Coronavirus: కొంతమంది పాజిటివ్‌ వచ్చినా బయట తిరుగుతున్నారు: డీహెచ్ శ్రీనివాస్‌

తాజా వార్తలు

Updated : 31/07/2021 15:38 IST

Coronavirus: కొంతమంది పాజిటివ్‌ వచ్చినా బయట తిరుగుతున్నారు: డీహెచ్ శ్రీనివాస్‌

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాస్‌ తెలిపారు. కోఠిలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో డీహెచ్‌ మీడియాతో మాట్లాడారు. సేకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గలేదని.. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లా్ల్లో కేసులు అధికంగా ఉన్నాయన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామంలో ఒకేసారి భారీగా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వారు ఐసోలేషన్‌లో ఉండకుండా ఇష్టారీతిన బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9 జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో థర్డ్‌ వేవ్‌ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో వ్యాక్సిన్ వేసుకున్న వారినే హోటల్స్, మాల్స్‌లోకి అనుమతించే అవకాశం ఉంటుందన్నారు. డెల్టా రకం వేరియంట్‌ భారత్ సహా 135 దేశాల్లో తీవ్రత చూపించిందని డీహెచ్‌ అన్నారు. కొన్ని దేశాల్లో ఉద్ధృతంగా వ్యాపించిందన్నారు. ఈ వేరియంట్‌ శరీరంపై ఎక్కువ కాలం తీవ్ర ప్రభావాన్ని చూపడంతో పాటు ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యాన్ని గుర్తించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు డెల్టా ప్లస్‌ కేసులు నమోదయ్యాయన్నారు. మే నెల మధ్యలోనే ఈ కేసులను హైదరాబాద్‌లో గుర్తించినట్లు వివరించారు. డెల్టా ప్లస్ పాజిటివ్ వచ్చిన వారు కొలుకున్నారని.. వారి కాంటాక్ట్‌లను ట్రేస్‌ చేసి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చినట్లు చెప్పారు.

రెండో డోస్‌కి అధిక ప్రాధాన్యత

‘‘రాష్ట్రంలో 2.2 కోట్ల మంది ప్రజలు వ్యాక్సిన్‌కి అర్హులు. 1.12 కోట్ల మందికి ఇప్పటివరకు సింగల్ డోస్ ఇచ్చాం. రాష్ట్రంలో 33.79 లక్షల మందికి సెకండ్‌ డోస్ ఇవ్వడం పూర్తి అయింది. తొలి డోస్ తీసుకున్న వారిలో 30 శాతం మందికి రెండో డోస్ ఇచ్చాం. ఈ నెలలో ఇప్పటివరకు 30.04 లక్షల టీకా డోసులు రాష్ట్రానికి వచ్చాయి. కేటాయించిన దానికన్నా 9.5 లక్షల టీకా డోసులు అదనంగా రాష్ట్రానికి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 22.32 లక్షల మందికి కొవిషీల్డ్‌ రెండో డోస్ ఇవ్వాల్సి ఉండగా.. వారిలో 12 లక్షల మందికి ఇచ్చాం. కొవాగ్జిన్ సైతం 3లక్షల మందికి పైగా రెండో డోస్ ఇవ్వాల్సి ఉంది. వచ్చే ఒకటి రెండు వారాల్లో రెండో డోస్‌కి అధిక ప్రాధాన్యత ఇస్తాం’’ అని డీహెచ్‌ తెలిపారు.

రాష్ట్రంలో థర్డ్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డీహెచ్ స్పష్టం చేశారు. ఆక్సిజన్, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు. వారికి తగిన శిక్షణ అందించడంతో పాటు ప్రభుత్వం పరిధిలోని 26 వేల బెడ్స్‌కి ఆక్సిజన్ సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. పిల్లల కోసం జిల్లా ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. 100కు పైగా బెడ్స్ ఉన్న అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఆగస్టు నెలాఖరు నాటికి ఆక్సిజన్ ప్లాంట్స్ అందుబాటులోకి తెచ్చుకోవాలని ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని