Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 27/07/2021 16:56 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Agri gold: రూ.20వేల లోపు డిపాజిట్లు చెల్లించండి: సీఎం జగన్‌

జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాలను కలెక్టర్లు, జేసీలు బాగానే తనిఖీలు చేశారని, ఇతర అధికారులు కూడా తరచూ తనిఖీ చేయాలని సూచించారు. సరిగా తనిఖీలు చేయనివారికి మెమోలు జారీ చేయాలని సీఎం ఆదేశించారు. తనిఖీ చేయకపోతే క్షేత్రస్థాయి సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. రూ.20వేల లోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆగస్టు 24న చెల్లింపులు చేయాలని ఆదేశించారు.

2. రేపే పాలిసెట్‌ ఫలితాలు.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి ప్రకటించింది. ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మండలి విడుదల చేసింది.

3. బెయిల్‌ బ్యాచ్‌ నీతులు వల్లిస్తోంది: రఘురామ

బెయిల్‌ బ్యాచ్‌ అంతా కలిసి నీతులు వల్లిస్తున్నట్లు ఉందని నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు. గృహహింస చట్టం కింద నిందితుడిగా తేలిన ఏపీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ మరో ఇద్దరు నిందితులతో కలిసి తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ బాగోతంపై సరైన సమయంలో సమగ్ర వివరాలతో 420 చట్టం కింద ఫిర్యాదు చేస్తానన్నారు.

4. Dholavira: ధోలవిరాకు యునెస్కో గుర్తింపు

భారత్‌కు చెందిన మరో ప్రాచీన పట్టణానికి అరుదైన గుర్తింపు లభించింది. గుజరాత్‌లోని ధోలవిరాను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించింది. ఈ మేరకు ప్రపంచ వారసత్వ జాబితాలో ధోలవిరాను చేర్చినట్లు యునెస్కో ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ఇటీవలే తెలంగాణలోని ప్రసిద్ధ రామప్ప ఆలయానికి యునెస్కో వారసత్వ గుర్తింపు లభించిన విషయం తెలిసిందే.

5. Parliament: చర్చించరు..నడవనివ్వరు

పార్లమెంట్‌ కార్యకలాపాలు సజావుగా సాగకుండా అడ్డుకుంటుందంటూ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో భాగంగా కాంగ్రెస్ వైఖరిని ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో చర్చకు ఆసక్తి చూపకపోగా..కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించడం లేదని మోదీ విమర్శించారు.

6. వచ్చే నెలలోనే చిన్నారులకు టీకా?

దేశవ్యాప్తంగా 18ఏళ్ల వయసుపైబడిన వారికి కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో చిన్నారుల కోసం టీకాను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వచ్చే నెలలోనే చిన్నారుల టీకా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

యాంటీబాడీలు తగ్గుతున్నా.. వైరస్‌ నుంచి రక్షణే!

7. China: అసలు చైనా లక్ష్యమేంటి?

గత వారాంతంలో ఆన్‌లైన్‌ విద్యకు సంబంధించిన ఎడ్యుటెక్ సంస్థలపై చైనా ఆంక్షలు ప్రకటించింది. వీటిని లాభాపేక్ష లేని సంస్థలుగా మారుస్తున్నట్లు ప్రకటించింది. పబ్లిక్ ఇష్యూకు వెళ్లొద్దని ఆదేశించింది. విదేశీ సంస్థల నుంచి నిధులు స్వీకరించొద్దని స్పష్టం చేసింది. దీంతో ఎడ్యుటెక్‌ రంగంలో ఉన్న అనేక కంపెనీల షేర్లు సగటున 70 శాతానికి పైగా కుంగాయి.

8. Stock market: ఆరంభ లాభాలు ఆవిరి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని అమ్మకాల ఒత్తిడి దేశీయ సూచీలపై పడింది. దీంతో మెజారిటీ రంగాల షేర్లు నష్టాలు చవిచూశాయి. చివరకు సెన్సెన్స్‌ 273 పాయింట్ల నష్టంతో 52,578 వద్ద స్థిరపడింది. 

9. Chitra: ఒక్క రోజులో 16 పాటలు పాడా.. అది తెలిసి అమ్మ కోప్పడింది

‘ఓ రోజు 16 పాటలు ఆలపించి అలసిపోయి ఇంటికి వచ్చాను. అప్పుడు నన్ను చూసిన అమ్మ ఆరోగ్యం చూసుకోవాలి... ఇలా చేయకూడదు ఎప్పుడూ అంటూ నాపై కోప్పడింది’ అని ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు ప్రముఖ గాయని చిత్ర. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి, తన మనసులో మాటని పంచుకున్నారామె.

Pawan-rana Movie: అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన చిత్ర బృందం

10. షాక్‌..! కృనాల్‌ పాండ్యకు కరోనా? నేటి టీ20 వాయిదా

శ్రీలంక, భారత్‌ రెండో టీ20 వాయిదా వేస్తున్నట్టు తెలిసింది. భారత ఆటగాళ్లలో ఒకరికి కరోనా వైరస్‌ సోకడమే కారణం. యువ క్రికెటర్‌ కృనాల్‌ పాండ్యకు పాజిటివ్‌ వచ్చినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

టోక్యోలో ఒక్కరోజే పెరిగిన కరోనా కేసులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని