కృష్ణానదిపై ఆనకట్ట నిర్మాణ సర్వేకు ఉత్తర్వులు
close

తాజా వార్తలు

Published : 24/06/2021 20:46 IST

కృష్ణానదిపై ఆనకట్ట నిర్మాణ సర్వేకు ఉత్తర్వులు

హైదరాబాద్‌: కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట నిర్మాణానికి సర్వే కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఇటీవలి మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా ఆనకట్ట సర్వే కోసం ఉత్తర్వులు జారీ చేసింది. ఆనకట్టతో ఇతర ప్రాజెక్టుల సర్వే కోసం అనుమతులు ఇచ్చింది. శ్రీశైలం జలాశయం ఎగువన కృష్ణా నదిలో తుంగభద్ర కలిసే ముందు ఆనకట్ట నిర్మించతలపెట్టారు. నదిలో 35 నుంచి 40 టీఎంసీలు నిల్వ చేసేలా జోగులాంబ ఆనకట్ట నిర్మాణాన్ని ప్రతిపాదించారు. వరద సమయంలో రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించేలా నారాయణపేట జిల్లా కుసుమర్తి వద్ద బీమా వరద కాల్వ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.  

దీంతో జూరాల ఆయకట్టు పరిధిలోని గోపల్‌దిన్నె వరకు వివిధ జలాశయాలు, చెరువులకు నీటిని తరలించనున్నారు. అలంపూర్‌, గద్వాల ప్రాంతాల్లోని ఆర్డీఎస్‌, నెట్టెంపాడు ఆయకట్టు పరిధిలోని చివరి, మిగిలిన రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు సుంకేశుల జలాశయం వద్ద ఎత్తిపోతల నిర్మాణం చేపట్టనున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఉన్న జలాశయాల సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచనున్నారు. ఇప్పటికే ఉన్న జలాశయాల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కొత్త వాటిని చేపట్టనున్నారు. సాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టు సహా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు  సాగునీరు అందించేలా పులిచింతల వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. నాగార్జున సాగర్‌ కింద ఉన్న చివరి, ఎగువ ప్రాంతాల్లోని లక్ష ఎకరాల మేర అంతరం ఉన్న ఆయకట్టుకు నీరందించేలా సాగర్‌ టెయిల్‌పాండ్‌ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేయనున్నారు. కొత్త ఆనకట్ట నిర్మాణంతో పాటు ఆయా ప్రాజెక్టుల కోసం సమగ్ర సర్వే చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈమేరకు నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని