‘weekend lockdownపై నిర్ణయం తీసుకోండి’
close

తాజా వార్తలు

Updated : 05/05/2021 14:47 IST

‘weekend lockdownపై నిర్ణయం తీసుకోండి’

తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్‌: తెలంగాణలో రోజురోజుకీ పెరుగుతున్న కేసులు, మరణాలను దృష్టిలో ఉంచుకొని వారాంతపు లాక్‌డౌన్‌ లేదా కర్ఫ్యూ వేళల పొడిగింపును పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ నెల 8వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు ప్రజారోగ్య శాఖ సంచాలకులు  డా. శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. కరోనా పరీక్షలు తగ్గడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం రోజుకు లక్ష పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స, ఔషధాల గరిష్ఠ ధరలు ప్రభుత్వం నిర్ణయించాలని.. అక్కడ అందించే చికిత్సలపై తాజా మార్గదర్శకాలు విడుదల చేయాలని వెల్లడించింది.

ఖైదీలు, నిరాశ్రయులకు టీకాలు ఎలా వేస్తారు..

సంచార కేంద్రాల ద్వారా ఇప్పటివరకు ఎన్ని పరీక్షలు చేశారో వెంటనే చెప్పాలని ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసిన విధంగా వారంలోగా అన్ని జిల్లాల్లో టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఖైదీలు, నిరాశ్రయులకు టీకాలు ఎలా వేస్తారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పేరంబుదురు నుంచి ఆక్సిజన్‌ రాకుండా తమిళనాడు ప్రభుత్వం అడ్డుకుంటోందని విచారణ సందర్భంగా డీహెచ్‌ శ్రీనివాస్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తమిళనాడు నుంచి ఆగిన ఆక్సిజన్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేలా చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం కోరింది. చర్యలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి తెలపాలని కేంద్రానికి సూచించింది.

నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి

‘‘రెండు రోజుల్లో కరోనాపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి. నిపుణుల కమిటీ సమావేశాల వివరాలు సమర్పించాలి. శ్మశానవాటికలు, సదుపాయాల వివరాలు తెలపాలి. శుభకార్యాల్లో 200 మంది, అంత్యక్రియల్లో 50 మందికి మించొద్దు. వివాహాలు, అంత్యక్రియల్లో ఆంక్షలపై 24 గంటల్లో జీవో ఇవ్వాలి. ఆస్పత్రుల వద్ద పోలీసు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మాస్కులు ధరించనివారి వాహనాల జప్తు అంశాన్ని పరిశీలించాలి. పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే. ఔషధాల అక్రమ విక్రయాలపై మరింత కఠినంగా వ్యవహరించాలి. ఫంక్షన్‌ హాళ్లు, పార్కులు, మైదానాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలి. ఆర్టీపీసీఆర్‌ ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాకపోకలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

మరోవైపు కరోనా నిబంధనల అమలు పర్యవేక్షణకు 859 పెట్రోలింగ్‌, 1,523 ద్విచక్రవాహనాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. భౌతికదూరం పాటించని సంస్థలపై కేసులు పెడుతున్నామని.. భౌతికదూరం పాటించని వ్యక్తులపై కాదన్నారు. ఇప్పటివరకు ఔషధాల అక్రమ విక్రయాలకు సంబంధించి 39 కేసులు నమోదు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని