Singareni: పదవీ విరమణ వయసు పెంపు

తాజా వార్తలు

Updated : 20/07/2021 22:07 IST

Singareni: పదవీ విరమణ వయసు పెంపు

హైదరాబాద్‌: సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలు, ఇతరత్రా అంశాలు, వాటి పరిష్కారాలపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సింగరేణి ప్రాంతానికి చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. కార్మిక సంఘాలు, ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు పదవీ విరమణ వయసు 61ఏళ్లకు పెంచాలని సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో సంస్థలో మొత్తంగా 43,899 మంది ఉద్యోగులు, అధికారులు, కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఈ నెల 26న జరగనున్న బోర్డు సమావేశంలో దీనిపై సమీక్షించి పెంపు అమలు తేదీని ప్రకటించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. రామగుండం నియోజకవర్గ కేంద్రంలో సింగరేణి వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి.

బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో సింగరేణి దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతోందని సీఎం అన్నారు. సింగరేణి సిబ్బందికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ, ఎన్టీఆర్‌ ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని.. వాటి స్థానంలో కొత్తవి నిర్మించి ఇవ్వాలని ప్రజాప్రతినిధులు కోరారు. సొంత స్థలాలున్న పేదలకు ఇంటి నిర్మాణానికి నగదు సాయం చేయాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. సొంత స్థలాలున్న వారికి నగదు సాయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన దళిత బంధు అర్హులకు చేరేలా కృషి చేయాలని కోల్‌ బెల్ట్‌ ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. సింగరేణి పరిధిలో బాధితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ని కోరారు. ఇళ్ల స్థలాల పంపిణీ ఆలస్యం చేయొద్దని సీఎం అధికారులను ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని