TS NEWS: తెలంగాణలో ప్రాజెక్టులకు జలకళ

తాజా వార్తలు

Published : 14/07/2021 19:35 IST

TS NEWS: తెలంగాణలో ప్రాజెక్టులకు జలకళ

హైదరాబాద్‌: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి ఎగువన భారీ వర్షాలు కురవడంతో కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదలడంతో పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం భారీగా పెరిగింది. ఈరోజు మధ్యాహ్నం కడెం ప్రాజెక్టు నుంచి ఏడు గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరింది. ఈ క్రమంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 53, 54 గేట్లను 0.5 మీటర్లు ఎత్తి 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 19.36 టీఎంసీలుగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు దిగువ గోదావరి పరివాహక ప్రాంతాల రైతులు, ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నదీ తీరం వద్దకు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గంటకోసారి సైరన్‌ మోగిస్తూ మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నారు.

కడెం ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో సోమవారం వరద ఇన్ ఫ్లో 7,011 క్యూసెక్కులగా ఉంది. సాయంత్రం అది 15,444 క్యూసెక్కులకు పెరిగింది. ఎల్లంపల్లి దిగువన కాళేశ్వరం ప్రాజెక్టు పార్వతి పంప్ హౌస్ నుంచి గత నెల 18 నుంచి ఈనెల 9 వరకు 30 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి జలాశయంలోకి రివర్స్ పంపింగ్ ద్వారా ఎత్తి పోశారు. గత నెల 16 నుంచి ఈనెల 7 వరకు ఎల్లంపల్లి జలాశయం నుంచి నంది, గాయత్రి పంపుహౌజ్‌ల ద్వారా మధ్య మానేరుకు 24 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతుండటంతో ఎత్తిపోతలు నిలిపివేశారు.

మూసీ నుంచి దిగువకు నీరు విడుదల

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు నల్గొండ జిల్లా కేతపల్లి వద్ద నదిపై నిర్మించిన మూసీ ప్రాజెక్టుకు ఆరు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 7గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. క్రస్ట్‌ గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న గ్రామాల ప్రజలు, రైతులు, మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు. ఈరోజు రాత్రికి ఇన్‌ఫ్లో పెరిగే అవకాశముందని ప్రాజెక్టు డీఈ చంద్రశేఖర్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని