పండుగ వస్తోంది.. ఊరెళ్లేదెలా?

తాజా వార్తలు

Published : 08/10/2020 01:46 IST

పండుగ వస్తోంది.. ఊరెళ్లేదెలా?

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు లేక ఇబ్బందులు

హైదరాబాద్‌: పండుగ వస్తోందంటే నగరవాసులు తమ పిల్లలతో కలిసి సొంతూరికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కకపోవడంతో రైళ్లలో సీట్లన్నీ నిండిపోయాయి. ప్రైవేటు ట్రావెల్స్‌ ఉన్నప్పటికీ వాటి ఛార్జీలు ప్రయాణికుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులపై పలు దఫాలుగా ఏపీ, తెలంగాణ అధికారులు చర్చలు జరిపినా సమస్య కొలిక్కిరావడం లేదు. ఇరు రాష్ట్రాల ఎండీ స్థాయి సమావేశం జరిగినా చర్చలు ఫలప్రదం కాలేదు. ఈరోజు ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ఈడీలు సమావేశమై చర్చించినా ఎలాంటి పురోగతీ లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వ బస్సులు ఎప్పుడు ప్రారంభమవుతాయో, తమ కష్టాలు ఎప్పుడు తీరతాయోనని ప్రయాణికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 
అందుబాటులో కొన్ని రైళ్లు మాత్రమే!
పండుగలు వస్తున్నాయంటే తెలుగు రాష్ట్రాల్లో మూడు నెలల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. తమ సొంతూళ్లలో పండుగలు చేసుకునేందుకు నగరవాసులు బయలుదేరుతారు. ముఖ్యంగా పండుగల ముందు కోస్తాంధ్ర, రాయలసీమ మధ్య పెద్దఎత్తున రాకపోకలు సాగుతాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. కరోనా కారణంగా ఈసారి రైళ్లు నడుస్తాయో లేదోనని ముందస్తు రిజర్వేషన్‌ ప్రారంభించలేదు. ఇటీవలే హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, తదితర ప్రాంతాలకు అతికొద్ది రైళ్లు ఏర్పాటు చేశారు. ఆ రైళ్లలో రిజర్వేషన్‌ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే బెర్తులన్నీ నిండిపోయాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి ఏపీకి రోజూ పదుల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుండేవి. ప్రస్తుతం కేవలం మూడు లేదా నాలుగు రైళ్లు మాత్రమే నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్దఎత్తున రైళ్లు ఏర్పాటు చేసే అవకాశం లేదని భావించిన ప్రయాణికులు రైలు ప్రయాణంపై ఆశలు వదులుకున్నారు.

రెండు రాష్ట్రాల ఆర్టీసీలకు నష్టమే
పండుగ రోజుల్లో ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. కానీ ప్రస్తుతం పండుగకు టికెట్లు బుక్‌ చేసుకుందామని రిజర్వేషన్‌ కేంద్రాలకు వెళ్తే బస్సు సర్వీసులు లేవనే సమాధానం వస్తోంది. దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ ప్రారంభమై నెలలు గడుస్తున్నా తెలుగు రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలు ఇంకా ప్రారంభం కాలేదు. పలుమార్లు ఇరు రాష్ట్రాల ఎండీలు చర్చించినా ఫలితం లేకపోయింది. దీంతో ఇరురాష్ట్రాల మధ్య బస్సులు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని పరిస్థితి ఉందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా దూర ప్రాంతాలకు నడిచే అంతర్రాష్ట్ర సర్వీసుల వల్లే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీగా ఆదాయం సమకూరుతోంది. బస్సులు తిప్పకపోవడంతో ఏపీఎస్‌ఆర్టీసీ రోజుకు రూ.3కోట్ల మేర నష్టపోతుండగా, తెలంగాణ ఆర్టీసీ రూ.2కోట్ల వరకు నష్టపోతోంది. 
కార్మిక నేతల ఆందోళన
పండుగ వేళ బస్సులు తిప్పకపోతే రెండు ఆర్టీసీలు ఆదాయం కోల్పోవడంతో పాటు ప్రయాణికుల ఆదరణ కోల్పోయే ప్రమాదముందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే ఆర్టీసీలకు మరింత నష్టం వస్తుందని కార్మిక నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తక్షణమే బస్సులు తిప్పేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సర్కారు బస్సులు ఎప్పుడు తిరుగుతాయో చెప్పలేని పరిస్థితుల్లో డిమాండ్‌ను ఆసరాగా తీసుకున్న కొందరు ప్రైవేటు ట్రావెల్స్‌ యజమానులు రేట్లు పెంచి దోచుకుంటున్నారు. దీంతో సామాన్య ప్రజలు పండుగ వేళ తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి వీలైనంత ఎక్కువ సంఖ్యలో రైళ్లు, బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని