలు

Updated : 03/05/2021 22:36 IST

 Sabbam Hari: కరోనాతో కన్నుమూత

విశాఖ : కరోనా మహమ్మారి బారినపడి మరో రాజకీయ ప్రముఖుడు కన్నుమూశారు. తెదేపా నేత, మాజీ ఎంపీ సబ్బం హరి (69) విశాఖలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇటీవల ఆయన కొవిడ్‌ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా విశాఖ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సబ్బం హరికి కొవిడ్‌తో పాటు ఇతర ఇన్ఫెక్షన్లు ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించినా.. ప్రయోజనం లేకపోయింది.

సబ్బం హరి స్వస్థలం తగరపువలస సమీపంలోని చిట్టివలస. 1952 జూన్‌ 1న జన్మించారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం ఇదీ..

సబ్బం హరి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌ కార్యకర్తగా మొదలైంది 1985లో విశాఖ నగర యువజన కాంగ్రెస్‌ కార్యకర్తగా పనిచేసిన ఆయన.. 1989 ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేల గెలుపులో కీలక పాత్ర పోషించారు. 1995లో ఆయన విశాఖ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ సమయంలో విశాఖ నగర అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. 2009లో అనకాపల్లి నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. సమైక్యాంధ్ర పోరాటంలోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు. 2019లో తెదేపాలో చేరారు. ఆ తర్వాత భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 

చంద్రబాబు దిగ్భ్రాంతి
సబ్బం హరి మృతిపట్ల తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటన్నారు. విశాఖ మేయర్‌గా.. ఎంపీగా ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. హరి కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు, విశాఖ తెదేపా కార్యాలయంలో పలువురు నేతలు నివాళులర్పించారు.

సీఎం జగన్‌ సంతాపం

మాజీ ఎంపీ సబ్బం హరి మృతిపట్ల సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి, వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

త్వరగా కోలుకోవాలని అంతా ఆశించాం.. కానీ!
మాజీ ఎంపీ సబ్బం హరి మృతి పట్ల తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు.  ఆయన కరోనా బారిన పడి మృతిచెందడం బాధాకరమన్నారు. త్వరగా కోలుకోవాలని అంతా ఆశించామనీ.. ఇంతలోనే ఆయన మరణ వార్త వినాల్సి రావడం దురదృష్టకరమన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని