Ts News: అటవీ నేరాల అదుపునకు ‘సీక్రెట్‌ సర్వీస్‌ నిధి’: ఇంద్రకరణ్‌ రెడ్డి

తాజా వార్తలు

Updated : 05/10/2021 05:04 IST

Ts News: అటవీ నేరాల అదుపునకు ‘సీక్రెట్‌ సర్వీస్‌ నిధి’: ఇంద్రకరణ్‌ రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో మరింత సమర్థంగా అటవీ సంబంధిత నేరాలను అదుపు చేసేందుకు రహస్య సమాచార నిధి (సీక్రెట్ సర్వీస్ నిధి) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో అటవీ శాఖ కార్యకలాపాలపై జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సుకు మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అన్ని అటవీ సర్కిళ్ల చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లాల అటవీ శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పచ్చదనం పెంపు, గ్రీన్ ఫండ్, అటవీ పునరుర్ధరణ, రక్షణ, ఆక్రమణల నివారణ, వన్య ప్రాణుల వేట, స్మగ్లింగ్ అరికట్టడం, అర్బన్ ఫారెస్ట్ పార్కుల వంద శాతం అభివృద్ధిపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అధికారులంతా ఐదు గ్రూపులుగా ఏర్పడి సమస్యలు, పరిష్కార మార్గాలపై దాదాపు 10 గంటలపాటు చర్చించారు.

‘‘సీక్రెట్ సర్వీస్ నిధి ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 4.06 కోట్లు కేటాయించారు. అడవుల రక్షణ కోసం ఆక్రమణల నివారణ, వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్ అరికట్టడంపై సమాచారం ఇచ్చే వ్యక్తులను ప్రోత్సహించేందుకు అటవీ శాఖ ఈ నిధిని వాడనుంది. ఈ నిధి నుంచి రహస్య సమాచారం విలువ ఆధారంగా ప్రోత్సాహకాలు అందించేలా నిబంధనలు రూపొందించాం. పచ్చదనం పెంపు, పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా అట‌వీ అధికారులు, సిబ్బంది బాధ్యత మ‌రింత పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలకు అనుగుణంగా అటవీ శాఖ అధికారులు ప‌ని చేస్తూ అడ‌వుల‌ను రక్షించే బాధ్యత చిత్తశుద్ధితో నిర్వహించాలి. ములుగు జిల్లాలో పులిని వేటాడిన ఘటన బాధాకరం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. అటవీ శాఖ బలోపేతానికి సీఎం సుముఖంగా ఉన్నారు. అవసరమైతే సిబ్బంది నియామకానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అటవీ శాఖకు సీఎం కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తోంది. సంబంధిత శాఖలు, స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకొని ఫలితాలు సాధించాలి. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా దేశానికే ఆదర్శవంతంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో పనులు జరగాలి ’’అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని