AP NEWS: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తీర్పు రిజర్వ్‌

తాజా వార్తలు

Updated : 05/08/2021 17:37 IST

AP NEWS: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తీర్పు రిజర్వ్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. పరిషత్‌ ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో అప్పీలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు అభ్యర్థులు తమను కూడా ఇంప్లీడ్‌ చేసుకోవాలని పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. జనసేన పార్టీ తరఫున న్యాయవాది వేణుగోపాలరావు, ఎస్‌ఈసీ తరఫున నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఈమేరకు తీర్పును రిజర్వ్‌ చేసింది. 
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఈ ఏడాది మేలో సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారు. పరిషత్‌ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు నాలుగు వారాల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని సింగిల్‌ జడ్జి అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు రూ.150కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచామని, వాటి భద్రతకు భారీగా ఖర్చవుతుందని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికలకు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు. జనసేన వేసిన పిటిషన్‌లో ఎన్నికలకు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్‌ ఇవ్వాలి అనే అంశం ప్రస్తావించలేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. గతంలో డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలతోనే ఎన్నికలు నిర్వహించామని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అనుమతించాలని ధర్మాసనాన్ని కోరారు. ఎన్నికలకు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్‌ ఇవ్వాలనే అంశంపై గతంలో తాము సింగిల్‌ జడ్జి ముందు వాదనలు వినిపించామని జనసేన పార్టీ తరఫు న్యాయవాది డివిజన్‌ బెంచ్‌కు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని