CBI and ED court summons: సీఎం జగన్‌కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు

తాజా వార్తలు

Updated : 18/08/2021 21:38 IST

 CBI and ED court summons: సీఎం జగన్‌కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు

హైదరాబాద్‌: వాన్ పిక్ ప్రాజెక్టు వ్యవహారంలో మనీలాండరింగ్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అభియోగపత్రాన్ని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈకేసులో ఏపీ సీఎం జగన్‌కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబరు 22న విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. జగన్‌తో పాటు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, ఐఆర్‌టీఎస్‌ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి, పారిశ్రామిక వేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్‌, నిమ్మగడ్డ ప్రకాశ్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు ఎం.శామ్యూల్‌, మన్మోహన్‌సింగ్‌, జగతి పబ్లికేషన్‌ సహా 12 కంపెనీలకు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.

వాన్‌పిక్‌ వ్యవహారంలో చేతులు మారిన సొమ్ముపై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం ఈడీ విచారణ సుదీర్ఘంగా జరిగింది. వివిధ కంపెనీల ద్వారా సొమ్ము చలామణి అయినట్టు ఈడీ గుర్తించింది. జగతి పబ్లికేషన్స్‌, భారతి సిమెంట్స్‌, కార్మెల్‌ ఏషియా, సిలికాన్‌ బిల్డర్స్‌, వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌, వాన్‌పిక్‌ పోర్ట్స్‌, గిల్‌ క్రిస్ట్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఆల్ఫా విల్లాస్, ఆల్ఫా అవెన్యూస్, బీటా అవెన్యూస్, జీ2 కార్పొరేట్ సర్వీసెస్, సుగుణి కన్ స్ట్రక్షన్స్ కంపెనీలను కూడా నిందితుల జాబితాలో ఈడీ చేర్చింది. ఆయా కంపెనీల ప్రతినిధులు కూడా హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసింది. జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ సంస్థలకు చెందిన సుమారు రూ.863 కోట్ల ఆస్తులను 2016లోనే ఈడీ తాత్కాలిక జప్తు చేసింది. జగన్ కంపెనీలకు చెందిన సుమారు రూ.538 కోట్ల విలువైన ఆస్తులతో పాటు.. వాన్ పిక్ భూములు సహా నిమ్మగడ్డ కంపెనీలకు చెందిన రూ.325 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

లేపాక్షి కేసులోనూ సీఎంకు సమన్లు..

లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన అభియోగపత్రాన్ని కూడా సీబీఐ, ఈడీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఏపీ సీఎం జగన్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, జె.గీతారెడ్డి, ఐఏఎస్ అధికారి డి.మురళీధర్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, శామ్యుల్, పారిశ్రామికవేత్త ఇందుకూరి శ్యాంప్రసాద్ రెడ్డి, లేపాక్షి ఎండీ ఎస్.బాలాజీ, వ్యాపారవేత్త బీపీ కుమార్ బాబుకు సమన్లు జారీ చేసిన న్యాయస్థానం.. సెప్టెంబరు 22న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 

సీబీఐ ఛార్జ్ షీట్ లో నిందితుడిగా ఉన్న అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి శాంబాబును ఈడీ నిందితుల జాబితాలో చేర్చలేదు. అనంతపురం జిల్లా చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో 8,844 ఎకరాల్లో లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఏర్పాటు పేరిట కుట్ర జరిగిందని ఈడీ పేర్కొంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సర్కారు కేటాయించిన భూములను ఇందుకూరి శ్యాంప్రసాద్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వినియోగించి అక్రమ లబ్ధి పొందినట్లు ఈడీ అభియోగం. రైతుల నుంచి సేకరించి ఏపీఐఐసీ అప్పగించిన భూముల్లో కొంత భాగం ఇందుకూరి శ్యాంప్రసాద్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకుల్లో తనఖా పెట్టినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో గుర్తించింది. బ్యాంకు రుణాలను లేపాక్షి ప్రాజెక్టు కోసం కాకుండా ఇతర వ్యాపార అవసరాల కోసం ఉపయోగించి లబ్ధి పొందినట్లు ఈడీ అభియోగం. ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లోకి శ్యాంప్రసాద్ రెడ్డి రూ.70 కోట్లు   మళ్లించినట్లు గతంలో సీబీఐ ఛార్జ్ షీట్ లో వెల్లడించింది. సీబీఐ ఛార్జ్ షీట్ ఆధారంగా విచారణ జరిపిన ఈడీ.. 2015లో లేపాక్షి భూములు సహా శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన రూ.129 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది. లేపాక్షి వ్యవహారంలో అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి, ఏపీఐఐసీ అప్పటి ఎండీ బీపీ ఆచార్య, ఈడీ మురళీధర్ రెడ్డి, అప్పటి రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి శామ్యూల్ మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని