Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 01/08/2021 16:56 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో తెలంగాణ మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జిల్లాల్లో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది.  కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల సమాచారాన్ని అధికారులు కేబినెట్‌ ముందుంచారు. వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలని, ఔషధాలు, ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని అధికారులను కేబినెట్‌ ఆదేశించింది. జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించింది.

2. యువత కష్టపడి పనిచేసే తత్వం అలవర్చుకోవాలి: ఉపరాష్ట్రపతి

భారతీయ యువతలో సహజంగానే అపారమైన ప్రతిభాపాటవాలు ఉన్నాయని.. నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆ సామర్థ్యానికి పదునుపెట్టి సద్వినియోగ పర్చుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని జీఎంఆర్-వరలక్ష్మీ ఫౌండేషన్, జీఎంఆర్-చిన్మయ విద్యాలయాలను ఉపరాష్ట్రపతి సందర్శించారు.

3. అలాంటి వారికి సమాజంలో చోటు లేదు: చంద్రబాబు

సాక్షులను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న జంట హత్యల నిందితులపై చర్యలు తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు ఆయన లేఖ రాశారు. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో జూన్ 17న వడ్డు నాగేశ్వర్ రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డిలను వైకాపా గూండాలు దారుణంగా హత్య చేశారని ఆరోపించారు.

4. నియంత పాలన నుంచి విముక్తి చేయాలని..: విజయశాంతి

కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజల్ని కాపాడాలని సింహవాహినీ మహంకాళి అమ్మవారిని కోరుకున్నట్లు భాజపా నేత విజయశాంతి తెలిపారు. లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా పాతబస్తీలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో భాజపాను అధికారంలోకి తీసుకొస్తే బంగారు బోనం సమర్పిస్తానని మొక్కుకున్నట్లు విజయశాంతి చెప్పారు. 

భాగ్యనగరంలో బోనాల సందడి చిత్రాలు

5. సీజ్‌ చేసిన వాహనాలు వైకాపా నేతల ఇళ్ల వద్ద..: అఖిలప్రియ

జిల్లాలోని ఆళ్లగడ్డలో ఎర్రమట్టి తవ్వకాలపై ఎలాంటి స్పందన లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. కర్నూలులో అఖిలప్రియ మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని నర్సాపురం, కృష్ణాపురంలో వైకాపా నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సీజ్‌ చేసిన వాహనాలు వైకాపా నేతల ఇళ్ల వద్ద ఉంటున్నాయని పేర్కొన్నారు.

6. శ్రీశైలం, సాగర్‌ జలాశయాలకు వరద.. 

శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 5,04,086 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్‌ఫ్లో 5,30,175 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.50 అడుగులకు నీరు చేరింది. శ్రీశైలం జలాశంయ పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా.. జలాశయంలో 207.41 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

7. కేరళ నుంచి వస్తే కరోనా నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి..!
రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌ కట్టడి చర్యలను తమిళనాడు ప్రభుత్వం ముమ్మరం చేసింది. అందులో భాగంగా.. కేరళ నుంచి రాష్ట్రానికి వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగెటివ్‌ ధ్రువపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలుపుతూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. 

8. బంగారం, డిపాజిట్ల కంటే..స్థిరాస్తుల కొనుగోలుకే మొగ్గు!

ఇల్లు/ఫ్లాట్‌ కొనుగోలు చేయాలనుకునే వారు.. బిల్డర్ల నుంచి రాయితీలు, కొన్ని ఉచితాలు, చెల్లింపుల్లో వెసులుబాట్లలాంటివి కోరుకుంటున్నారని హౌసింగ్‌.కామ్, నరెడ్కో విడుదల చేసిన ఒక సర్వేలో వెల్లడయ్యింది. స్థిరాస్తులు ఒక నమ్మకమైన పెట్టుబడి మార్గంగా భావిస్తున్నవారే అధికంగా ఉంటున్నారని తేలింది.

9. GST Collection: మళ్లీ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

జులై నెల జీఎస్‌టీ వసూళ్లు మరోసారి రూ.లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాయి. 2021 జులైలో ఇవి రూ.1,16,393 కోట్లుగా నమోదయ్యాయి. 2020 జులై నాటితో పోలిస్తే ఇవి 33 శాతం అధికం. వరుసగా ఎనిమిది నెలల పాటు రూ.లక్ష కోట్లకు పైగా నమోదైన జీఎస్టీ వసూళ్లు.. 2021 జూన్‌లో రూ.92,849 కోట్లకు తగ్గిపోయిన విషయం తెలిసిందే.

10. Tokyo Olympics: సింధూ కాంస్యమైనా గెలిచేనా?

ఈసారి ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తుందని ఆశించిన తెలుగు తేజం పీవీ సింధు శనివారం సెమీఫైనల్స్‌లో నిరాశపర్చిన సంగతి తెలిసిందే. ఆమె చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్‌ చేతిలో 18-21, 12-21 తేడాతో ఓటమిపాలైంది. దాంతో ఈసారి ఒలింపిక్స్‌లో అత్యున్నత పతకం సాధించాలని ఆశించిన కల అలాగే మిగిలిపోయింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని