Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 26/10/2021 16:55 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. రైతుల చేయి పట్టుకుని నడిపించేలా ఆర్బీకే వ్యవస్థ: జగన్‌

రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడం సహా వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం నిధులను సీఎం విడుదల చేశారు. తాము అధికారంలోకి వచ్చాక రైతులకు ఇచ్చిన హామీల్లో వంద శాతం నెరవేర్చినట్లు జగన్‌ తెలిపారు. 

2. వ్యాక్సినేషన్‌పై దుష్ప్రచారం.. వాటిని నమ్మొద్దు: డీహెచ్‌

రాష్ట్రంలో వ్యాక్సిన్‌ తీసుకోకుంటే రేషన్‌, పెన్షన్‌ నిలిపివేస్తారంటూ వస్తోన్న వార్తలను తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు ఖండించారు. ప్రజలు అసత్య ప్రచారం నమ్మొద్దని.. ఆందోళనకు గురి కావొద్దని సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వ్యాక్సినేషన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని.. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

3. సివిల్‌ వివాదాల్లో పోలీసుల జోక్యమా.. సుప్రీం తీర్పునకు విరుద్ధం: హైకోర్టు

సివిల్‌ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్పష్టం చేసింది. మహిళా కార్యదర్శులు సివిల్‌ వివాదాలు పరిష్కరించవచ్చునని ఏపీ ప్రభుత్వం పేర్కొనడంపై ఉన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. గ్రామ సచివాలయాల్లో మహిళా కార్యదర్శులను పోలీసులుగా నియమించడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.

4. సాగర్ ఎడమ కాలువను ఇష్టారీతిగా పెంచుకున్నారు!

ఉమ్మడి రాష్ట్రాల ప్రభుత్వాలు తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు నివేదికలు బేఖాతరు చేసి సాగర్ ఎడమ కాలువను ఇష్టారీతిగా పెంచుకుంటూ పోయారని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ ఆరోపించారు. 1952లో హైదరాబాద్ రాష్ట్రం తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు నివేదికలో ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు నందిగామ తాలుకాలోని కట్లేరు వాగు వరకు మాత్రమే ప్రతిపాదించారన్నారు. మద్రాసు రాష్ట్రంలో ప్రతిపాదించిన ఆయకట్టు 1.3 లక్షల ఎకరాలు మాత్రమేనని ఈఎన్‌సీ గుర్తు చేశారు. ఈ మేరకు కే‌ఆర్‌ఎం‌బీ ఛైర్మన్‌కు ఈఎన్‌సీ మురళీధర్‌ రెండు వేర్వేరు లేఖలు రాశారు.

5. LIC Jeevan Umang: ఈ పాలసీతో 100 ఏళ్లు వరకు ఆదాయం!

ప్రభుత్వ బీమా రంగ సంస్థ ఎల్‌ఐసీ ఎప్పటికప్పుడు సామాన్యులను దృష్టిలో పెట్టుకొని కొత్త పథకాలతో ధీమా కల్పిస్తోంది. అందులో భాగంగా తీసుకొచ్చిన జీవన్‌ ఉమంగ్‌ అనే పథకానికి భారీ ఆదరణ లభిస్తోంది. దీంట్లో పాలసీదారుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసాతో ఉంటుంది. అలాగే పాలసీ మొత్తం ప్రీమియంలు పూర్తిగా చెల్లిస్తే ఫించను తరహాలో పాలసీలో నిర్దేశించిన కాలపరిమితికి ప్రయోజనాలు కూడా అందుతాయి.

6. ఆ ఘటనలో కేవలం 23 మంది సాక్షులేనా..?

లఖింపుర్ ఖేరి కేసు విషయంలో ఉత్తర్‌ప్రదేశ్ (యూపీ) ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై మంగళవారం సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ కేసులో కేవలం 23 మంది ప్రత్యక్ష సాక్షులే ఎందుకు ఉన్నారని నిలదీసింది. ఇంకా ఎక్కువ మంది సాక్షుల్ని గుర్తించి, వారికి రక్షణ కల్పించాలని ఆదేశించింది.

7. నేతల మధ్య ఐక్యత కొరవడింది : సోనియా!

వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ పార్టీ నేతలు క్రమశిక్షణ, ఐక్యతతో మెలగాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ సూచించారు. వ్యక్తిగత అజెండాలను పక్కనబెట్టి పార్టీ బలోపేతానికి కృషిచేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. దిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో వచ్చే ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

8. సూడాన్‌కు అమెరికా భారీ షాక్‌

సూడాన్‌లో తాజాగా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సైన్యం.. తాత్కాలిక ప్రధాని అబ్దుల్లా హమ్‌డోక్‌ సహా పలువురు అధికారులను నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇదిలా ఉండగా.. తాజాగా అమెరికా ఈ తిరుగుబాటు చర్యను తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలో సూడాన్‌కు 700 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

9. చైనాలో మళ్లీ లాక్‌డౌన్‌.. 40లక్షల జనాభా ఉన్న నగరం మూసివేత

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి వ్యాప్తి చైనాలో మళ్లీ పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య ఎక్కువవుతుండటంతో అప్రమత్తమైన డ్రాగన్‌.. మరోసారి ఆంక్షల బాట పట్టింది. ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో స్కూళ్లు, పర్యాటక ప్రదేశాలను మూసివేసిన చైనా.. తాజాగా 40లక్షల జనాభా కలిగిన లాన్‌జువో నగరంలో లాక్‌డౌన్‌ విధించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని గట్టిగా చెప్పింది.

10. నా భర్త ప్రాణాలకు హాని ఉంది: సమీర్‌ వాంఖడే భార్య

ముంబయి క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఆర్యన్‌ఖాన్‌ విడుదలకు డబ్బులు డిమాండ్‌ చేశారంటూ ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై వచ్చిన ఆరోపణలపై ఆయన భార్య, మరాఠీ నటి క్రాంతి రెడ్కర్‌ స్పందించారు. సమీర్‌ నిజాయతీపరుడని, అందుకే ఆయనకు శత్రువులు ఉన్నారన్నారు. బాలీవుడ్‌ సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్‌ చేసి వారి నుంచి వాంఖడే డబ్బులు వసూలు చేసేవారంటూ మంత్రి నవాబ్‌ మాలిక్‌ చేసిన ఆరోపణల్ని ఆమె ఖండించారు. తన భర్తకు ప్రాణహాని ఉందన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని