AP News: గంజాయి రవాణా వ్యాఖ్యలపై నక్కా ఆనంద్‌బాబు స్టేట్‌మెంట్‌ రికార్డు

తాజా వార్తలు

Updated : 19/10/2021 23:50 IST

AP News: గంజాయి రవాణా వ్యాఖ్యలపై నక్కా ఆనంద్‌బాబు స్టేట్‌మెంట్‌ రికార్డు

గుంటూరు: విశాఖలో గంజాయి అక్రమ రవాణాపై వ్యాఖ్యలకు సంబంధించి మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. విశాఖ మన్యం నుంచి గంజాయి, మత్తు పదార్థాల రవాణాపై ఆనంద్‌బాబు సోమవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్‌బాబు వైకాపా ప్రభుత్వంతో పాటు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేశారు. దీంతో వసంతరాయపురంలోని ఆనంద్‌బాబు ఇంటికి వచ్చిన నర్సీపట్నం పోలీసులు.. గంజాయి రవాణాకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. మీడియాలో ఏ ఆధారాలతో మాట్లాడారో చెబితే స్టేట్‌మెంట్‌ రికార్టు చేసుకుంటామని తెలిపారు.  అర్ధరాత్రి సమయంలో పోలీసులు రావడంపై ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నోటీసు తీసుకునేందుకు ఆనంద్‌బాబు నిరాకరించడంతో మంగళవారం ఉదయం మళ్లీ వస్తామని చెప్పి వెళ్లారు. ఇవాళ ఉదయం వచ్చిన నర్సీపట్నం పోలీసులు మీడియా సమావేశంలో చెప్పిన విషయాలపై ఆరా తీశారు. నక్కా ఆనంద్‌బాబు ఇంటికి పోలీసులు వచ్చారన్న విషయం తెలుసుకున్న తెదేపా శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ వ్యవహారంపై నర్సీపట్నం సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ..‘‘స్మగ్లింగ్‌ వెనుక కొంత మంది నాయకులు ఉన్నారని ఆనంద్‌బాబు మీడియా ముందు చెప్పారు. అందుకే ఆధారాలు ఇవ్వాలని అడిగాం. ఆనంద్‌బాబు స్టేట్‌మెంట్‌ రికార్డు చేశాం. ఆధారాలు ఏమీ లేవని ఆయన చెప్పారు. స్టేట్‌మెంట్‌లో పూర్తి వివరాలు వెల్లడించలేదు. 91 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇస్తామంటే తీసుకోలేదు. నోటీసులు తీసుకోకపోతే ఇంటికి అంటిస్తాం. సమగ్రమైన సమాచారం రాకపోవడంతోనే నోటీసులు జారీ చేశాం’’ అని సీఐ తెలిపారు.

ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు: నక్కా ఆనంద్‌బాబు

గంజాయి అక్రమ రవాణా గురించి ఎలా తెలుసునని పోలీసులు అడిగారని.. పత్రికలు, మీడియాలో చూసి మాట్లాడినట్లు నక్కా ఆనంద్‌బాబు పోలీసులకు తెలిపారు. వారిచ్చిన స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేసుకున్నట్ల చెప్పారు. సామాన్యులకు మాట్లాడే స్వేచ్ఛ కూడా రాష్ట్రంలో లేదా అని ఈ సందర్భంగా నక్కా ఆనంద్‌బాబు ప్రశ్నించారు. మంత్రిగా పని చేసిన తనను అర్ధరాత్రి వచ్చి ఇబ్బంది పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను వైకాపా నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. మద్య నిషేదం అని ప్రకటించి.. వాళ్లే అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. నేటి యువతను మద్యం, గంజాయికి అలవాటు చేస్తున్నారన్నారు. పల్నాడు ప్రాంతంలో నాటుసారా ఏరులై పారుతోందన్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తే తనకు నోటీసులిచ్చారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఆధారాలు సేకరించాల్సిన బాధ్యత పోలీసులదన్నారు. 
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని