Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 22/10/2021 16:57 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. చివరి నిమిషంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

ఇంటర్‌ పరీక్షల్లో తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. ఈ నెల 25 నుంచి జరగాల్సిన ఇంటర్‌ మొదటి పరీక్షలు రద్దు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టింది. ఈ నెల 25 నుంచే పరీక్షలు ఉండగా పిటిషన్‌ వేస్తే ఎలా అని ప్రశ్నించింది. చివరి నిమిషంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. 

2. భాజపాలో విలీనానికి తెదేపా ప్రతిపాదనలు: విజయసాయి

తన స్వలాభం కోసమే తెదేపా అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని మోసం చేశారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఉత్తరాంధ్రలో మాదకద్రవ్యాలకు పురుడు పోసింది తెదేపా నేతలేనన్నారు. విశాఖలో జరిగిన వైకాపా జనాగ్రహ దీక్షలో విజయసాయి మాట్లాడారు. భాజపా పెద్దలకు చంద్రబాబు ప్రతిపాదనలు పంపారనీ.. వైకాపా సర్కారును గద్దె దించితే తెదేపాను భాజపాలో కలుపుతామన్నారంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు.

3. భాజపాపై ఎన్నికల సంఘానికి తెరాస ఫిర్యాదు

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భాజపాతో పాటు ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని తెరాస ఆరోపించింది. ఓటర్లకు డబ్బులు పంచేందుకు బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారంటూ ఆ పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. చాలా మంది పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి గూగుల్‌ పే, ఫోన్‌పేల ద్వారా ఓటర్ల డబ్బు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

4. అక్కడితో నా బాధ్యత పూర్తయ్యింది.. తదుపరి నిర్ణయం విష్ణుదే: కృష్ణమోహన్

‘మా’ ఎన్నికల సీసీ ఫుటేజీ కావాలని ప్రకాశ్‌రాజ్‌ చేసిన ట్వీట్‌పై ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ స్పందించారు. ‘మా’ ఎన్నిక‌ల నిర్వహణ‌తోనే త‌న బాధ్యత పూర్తయ్యింద‌ని, ఆ తర్వాత జోక్యం చేసుకోవడానికి తనకెలాంటి అధికారాలు లేవని స్పష్టం చేశారు. ‘ఫుటేజీ అడిగినప్పుడు పరిశీలించి చెప్తా అన్నాను. కానీ, ఇస్తానని అనలేదు’ అని అన్నారు. ఇకపై అధికారమంతా అధ్యక్షుడి చేతిలోనే ఉంటుందన్నారు. 

5. సుధా చంద్రన్‌కు సీఐఎస్‌ఎఫ్‌ క్షమాపణ

ప్రముఖ నర్తకి, నటి సుధా చంద్రన్‌కు సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) క్షమాపణ చెప్పింది. విమానాశ్రయాల్లో తనలాంటి కృత్రిమ అవయదారులకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళుతూ ఆమె ఓ వీడియోను పోస్ట్‌ చేసిన నేపథ్యంలో సీఐఎస్ఎఫ్‌ ఈ విధంగా స్పందించింది. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా తమ సిబ్బందికి అవగాహన కల్పిస్తామని పేర్కొంది.

6. ‘సుప్రీం’ విజయం.. ఆ 39 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌

భారత సైన్యంలో మరో 39 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా దక్కనుంది. ఈ హోదా కోసం వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ అధికారిణులకు విజయం లభించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం వారికి శాశ్వత కమిషన్‌ హోదా కల్పించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నేడు కోర్టుకు వెల్లడించింది.

7. ‘ఆపరేషన్‌ సర్ప్‌వినాశ్‌’ను తలపించేలా  పూంచ్‌ ఎన్‌కౌంటర్‌..

కశ్మీర్‌లో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ ఎన్‌కౌంటర్‌ జరుగుతోంది. 2003 తర్వాత ఈ స్థాయి ఎన్‌కౌంటర్‌ను కశ్మీర్‌ ప్రజలు చూడలేదు. పూంచ్‌లోని మెందహార్‌, సురాన్‌ కోటె రాజౌరీలోని థాన్మండీ అడవుల్లో నిన్న ఇరు పక్షాల నుంచి కాల్పులు నెమ్మదించినా.. నేడు మళ్లీ హోరాహోరీ పోరు మొదలైంది. నేటి తెల్లవారుజామున భారీగా కాల్పులు మొదలయ్యాయి. దీంతోపాటు ఐఈడీ పేలుళ్ల శబ్దాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

8. వరుసగా నాలుగో రోజూ నష్టాలే!

కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీల్లో వరుసగా నాలుగో రోజైన శుక్రవారమూ నష్టాలు తప్పలేదు. ఉదయం సెన్సెక్స్‌ 61,044 వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. 60,551 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 101 పాయింట్ల నష్టంతో 60,821 వద్ద ముగిసింది. నిఫ్టీ రోజులో 18,314 - 18,034 మధ్య కదలాడింది. చివరకు 63 పాయింట్ల నష్టంతో 18,114 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 సూచీలో 12 షేర్లు లాభపడ్డాయి.

9. ‘చైనా, రష్యాలకు తెలుసు మా బలం ఏంటో.. తైవాన్‌ను రక్షిస్తాం’

చైనా- తైవాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ చైనా దాడికి దిగితే.. తైవాన్‌ను తాము రక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయమై తైవాన్‌తో కమిట్‌మెంట్‌ ఉందని వెల్లడించారు. ‘అగ్రరాజ్యం సైనిక బలం గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చైనా, రష్యా సహా ఇతర దేశాలకూ తెలుసు.. తాము ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మిలిటరీ దేశం అని’ ఆయన పేర్కొన్నారు.

10. ‘వాళ్లకు అన్యాయం చేయలేక.. డివిలియర్స్‌ను ఎంపిక చేయలేదు’

2019 వన్డే ప్రపంచకప్‌ జట్టులో దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు, మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌ను తీసుకోకపోవడానికి గల కారణాన్ని ఆ జట్టు మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ లిండాజోండి తాజాగా వెల్లడించారు. ఇతర ఆటగాళ్లకు అన్యాయం చేయలేకే ఏబీడీని ఎంపిక చేయలేదన్నారు. డివిలియర్స్‌ కెరీర్‌లో మంచి స్థితిలో ఉండగా 34 ఏళ్లకే 2018 మేలో అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించి క్రికెట్‌ అభిమానులని ఆశ్చర్యానికి గురిచేశాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని