Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 19/10/2021 16:55 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. టీఎస్‌ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం

టీఎస్ఆర్టీసీకీ రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఈనెల 18వ తేదీన ఒక్కరోజే రూ.14.79 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ ఒక్కరోజులో 36.30 లక్షల కిలోమీటర్ల దూరం ఆర్టీసీ బస్సులు ప్రయాణించాయన్నారు. బతుకమ్మ, దసరా సందర్భంగా టీఎస్ఆర్టీసీ నడిపించిన ప్రత్యేక బస్సులను తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వినియోగించుకున్నందుకు సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు.

2. యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రి చేరుకున్నారు. తొలుత నారసింహ ఆలయ పరిసరాలను ఏరియల్‌ వ్యూ ద్వారా ఆయన పరిశీలించారు. అనంతరం కాన్వాయ్‌లో ఘాట్‌రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్న సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. తర్వాత కేసీఆర్ బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. ఆలయ నిర్మాణ పనులను కేసీఆర్‌ పరిశీలించారు. 

3. దళితబంధును అడ్డుకుంటున్నట్లు నిరూపించగలరా?: ఈటల సవాల్‌

దళితబంధు పథకం అమలును అడ్డుకుంటున్నానంటూ తనపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని హుజూరాబాద్‌ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. తాను దళితబంధును అడ్డుకుంటున్నట్లు నిరూపించగలరా? అని సవాల్‌ చేశారు. పథకాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేసే సత్తా లేకనే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊరూరూ తిరుగుతున్న ఈటల.. తెరాసపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

4. వైఎస్‌ఆర్ సంక్షేమ పాలనే లక్ష్యంగా పాదయాత్ర: షర్మిల

తెలంగాణ రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ సంక్షేమ పాలన లేదని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద నివాళి అర్పించిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో వైఎస్‌ఆర్‌ సంక్షేమ పాలన తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టనున్నట్టు చెప్పారు. రేపు చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్రను షర్మిల ప్రారంభించనున్న విషయం తెలిసిందే.

5. ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ.. ఎందుకంటే?

ప్రధాని నరేంద్ర మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. బీసీ జనగణన చేపట్టాలని ప్రధానిని కోరారు. సరైన సమాచారం అందుబాటులో లేకపోవడంతో బీసీలకు అన్యాయం జరుగుతోందని.. సంక్షేమ పథకాలు అమలు చేసినా ఆయా వర్గాలు ఇంకా వెనకబడే ఉంటున్నాయన్నారు. బీసీ జనగణన జరిగితేనే సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. బీసీ జనగణనపై తెదేపా ప్రభుత్వ హయాంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చంద్రబాబు గుర్తు చేశారు.

6. భారత సైనికులు మరణిస్తుంటే.. పాకిస్థాన్‌తో టీ20 ఆడతారా?

సరిహద్దుల్లో పాకిస్థాన్‌ చర్యల వల్ల భారత సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే ఆ దేశంతో టీ20 ఆడతారా? అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రధాని మోదీని ప్రశ్నించారు. అంతేకాకుండా దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, సరిహద్దుల్లో చైనా ఆక్రమణలపై ప్రధాని ఎందుకు మాట్లాడం లేదన్నారు. చైనా గురించి మాట్లాడాలంటే మోదీకి భయమని ఒవైసీ విమర్శించారు.

7. యూపీ ఎన్నికలు.. 40 శాతం టికెట్లు మహిళలకే : ప్రియాంక

కొద్ది నెలల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ తరఫు నుంచి 40 శాతం టికెట్లను మహిళలకు రిజర్వ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. మహిళలు మార్పు తీసుకురాగలరని, వారు మరో అడుగు ముందుకు వేయాల్సి ఉందని ఈ సందర్భంగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా వాద్రా అన్నారు. 

8. బ్రిటన్‌కు మళ్లీ ఏమైంది..?

బ్రిటన్‌ను కరోనా పీడ వదలడం లేదు. కేసులు తగ్గడం, మెజార్టీ ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడంతో జులైలో అక్కడి ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను పక్కనపెట్టింది.  రెండు వారాలుగా 35 నుంచి 40 వేల మధ్య నమోదైన రోజువారీ కేసులు.. సోమవారం 50 వేలకు చేరువయ్యాయి. అంటే జులై నాటి గరిష్ఠానికి చేరాయన్నమాట. మృతుల సంఖ్యలో ఐరోపాలో రష్యా తర్వాతి స్థానం బ్రిటన్‌దే.

9. కశ్మీర్‌ లోయలో చాలా భయంగా ఉంది.. అందుకే ఊరికి పోతున్నాం!

కశ్మీర్‌ లోయలో వరుస ఉగ్రదాడులతో అక్కడి స్థానికేతరుల్లో భయానక వాతావరణం నెలకొంది. కశ్మీర్‌ పౌరులతో పాటు ఉపాధి కోసం పొట్టచేతబట్టుకొని వలస వచ్చిన కూలీలను సైతం ఉగ్రమూకలు చంపేస్తుండటంతో అంతా హడలిపోతున్నారు. దీంతో అక్కడ చావలేక, బతకలేని పరిస్థితుల్లో అనేకమంది వలస కూలీలు బిక్కుబిక్కుమంటూ స్వస్థలాలకు పయనమవుతున్నారు. 

10. టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ గెలవడం కోహ్లీకి మరీ మంచిది: గంభీర్

టీమ్ఇండియా సారథిగా విరాట్‌ కోహ్లీ ఈ ప్రపంచకప్‌ సాధిస్తే చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ ఛాంపియన్‌ గౌతమ్‌గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ కోహ్లీ కెరీర్‌లో ఐసీసీ ట్రోఫీ లోటుపై స్పందించాడు. టీమ్‌ఇండియా పొట్టి ప్రపంచకప్‌ సాధించి 14 ఏళ్లు గడిచిందని, దీంతో ఇప్పటికే చాలా కాలంగా ఎదురుచూస్తున్నామని గంభీర్‌ వివరించాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని