Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 28/09/2021 16:59 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

1. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించండి: హైకోర్టు

తెలంగాణలో గతేడాది సెప్టెంబర్‌- అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ రైతులకు మూడు నెలల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించాలని స్పష్టం చేసింది. రైతులు నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలంటూ రైతు స్వరాజ్య వేదిక దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

2. కేసీఆర్‌ సారూ.. వీటికి జవాబు చెప్పండి: బండి సంజయ్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివసిస్తున్న ప్రగతి భవన్‌ అవినీతి భవన్‌గా మారిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా సీఎం కేసీఆర్‌కు పేరుందని.. ఇది నిజమో.. కాదో.. నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

3. పవన్‌ను సినీ పెద్దలే గుదిబండగా భావిస్తున్నారు: సజ్జల

 ఏపీలో సినీ పరిశ్రమకు వైకాపా ప్రభుత్వం మంచి చేయాలని చూస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాము చేస్తున్న మంచి పనులను అందరూ స్వాగతిస్తున్నారని చెప్పారు. సినీ పరిశ్రమకు సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

4. హృదయాన్ని హత్తుకున్న ‘ఆనందం’కి 20ఏళ్లు

తెలుగులో వచ్చిన ప్రేమకథా చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ ‘ఆనందం’. టీవీల్లో ఇప్పుడు ప్రసారమైనా సరే ప్రేక్షకులను కదలనివ్వకుండా కట్టిపడేసేంత ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీగా దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కించారు. ఇదే ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. హీరో ఆకాశ్‌ను ఓవర్‌నైట్‌ స్టార్‌ని చేసింది. సంగీత దర్శకుడిగా అప్పుడే ఇండస్ట్రీకి పరిచయమైన దేవీశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి అందించిన మ్యూజిక్‌ ఆయన్ను మరో ఎక్కించింది. 

5. పీసీసీ చీఫ్‌గా సిద్ధూ రాజీనామా

పంజాబ్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్‌ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. రాజీపడితే వ్యక్తిత్వం కోల్పోయినట్లేనని పేర్కొన్నారు. పంజాబ్‌ భవిష్యత్తు, సంక్షేమం అజెండాలో మాత్రం  రాజీపడే ప్రసక్తేలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో కార్యకర్తగా కొనసాగుతానని స్పష్టంచేశారు.

6. భాజపాలోకి అమరీందర్‌ సింగ్‌?

పంజాబ్‌ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయన భాజపాలో చేరనున్నట్లు తాజాగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేడు దిల్లీ వెళ్లి.. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ కానున్నట్లు సమాచారం.

7. పేలేందుకు సిద్ధంగా అమెరికా టైంబాంబ్‌..!

అఫ్గాన్‌ బ్యాంకింగ్‌ రంగం కుప్పకూలేందుకు సిద్ధంగా ఉంది. అమెరికాలోని అఫ్గాన్‌ రిజర్వుల నిలిపివేత ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ విషయాన్ని సాక్షాత్తూ ‘ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌’ చీఫ్‌ సయ్యద్‌ మూసా అల్‌ ఖలీమ్‌ అల్‌ ఫలాహి తెలిపారు. దేశంలో ఫైనాన్షియల్‌ సెక్టార్‌ మనుగడ కోసం పోరాటం చేస్తోందన్నారు. కాబుల్‌లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల రీత్యా దుబాయ్‌లో ఉన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 

8. జో ఫోన్‌ చేస్తారని ముందుగా ఊహించి చెప్పలేం..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు భవిష్యత్తులో ఫోన్‌ చేస్తారా..? అనే విషయాన్ని చెప్పలేమని శ్వేత సౌధ సిబ్బంది పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య అత్యంత ప్రాధాన్యమున్న అంశం ఉంటేగానీ జోబైడెన్‌ నుంచి కాల్‌ వెళ్లదని వివరించారు. ఇటీవల అమెరికన్‌ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో జో ఫోన్‌ చేయని విషయాన్ని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రస్తావించారు. 

9. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఇంట్రాడేలో భారీ పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్‌ ఓ దశలో 1000 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ సైతం 1.66 శాతం కుంగింది. అయితే, కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు తిరిగి కోలుకున్నాయి. కానీ, పూర్తి స్థాయి లాభాల్లోకి మాత్రం రాలేకపోయాయి. 

10. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీలక నిర్ణయం.. వార్నర్‌కు ఉద్వాసన?

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా సీజన్‌లో ఆ జట్టు మాజీ సారథి డేవిడ్‌ వార్నర్‌ను ఆడించే అవకాశం లేదని సమాచారం. అతడికి బదులు యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లు సన్‌రైజర్స్‌ కోచ్‌ ట్రెవర్‌ బైలిస్‌ తాజాగా వెల్లడించాడు. ఓపెనర్‌గా ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌.. 107.73 స్ట్రైక్‌రేట్‌తో 195 పరుగులే చేశాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని