Fake Challan Scam: ఏసీబీ దాడులు చేస్తే తప్ప నకిలీ చలానాల వ్యవహారం తెలియలేదా?: జగన్‌

తాజా వార్తలు

Updated : 19/08/2021 17:43 IST

Fake Challan Scam: ఏసీబీ దాడులు చేస్తే తప్ప నకిలీ చలానాల వ్యవహారం తెలియలేదా?: జగన్‌

అమరావతి: సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల కుంభకోణంపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తే తప్ప నకిలీ చలానాల వ్యవహారం తెలియలేదా? అసలు నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు. ఇంత పెద్ద స్థాయిలో తప్పులు జరిగినా ఎందుకు తెలియలేదని నిలదీశారు. ఈ అవినీతికి సంబంధింది అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను అడిగారు. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులను సస్పెండ్‌ చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. చలానాల అక్రమాలు ఎప్పటినుంచి జరుగుతున్నాయో పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ కుంభకోణానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్‌ సమాచారం తెప్పించుకోవాలన్నారు. కేవలం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే కాకుండా, అన్ని కార్యాలయాల్లో చలానాల చెల్లింపు ప్రక్రియను పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. సాఫ్ట్‌వేర్‌ మొత్తాన్ని నిశితంగా పరిశీలన చేశామని.. అవినీతికి చోటు లేకుండా పూర్తిస్థాయిలో మార్పులు చేశామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. మీ-సేవ కేంద్రాల్లోనూ పరిస్థితులపైన పరిశీలన చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్టానికి ఆదాయవనరులు అందించే శాఖలపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి జీఎస్టీ, ఎక్సైజ్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలని సీఎం ఆదేశించారు. అవినీతిని నిర్మూలించడానికి సరైన ఎస్‌ఓపీలను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అవినీతిపై ఎవరికి కాల్‌ చేయాలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఫోన్‌ నంబర్‌ అందుబాటులో ఉంచాలన్నారు. కాల్‌ సెంటర్స్‌ మీద అధికారులు ఓనర్‌షిప్‌ తీసుకోవాలని.. కాల్‌ సెంటర్‌కు వచ్చే కాల్స్‌ మీద అధికారులు దృష్టి పెట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం మరింత పెరగాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. కనీసం వారం, పది రోజులకు ఒకసారి అధికారులు సమావేశమై ఆదాయ వనరులు, పరిస్థితులపై సమీక్ష చేయాలని సూచించారు. రంగాల వారీగా సమీక్ష చేయాలని నిర్దేశించారు. ప్రతి సమావేశంలో ఒక రంగంపై సమీక్ష చేయాలని, సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును తదుపరి వారంలో పరిశీలన చేయాలని అధికారులకు సీఎం సూచించారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని