వారి పెళ్లి ఖర్చు రూ.500..!

తాజా వార్తలు

Published : 15/07/2021 01:34 IST

వారి పెళ్లి ఖర్చు రూ.500..!

ధార్‌: సాధారణంగా పెళ్ళంటే గుర్తుకొచ్చేది బాజాభజంత్రీలు, బంధుమిత్రుల సందడి, నోరూరించే వంటకాలు, ఇంకా మరెన్నో.  జీవితంలో ఒకేసారి చేసుకునే ఈ అపురూప వేడుక కోసం ఈ రోజుల్లో రూ.కోట్లలో ఖర్చు చేసేవారూ ఉన్నారు. కానీ ఓ జంట కరోనా నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా పెళ్లి చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. అయితే వారి పెళ్లికి అయిన ఖర్చు రూ.500 మాత్రమే.

మధ్యప్రదేశ్‌లోని ధార్‌ కలెక్టర్‌ శివాంగి జోషి.. భారత సైన్యంలో మేజర్‌గా పనిచేస్తున్న అంకిత్‌ చతుర్వేది వివాహం చేసుకోవాలనుకున్నారు. వారిద్దరూ భోపాల్‌కు చెందినవారు. రెండేళ్ల క్రితమే వారి వివాహం నిశ్చయమైంది. కానీ కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి వైరస్‌ కట్టడికి సంబంధించిన విధుల్లో ఆమె నిమగ్నమయ్యారు. దీంతో వారి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది.  ఈ నేపథ్యంలో విలాసవంతమైన వివాహ వేడుకలకు డబ్బు ఖర్చు చేయొద్దంటూ సమాజానికి సందేశం పంపేందుకు వారు కోర్టులో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకోసం తమ తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకున్నారు. కోర్టులో రూ.500 చెల్లించి వివాహం చేసుకున్నారు. వారి పెళ్లి వేడుకకు పూల దండలు, మిఠాయిలు మాత్రమే ఏర్పాటు చేశారు. అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకకు వధూవరుల కుటుంబసభ్యులు, పరిమిత సంఖ్యలో సహోద్యోగులు హాజరయ్యారు.

‘‘పెళ్లి పేరుతో అనవసరంగా డబ్బు ఖర్చు చేయొద్దనే నేను ఇలా నిరాడంబరంగా వివాహం చేసుకున్నాను. పెళ్లి ఖర్చుతో వధువు కుటుంబంపై ఆర్థికంగా అదనపు భారం పడుతుంది.  వేడుకలను ఘనంగా నిర్వహించడం.. కష్టపడి సంపాదించిన సొమ్మును వృథా చేయడమే అవుతుంది’’ అని శివాంగి జోషి తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని