కష్టాలు ఆమెను కాటికాపరిగా మార్చాయి
close

తాజా వార్తలు

Published : 08/03/2021 19:45 IST

కష్టాలు ఆమెను కాటికాపరిగా మార్చాయి

భర్త చేసిన వృత్తినే బతుకుదెరువుకు ఎంచుకొన్న మహిళ

ఇంటర్నెట్‌ డెస్క్‌: కష్టాలు ఆమెకు దగ్గరి చుట్టాలు. తల్లి కేన్సర్‌తో మృతిచెందింది. తండ్రి మంచానికే పరిమితమయ్యాడు. తోబుట్టువు మధ్యలోనే కాలంచేశాడు. కడదాకా తోడుంటానని ప్రమాణం చేసిన భర్త అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఇలా కష్టాల కడలి వెంటాడుతున్నా ఆమె ఏనాడూ కుంగిపోలేదు. భర్త చేసిన కాటికాపరి వృత్తినే బతుకుదెరువుగా ఎంచుకొంది. తనతోపాటు మరో నలుగురిని సాకుతోంది. కళేబరాలు, కంకాళాలు కళ్లెదుటే కనబడుతున్నా.. రాత్రింబవళ్లు మృతదేహాలు వస్తున్నా.. ఎవరూ చేయని సాహసం చేస్తోంది భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ముత్యాల అరుణ. తాను బతకడమే కాదు మరికొంతమందికి ఆసరాగా నిలుస్తోంది.

ముత్యాల అరుణకు చిన్న వయసులోనే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన కాటికాపరి శ్రీనుతో వివాహం జరిగింది. భద్రాచలం గోదావరి కరకట్ట సమీపంలోని వైకుంఠఘాట్‌లో అతడు పనిచేసేవాడు. అయితే అతడు తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. ఇంటిని తాకట్టుపెట్టి అప్పులు తెచ్చి భర్తకు చికిత్స చేయించింది అరుణ. అయినా, అతడి ప్రాణం దక్కలేదు. ఓ వైపు భర్త మరణం.. మరో వైపు అప్పులు.. తనపైనే ఆధారపడిన తండ్రి, పిల్లలు.. తినడానికి తిండి లేని పరిస్థితి.. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాటికాపరి వృత్తిని చేపట్టింది. భర్త పనిచేసిన వైకుంఠఘాట్‌ వద్దే కాటికాపరిగా పనిచేస్తోంది. కళేబరాలు కళ్లెదుటే కనబడుతున్నా ఏమాత్రం జంకు లేకుండా అంత్యక్రియలు చేస్తోంది. మూడేళ్లుగా ఆమె ఈ వృత్తిలో ఉంది. ఇటీవల కరోనాతో మృతిచెందిన వారికి భౌతిక కాయాలకు కూడా ధైర్యంగా అంత్యక్రియలు నిర్వహించింది అరుణ. ఆగస్టులో వరదలొచ్చినపుడు స్మశానవాటికలోకి నీళ్లొచ్చాయి. అప్పుడు కరకట్ట వాలులో కట్టెలు పేర్చి కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేసింది.

మొదట్లో దహన సంస్కారాలు నిర్వహించాలంటే కాస్త భయంగా అనిపించేదని, ఇంటికి వచ్చాక అన్నం సహించేది కాదని అరుణ పేర్కొంది. ప్రస్తుతం తండ్రితోపాటు ఇద్దరు వృద్ధులను అన్నీ తానై చూసుకుంటోంది. కుమార్తెకు వివాహం చేసి ఇద్దరు కుమారులను పోషిస్తోంది. ఓ వైపు కష్టాల కడలిని ఎదురీదుతూనే మరోవైపు జీవన పోరాటంలో సాహసోపేతమైన విధులు నిర్వహిస్తున్న ముత్యాల అరుణపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమె సాహస ప్రయాణం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని