బొమ్మ.. చీర కట్టింది

తాజా వార్తలు

Published : 26/05/2021 01:11 IST

బొమ్మ.. చీర కట్టింది

బొమ్మలకు కొత్త రూపునిస్తున్న శ్రీలంక కళాకారుడు
 భారతీయురాలైన మిస్‌ యూనివర్స్‌ రన్నరప్‌ నుంచి స్ఫూర్తి పొందినట్టు వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా బార్బీ బొమ్మకు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా చీరకట్టులో మెరిసిపోయే బొమ్మలు మనకూ ఉన్నాయి. ఇలా బొమ్మలకు భారతీయ సంస్కృతిని అద్ది వాటికి సరికొత్త రూపునిస్తోంది మాత్రం శ్రీలంకకు చెందిన ఓ కళాకారుడు. మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన భారతీయ యువతిని చూసి స్ఫూర్తి పొంది ఇలా బొమ్మలకు చీర కట్టాలనే ఆలోచన వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. మరికొందరు ప్రముఖుల కాస్ట్యూమ్‌లను పోలిన బొమ్మలను కూడా ఆయన తయారు చేశారు. 

మిస్‌ యూనివర్స్‌ 2020 పోటీల్లో మూడో రన్నరప్‌గా నిలిచిన భారత్‌కు చెందిన అడ్లీన్‌ కాస్టెలినో(22)ను చూసి శ్రీలంకకు చెందిన కళాకారుడు నిగేశన్ మనసు పారేసుకున్నాడు. ఆ పోటీలో ‘నేషనల్‌ కాస్ట్యూమ్‌’ రౌండ్‌లో ఆమె ధరించిన సంప్రదాయ వస్త్రాలకు అతడు ముగ్ధుడయ్యాడు. ఆమె కట్టుకున్న పింక్‌ కలర్‌ చేనేత చీర, దానిపై భారత జాతీయ పుష్పమైన కమలం.. అతడిలో కొత్త ఆలోచనలకు బీజం వేశాయి. కొద్దిరోజుల తర్వాత ఆ చీరను పోలిన చీరకట్టుతో ఓ బొమ్మను తయారు చేశాడు. ఎలాగైనా అడ్లీన్‌ కాస్టెలినోకు ఆ బొమ్మను చూపాలనే ఉద్దేశంతో ఫొటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘‘శ్రీలంక నుంచి ప్రేమతో..’’ అనే సందేశాన్ని కూడా వాటికి జత చేశాడు. ‘‘చీరకట్టు.. దేశం మొత్తాన్ని ఐక్యంగా ఉంచే ఓ సంప్రదాయ అలంకరణ’’ అని అతడు పేర్కొన్నాడు. తాను ఆశించినట్లుగా ఆమె చూడటమే కాకుండా వాటిని తన సొంత ఖాతా నుంచి షేర్‌ చేసింది. వాటిని షేర్‌ చేసినందుకు నిగేశన్‌ ఆమెకు కృతజ్ఞతా సందేశాన్ని పోస్టు చేశాడు. నిగేశన్‌ ఆ ఒక్క బొమ్మతో ఆగిపోకుండా పలువురు సినీతారల కాస్ట్యూమ్‌లను పోలిన చాలా బొమ్మలను తయారుచేశాడు. వాటిని కూడా అతడి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశాడు. 


కర్ణాటకలోని ఉడుపికి చెందిన అడ్లీన్‌ కాస్టెలినో.. మిస్‌ యూనివర్స్‌ 2020 పోటీల్లో ముదురు గులాబీ రంగు చీరను ధరించి అందరినీ ఆకర్షించింది. చీరకట్టు తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, సాధికారతను ఇచ్చిందని తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అంతర్జాతీయ వేదికపై భారతీయ స్త్రీ గౌరవాన్ని చాటి చెప్పడం గర్వంగా ఉందని అందులో రాసింది. చీర ప్రాముఖ్యాన్ని తెలుపుతూ.. ‘చీర.. భారత స్త్రీ నిజమైన ఔన్నత్యాన్ని తెలుపుతుంది’ అని మరో ట్వీట్‌లో పేర్కొంది. అయితే ఆ చీరను డిజైన్‌ చేసింది హైదరాబాద్‌కు చెందిన శ్రావణ్‌కుమార్.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని